శివరాత్రి రోజున అమిత్‌షా దర్శనం కోసం బాబు, పవన్ పడిగాపులు
షా గారు రమ్మన్నారు.. పండగ పూట పొత్తు మీద మంచి మాటేమన్నా చెబుతారేమోనని అటు చంద్రబాబు, ఇటు పవన్ ఢిల్లీలోనే వేచి ఉన్నారు.
శివరాత్రికి శివుడి దర్శనం చేసుకుంటే పుణ్యం వస్తుందంటారు. ఈ పర్వదినాన ఆ ఈశ్వరుని దర్శనం కోసం ఆలయాల్లో క్యూలైన్లలో నిలబడి మరీ ఎదురుచూస్తారు. కానీ, పాపం చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లకు అవకాశం లేకుండా పోయింది. బీజేపీలో మోడీ తర్వాత ఎలాంటి నిర్ణయమైనా తీసుకోగలిగే పవర్‌ఫుల్ అమిత్ షా దర్శనం కోసం వాళ్లిద్దరూ ఢిల్లీలో కళ్లలో వొత్తులేసుకుని ఎదురుచూస్తున్నారు. ఆయన దర్శనమైతే స్వామీ.. పొత్తు వరమివ్వు అని ప్రార్థించడానికి రెడీగా ఉన్నారు.
నిన్నటి భేటీలో ఏం జరగలే!
నిన్న రాత్రి 9 గంటలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్‌లతో అమిత్‌షా ఒకసారి భేటీ అయ్యారు. ఫిబ్రవరి 7న చంద్రబాబు ఆయన్ను కలిసి పొత్తు గురించి విన్నవించి వెళితే సరిగ్గా నెల తర్వాత పిలుపొచ్చింది. ఆ పిలుపు కోసం ఎదురుచూస్తున్న బాబు, పవన్‌ను కూడా పిలుచుకుని ఢిల్లీ పరిగెత్తాడు. తీరా చూస్తే నిన్నటి భేటీలో వీళ్లకు మాట్లాడే సీన్ ఇవ్వకుండా మాకిన్ని ఎంపీ సీట్లు, ఇన్ని ఎమ్మెల్యే సీట్లు కావాలబ్బాయ్‌లు అని అమిత్‌షా కూల్‌గా ఓ నంబర్ చెప్పేసి ఊరుకున్నారని, దాన్ని తగ్గించడానికి బాబు, పవన్ కిందా మీదా పడ్డారని పొలిటికల్ సర్కిల్స్‌లో టాక్. ఇది ఇప్పట్లో తెగే యవ్వారం కాదనుకున్న షా.. రేప్పొద్దున్న కలుద్దామోయ్ అని చెప్పేసి వెళ్లిపోయారు.
పొద్దుటి నుంచి నిరీక్షణ
షా గారు రమ్మన్నారు.. పండగ పూట పొత్తు మీద మంచి మాటేమన్నా చెబుతారేమోనని అటు చంద్రబాబు, ఇటు పవన్ ఢిల్లీలోనే వేచి ఉన్నారు. పొద్దున్నుంచి హోం మంత్రి గారి నుంచి కబురు కోసం నిరీక్షిస్తున్నారు. దీనిపై టీడీపీ ఎంపీలు అమిత్‌షా ఆఫీస్‌ను సంప్రదిస్తుంటే ఒడిశా, మహారాష్ట్రలకు సంబంధించిన పొత్తుల్లో సార్ బిజీగా ఉన్నారని సమాధానం వస్తోంది. ఈరోజు కూడా అర్ధరాత్రి వరకు నిరీక్షణ తప్పదని సమాచారం. అయినాగానీ శివరాత్రి జాగారం చేసైనా సరే పెద్ద సేఠ్ గారిని ప్రసన్నం చేసుకునే వెళ్లాలని బాబు, పవన్ చెరో చోట కూర్చుని వెయిట్ చేస్తూనే ఉన్నారు. తన కాన్వాయ్‌పై రాళ్లేయించి, నల్లజెండాలు చూపించిన చంద్రబాబుకు ఆ మాత్రం ట్రీట్‌మెంట్ ఇవ్వాలని అమిత్‌షా కోరుకోవడంలో తప్పేమన్నా ఉందా?