Telugu Global
Andhra Pradesh

బాబు, పవన్ భయం అదే.. అందుకే ఈసీ ముందుకు

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయని సీఈసీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు పవన్ కల్యాణ్. అన్ని అంశాలను చంద్రబాబు సీఈసీకి వివరించారని చెప్పారు పవన్.

బాబు, పవన్ భయం అదే.. అందుకే ఈసీ ముందుకు
X

ఏపీ ఎన్నికల విషయంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ కి ఒక విషయంలో భయం పట్టుకుంది. మొన్నటి వరకు వాలంటీర్ల దగ్గర ఓటర్ల లిస్ట్ ఉందంటూ గొడవ చేసిన వీరిద్దరూ.. ఇప్పుడు సచివాలయ సిబ్బందిపై కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. విజయవాడలోని ఓ హోటల్ లో సీఈసీ రాజీవ్ కుమార్ ని కలసి రాష్ట్రంలో ఓటర్ల జాబితాలో అక్రమాలు జరుగుతున్నాయని చెప్పారు. నకిలీ ఓట్లు చేర్చుతున్నారని, కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు.


దొంగఓట్లున్నాయి..

రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో దొంగ ఓట్లు నమోదవుతున్నాయని సీఈసీకి ఫిర్యాదు చేసినట్టు తెలిపారు పవన్ కల్యాణ్. చంద్రగిరి నియోజకవర్గంలో దాదాపు లక్షకు పైగా దొంగ ఓట్లు నమోదయ్యాయని ఆయన ఆరోపించారు. ఎన్నికల కమిషన్ దృష్టిసారించకపోతే ఏపీలో ప్రజాస్వామ్యం ఖూనీ అయిపోతుందన్నారు. గత స్థానిక ఎన్నికల్లో దళితులు నామినేషన్ వేసే పరిస్థితి కూడా లేదన్నారు. వీటన్నిటినీ పరిశీలించాలని కోరామన్నారు పవన్. అన్ని అంశాలను చంద్రబాబు సీఈసీకి వివరించారని చెప్పారు.


ఓటరు జాబితాలో అవకతవకలపై సీఈసీకి ఫిర్యాదు చేశామని చెప్పారు చంద్రబాబు. ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై అక్రమంగా కేసులు నమోదు చేస్తున్నారన్నారు. టీడీపీ, జనసేన నేతలపై దాదాపు 7వేల కేసులు పెట్టారన్నారు. పుంగనూరు కేసులో 200 మందికి పైగా జైలుకు వెళ్లి వచ్చారని.. ఎన్నికల్లో ప్రతిపక్షాలకు అనుకూలంగా ఎవరినీ పనిచేయకుండా చేసేందుకే అక్రమ కేసులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడేలా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని తమకు సీఈసీ హామీ ఇచ్చినట్టు చెప్పారు చంద్రబాబు.

వారికి విధులు అప్పగించొద్దు..

ఎన్నికల విధులకు అనుభవం ఉన్న సిబ్బందిని నియమించాలని సీఈసీకి చెప్పామని అన్నారు చంద్రబాబు. సచివాలయ సిబ్బంది, వాలంటీర్లను విధుల్లో ఉంచడం సరికాదన్నారు. బీఎల్‌వోలుగా సచివాలయాల్లో పనిచేసే 2,600 మంది మహిళా పోలీసులను నియమించారని అన్నారు. ప్రభుత్వమే అక్రమాలకు అవకాశం కల్పిస్తోందన్ననారు చంద్రబాబు.

First Published:  9 Jan 2024 2:08 PM IST
Next Story