ప్రస్తుతానికి సమానమే.. ముందుంది ముసళ్ల పండగ
కేబినెట్ లో పవన్ తో పాటు జనసేనకు 4 బెర్త్ లు లభించడం విశేషమే అయినా.. వారిని పదవుల్లో కుదురుకోనిస్తారా లేదా అనేది అనుమానమే. కేవలం పదవులిచ్చి, పెత్తనం టీడీపీ నేతల చేతుల్లో పెట్టుకుంటే మాత్రం జనసేన మోసపోయినట్టే లెక్క.
కూటమి కట్టినప్పటి నుంచి విజయం వరకు చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఒకే మాట మీద వెళ్లారు. ఎక్కడా అభిప్రాయ భేదాలు లేకుండా చూసుకున్నారు. ముందు గెలవాలి, ఆ తర్వాతే ఏదయినా అనే పంథాలో గెలుపుకోసమే పనిచేశారు. ఇప్పుడు ప్రభుత్వంలో చేరాక అలాంటి సమన్వయం ఉంటుందా లేదా అనేది మాత్రం అనుమానమే. ఎంత లేదన్నా చంద్రబాబు సీఎం, పవన్ కల్యాణ్ డిప్యూటీ సీఎం. జనసేన కాదన్నా, టీడీపీకి సొంతగా ప్రభుత్వాన్ని నడిపేంత బలం ఉంది. ఈ లెక్కలన్నీ ఇరు వర్గాలకు తెలుసు కాబట్టి ఆ సమన్వయం ఎంత గొప్పగా ఉంటుందనేది ముందు ముందు తేలిపోతుంది.
కుర్చీ మార్చినంత ఈజీ కాదు..
కూటమి శాసన సభాపక్ష సమావేశంలో చంద్రబాబుకి స్పెషల్ కుర్చీ వేయగా.. తనకి కూడా అందరిలాంటి కుర్చీ కావాలని అడిగి మరీ మార్పించారు. అది పబ్లిసిటీ స్టంట్ గా ఉపయోగపడింది. తాను సీఎం, పవన్ డిప్యూటీ సీఎం అయినా.. ఇద్దరం సమానమేనన్నారు కూడా. ఇలాంటి మాటలతో జనసేన నేతల్ని బుట్టలో పడేయడం బాబుకి అలవాటే. కేబినెట్ లో పవన్ తో పాటు జనసేనకు 4 బెర్త్ లు లభించడం విశేషమే అయినా.. వారిని పదవుల్లో కుదురుకోనిస్తారా లేదా అనేది అనుమానమే. కేవలం పదవులిచ్చి, పెత్తనం టీడీపీ నేతల చేతుల్లో పెట్టుకుంటే మాత్రం జనసేన మోసపోయినట్టే లెక్క.
జనసేనకు 100 శాతం స్ట్రైక్ రైట్ ఉందని పవన్ కల్యాణ్ మురిసిపోతే ఆయనంత అమాయకులు ఇంకెవరూ ఉండరు. జనసేన 21 మంది ఎమ్మెల్యేలు లేకపోయినా చంద్రబాబు ఏపీలో సొంతగా ప్రభుత్వాన్ని నడిపించగలరు. ఇప్పుడు బీజేపీకి కూడా 2 ఎంపీ సీట్ల జనసేన కంటే 16 ఎంపీ సీట్ల టీడీపీయే కీలకం. అంటే ఇక్కడ జనసేన-టీడీపీ మైత్రి కంటే.. బీజేపీ-టీడీపీ స్నేహం మరింత బలపడే అవకాశముంది. చివరికి కూరలో కరివేపాకులాగా పవన్ ని పక్కనపడేయకపోతే అదే పదివేలు అనుకోవాల్సిన సందర్భం. ఇప్పటికిప్పుడు చంద్రబాబు ఆ సాహసం చేస్తారనుకోలేం కానీ, పరిస్థితులు తారుమారయితే మాత్రం నష్టపోయేది పవన్ కల్యాణ్ మాత్రమే. అవసరం ఉన్నంత వరకు స్నేహం చేసి, ఆ తర్వాత వదిలించుకోవడం చంద్రబాబుకి అలవాటు. పవన్ కల్యాణ్ విషయంలో అది ఒకసారి రుజువైంది, రెండోసారి రిపీటవుతుందో లేదో చూడాలి.