జగన్ 'బస్సుయాత్ర'కు పోటీగా బాబు 'ప్రజా గళం' షెడ్యూల్ ఫిక్స్
మీడియా, సోషల్ మీడియా అటెన్షన్ అంతా జగన్ వైపు ఉండకుండా చూసేందుకు చంద్రబాబు వేసిన ప్లాన్ ఇది. మరి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
వైసీపీ 'సిద్ధం' సభలు ఏ రేంజ్ లో సక్సెస్ అయ్యాయో అందరికీ తెలుసు. మీడియాతో పాటు, సోషల్ మీడియా అంతా అవే కబుర్లు, అవే హైలైట్లు. ఈసారి 'మేమంతా సిద్ధం' పేరుతో బస్సుయాత్ర కూడా ప్రారంభిస్తున్నారు సీఎం జగన్. ఈనెల 27న ఇడుపులపాయ నుంచి ఈ యాత్ర మొదలవుతుంది. అయితే దీనికి పోటీగా ఈసారి చంద్రబాబు 'ప్రజాగళం'అంటూ తెరపైకి వస్తున్నారు. పోటీగా అదే రోజు 'ప్రజాగళం' షెడ్యూల్ మొదలు పెట్టారు. మీడియా అటెన్షన్ అంతా జగన్ వైపు ఉండకుండా చూసేందుకు చంద్రబాబు వేసిన ప్లాన్ ఇది. మరి ఇది ఎంతవరకు వర్కవుట్ అవుతుందో చూడాలి.
ఈ నెల 27 నుంచి చంద్రబాబు 'ప్రజాగళం' యాత్ర మొదలవుతుంది. రోజుకు 3 నుంచి 4 నియోజకవర్గాల్లో సభలు, రోడ్ షోలు కొనసాగుతాయి. ఈమేరకు టీడీపీ షెడ్యూల్ ఫిక్స్ చేసింది. ఈనెల 27న పలమనేరు, నగరి, నెల్లూరు రూరల్ నియోజకవర్గాల్లో ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు చంద్రబాబు. ఈనెల 28న రాప్తాడు, శింగనమల, కదిరి.. 29న శ్రీశైలం, నందికొట్కూరు, కర్నూలు.. 30న మైదుకూరు, ప్రొద్దుటూరు, సూళ్లూరుపేట, శ్రీకాళహస్తిలో ప్రచారం చేపడతారు. 31వ తేదీన కావలి, మార్కాపురం, సంతనూతలపాడు, ఒంగోలులో ఆయన పర్యటిస్తారు. ఆతర్వాత రెండు రోజులు కుప్పం పర్యటనకు కేటాయించారు బాబు.
ఇక సీఎం జగన్ యాత్ర విషయానికొస్తే ఈనెల 27తో మొదలయ్యే 'మేమంతా సిద్ధం' యాత్రలు 21రోజులపాటు నాన్ స్టాప్ గా కొనసాగుతాయి. ఇడుపులపాయతో మొదలు పెడితే ఇచ్ఛాపురం వరకు ఈ యాత్ర సాగుతుంది. గతంలో సిద్ధం సభలు నిర్వహించిన నాలుగు జిల్లాలు మినహా మిగతా జిల్లాల్లో యాత్ర ఉంటుంది. అంటే ఈ బస్సు యాత్ర విశాఖపట్నం, ఏలూరు, అనంతపురం, బాపట్ల జిల్లాలను టచ్ చేయదు. ప్రతి రోజూ ఒక పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలో బస్సు యాత్ర ఉంటుంది. ఉదయం వివిధ వర్గాలతో సమావేశం, స్థానిక నాయకులతో మీటింగ్, మధ్యాహ్నం నుంచి బహిరంగ సభ.. ఇలా ప్లాన్ చేశారు. వీరిద్దరిలో ఎవరి యాత్ర సక్సెస్ అవుతుంది, ఎవరికి ప్రజలు బ్రహ్మరథం పడతారనేది ముందు ముందు తేలిపోతుంది.