Telugu Global
Andhra Pradesh

దబాయింపు పనిచేయలేదా?

ఐటీ శాఖ జారీ చేసిన నాలుగు నోటీసులకు చంద్రబాబు దబాయింపు పద్ధ‌తిలోనే సమాధానం ఇచ్చారు. దాంతో ఫైనల్‌గా షోకాజ్ నోటీసిచ్చింది.. సమాధానం చెప్పకపోతే జరగబోయే పర్యవసానాలను కూడా హెచ్చరించింది. దాంతో చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది.

దబాయింపు పనిచేయలేదా?
X

‘నీకు సీఐడీ ఉంటే నాకూ సీఐడీ ఉంది… నీకు ఏసీబీ ఉంటే నాకూ ఏసీబీ ఉంది… నీకు పోలీసులుంటే నాకూ పోలీసులున్నారు’.. ఇది 2014-15లో ఓటుకు నోటు కేసులో దొరికిన తర్వాత చంద్రబాబు చేసిన దబాయింపు. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయి ఇక ఈ రోజో రేపో చంద్రబాబు అరెస్టు తప్పదని అందరు అనుకుంటున్నారు. ఆ సమయంలో మేకపోతు గాంభీర్యాన్ని తెచ్చుకుని కేసీఆర్‌, కేటీఆర్‌ను ఉద్దేశించి చంద్రబాబు చేసిన బెదింపులే పైవి.

చంద్రబాబు దగ్గర ఒక లక్షణముంది. అదేమిటంటే తనకు ఇబ్బంది వస్తుందని అనుకున్నా వెంటనే ఎదురుదాడికి దిగేస్తారు. ఎదుటివాళ్ళని మాటలతో భయపెట్టే ప్రయత్నం చేస్తారు. ఇప్పుడు ఐటీ శాఖ విషయంలో కూడా అలాగే చేశారు. అమరావతి రాజధాని నిర్మాణాల్లో షాపూర్జీ పల్లోంజి కంపెనీ నుండి రూ. 118 కోట్ల ముడుపులను అందుకున్నారని ఐటీ శాఖ తేల్చింది. షాపూర్జీ కంపెనీ నుండి సబ్ కాంట్రక్టు తీసుకున్న బిల్డర్ మనోజ్ వాసుదేవ్ పర్దాసాని ద్వారా చంద్రబాబు పీఏ శ్రీనివాస్ రూ.118 కోట్లు ముడుపులు అందుకున్నట్లు ఐటీ శాఖ చెప్పింది. దానికి సమాధానం ఇవ్వమని చంద్రబాబుకు నోటీసిచ్చింది.

ముడుపులు అందుకుంటే అందుకున్నానని లేకపోతే లేదని సమాధానం చెప్పాలి. కానీ చంద్రబాబు అలా చేయకుండా తనను విచారించే అర్హతే ఐటీ శాఖకు లేదన్నారు. సెంట్రల్ సర్కిల్ ఉండగా హైదరాబాద్ సర్కిల్ అధికారులు తనకు నోటీసు ఇవ్వటం ఏమిటని దబాయించారు. తనను విచారించే అధికారం మీకుందా అని నిలదీశారు. దానికి స‌మాధానంగా ఐటీ శాఖ మ‌ళ్లీ నోటీసులు ఇచ్చింది. ఇలా ఐటీ శాఖ-చంద్రబాబు మధ్య నాలుగు సార్లు నోటీసులు, సమాధానాలు నడిచాయి. ముఖ్యమంత్రిగా చేసిన వ్య‌క్తి క‌దా అని బహుశా కాస్త మర్యాద ఇచ్చుంటారు.

అయితే నాలుగు నోటీసులకు చంద్రబాబు దబాయింపు పద్ధ‌తిలోనే సమాధానం ఇచ్చారు. దాంతో ఫైనల్‌గా షోకాజ్ నోటీసిచ్చింది. అందులో ముడుపులు ఇచ్చింది ఎవరు, తీసుకున్నది ఎవరు? ఏ రూపంలో, ఏ వ్యక్తులు తీసుకున్నారనే పూర్తి వివరాలను చెప్పి దీనికి సమాధానం ఇవ్వమన్నది. పనిలోపనిగా చంద్రబాబును ప్రశ్నించటానికి తమకున్న అధికారాలు, పరిధిని కూడా వివరించింది. షోకాజ్ నోటీసుకు సమాధానం చెప్పకపోతే జరగబోయే పర్యవసానాలను కూడా హెచ్చరించింది. దాంతో చంద్రబాబులో టెన్షన్ పెరిగిపోతోంది. అంటే ఐటీ శాఖ ముందు చంద్రబాబు దబాయింపు పనిచేయలేదని అర్థ‌మవుతోంది.

First Published:  7 Sept 2023 10:56 AM IST
Next Story