Telugu Global
Andhra Pradesh

బీజేపీ కాదంటే మన పరిస్థితేంటి..?

రెండో లిస్ట్ కోసం భేటీ అంటూ మీడియాకు లీకులిచ్చి.. బీజేపీపై చంద్రబాబు ఒత్తిడి పెంచుతున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తమ్మీద ఢిల్లీలో బీజేపీ నాన్చుతోంది, ఇక్కడ కూటమిలో టెన్షన్ మొదలైంది.

బీజేపీ కాదంటే మన పరిస్థితేంటి..?
X

ఏపీలో టీడీపీ-జనసేన కలసి నడుస్తున్నాయి. ఈ కూటమిలోకి బీజేపీ వస్తుందా లేదా అనేది సస్పెన్స్ గానే ఉంది. చంద్రబాబు ఢిల్లీ రాయబారాలు ఫలించలేదు. బీజేపీకి సీట్లు వదిలిపెట్టి రెండో లిస్ట్ విడుదల చేయకుండా వేచి చూస్తున్నా కూడా కమలదళం కనికరించడం లేదు. ఈ దశలో చంద్రబాబు, పవన్ కల్యాణ్ మల్లగుల్లాలు పడుతున్నారు. తాజాగా ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన పవన్ ఆయనతో సుదీర్ఘ చర్చలు జరిపారు.

సెకండ్ లిస్ట్ కోసమేనా..?

ఏపీలో వైసీపీ దాదాపుగా అభ్యర్థుల్ని ఖరారు చేసింది. సిట్టింగ్ లను మార్చే స్థానాలను ముందుగా ప్రకటించారు సీఎం జగన్, మిగతా చోట్ల సిట్టింగ్ లకే టికెట్లు ఖాయమని హింటిచ్చారు. టీడీపీ-జనసేన కూటమి మాత్రం ఫస్ట్ లిస్ట్ ప్రకటించి రెండో లిస్ట్ విషయంలో టెన్షన్ పడుతోంది. బీజేపీ కాదంటే తమ పరిస్థితి ఏంటని ఆలోచనలో పడింది కూటమి. బీజేపీ నుంచి సిగ్నల్ వచ్చేలోగా రెండో లిస్ట్ రెడీ చేసి పెట్టుకోడానికి ప్రయత్నాలు మాత్రం మొదలయ్యాయి. చంద్రబాబు, పవన్ తాజా భేటీ సెకండ్ లిస్ట్ కోసమేనని ఆ పార్టీల నేతలు అంటున్నారు.

ఢిల్లీలో ఏపీ రాజకీయం..

ఇప్పటికే బీజేపీ ఏపీ అధ్యక్షురాలు పురందరేశ్వరి ఢిల్లీ వెళ్లారు.. పొత్తులపై బీజేపీ హైకమాండ్‌తో ఆమె చర్చలు జరిపే అవకాశముంది. ఇదే సమయంలో చంద్రబాబు, పవన్‌ భేటీ ఆసక్తికరంగా మారింది. త్వరలో చంద్రబాబు కూడా ఢిల్లీ వెళ్లే అకాశాలున్నాయి. రెండో లిస్ట్ కోసం భేటీ అంటూ మీడియాకు లీకులిచ్చి.. బీజేపీపై చంద్రబాబు ఒత్తిడి పెంచుతున్నారా అనే చర్చ కూడా జరుగుతోంది. మొత్తమ్మీద ఢిల్లీలో బీజేపీ నాన్చుతోంది, ఇక్కడ కూటమిలో టెన్షన్ మొదలైంది. బీజేపీ అధినాయకత్వం ఏ విషయం తేల్చి చెబితేనే చంద్రబాబు-పవన్ అడుగులు ముందుకు పడే అవకాశముంది.

First Published:  6 March 2024 11:19 AM IST
Next Story