Telugu Global
Andhra Pradesh

చెప్పకూడనిది చెప్పేస్తున్నారా?

తమ మీటింగులకు వచ్చేవాళ్ళు, కలుస్తున్న వాళ్ళు కూడా తమకు ఓట్లేయటంలేదని పవన్, చంద్రబాబు బహిరంగంగా చెబితే ప్రత్యర్థుల ముందు ఎంత పలుచనైపోతామో అనే విషయాన్ని వీళ్ళు ఆలోచించటంలేదు.

చెప్పకూడనిది చెప్పేస్తున్నారా?
X

ఆరు నెలలు సావాసం చేస్తే వారు వీరవుతారనే సామెత చంద్రబాబునాయుడికి సరిగ్గా సరిపోతుంది. జనసేన అధినేత పవన్ కల్యాణ్‌తో అధికారికంగా పొత్తు లేకపోయినా అనధికారిక మిత్రపక్షంగా టీడీపీ కంటిన్యూ అవుతోంది. కారణాలు ఏవైనా తరచూ ఏదో సందర్భంగా చంద్రబాబునాయుడు, పవన్ కల్యాణ్ కలుస్తునే ఉన్నారు. అందుకనే ఏమో పవన్ లాగే చంద్రబాబు కూడా మాట్లాడేశారు. ఇంతకీ విషయం ఏమిటంటే వైజాగ్‌లో మొన్న ఆగస్టు 15న చంద్రబాబు విజన్-2047 డాక్యుమెంటును రిలీజ్ చేసిన విషయం తెలిసిందే.

ఆ సందర్భంగా వేదిక మీద మాట్లాడుతూ.. ఒక విషయం చెప్పారు. అదేమిటంటే తన పర్యటనల్లో ఎంతోమంది కలుస్తుంటారట. తనతో ఫొటోలు దిగేవాళ్ళు, సెల్ఫీలు దిగేవాళ్ళంతా తాము హ్యాపీగా ఉన్నామంటే తానే కారణమని చెబుతారట. తనను కలిసిన వాళ్ళల్లో చాలామంది ‘సార్ మీ వల్లే ఇంజనీరింగ్ చదువుకున్నామని, విదేశాలకు వెళ్ళామ’ని చెబుతారట. పెద్ద ఉద్యోగాల్లో ఉన్నామంటే తానే కారణమని కూడా అంటారట. అయితే ఇన్ని మాటలు చెప్పే వీళ్ళు ఓట్లు మాత్రం టీడీపీకి వేయటంలేదట. మరి తనకు ఓట్లేయని వాళ్ళు తనతో ఎందుకు ఫొటోలు దిగుతున్నారు? ఎందుకు సెల్ఫీలు దిగుతున్నారో అర్థంకావటంలేదన్నారు.

ఇప్పుడు పవన్ విషయం చూద్దాం పవర్ స్టార్ ఎక్కడ మాట్లాడినా ఒకటే మాటంటారు. అదేమిటంటే రోడ్డుషోల్లో పాల్గొంటారు, మీటింగుల్లో పాల్గొంటారు. ఎక్కడ సభల్లో పాల్గొన్నా పవన్ సీఎం.. పవన్ సీఎం అని అరుస్తారు కానీ ఓట్లు మాత్రం వైసీపీకే వేస్తారు అని ఎన్నిసార్లు నిష్టూరంగా మాట్లాడారో లెక్కలేదు. రోడ్డుషోలో పాల్గొన్న వాళ్ళంతా తనకు ఓట్లేసి గెలిపిస్తారనే నమ్మకంలేదని కాకినాడ రోడ్డుషోలో పవన్ అన్నమాట గుర్తుండే ఉంటుంది.

తమ మీటింగులకు వచ్చేవాళ్ళు, కలుస్తున్న వాళ్ళు కూడా తమకు ఓట్లేయటంలేదని పవన్, చంద్రబాబు బహిరంగంగా చెబితే ప్రత్యర్థుల ముందు ఎంత పలుచనైపోతామో అనే విషయాన్ని వీళ్ళు ఆలోచించటంలేదు. ఎదుటి వాళ్ళు తమకు ఓట్లేయలేదన్న విషయం తెలిసినా, పది మందిలో ఆ విషయాన్ని ప్రస్తావించకూడదని వీళ్ళు మరచిపోయారా లేకపోతే ఆవేశంలో మనసులోని కోపం, ఉక్రోషం బయటకు తన్నుకొచ్చేస్తోందా అర్థంకావటంలేదు. చంద్రబాబు గతంలో ఎప్పుడూ ఈ విధంగా మాట్లాడిందిలేదు. పార్టీ మీటింగుల్లో కూడా ఇప్పుడు ఇలాగే మాట్లాడుతున్నారు. ఎందుకిలా మాట్లాడారో అర్థంకావటంలేదు.

First Published:  19 Aug 2023 11:17 AM IST
Next Story