Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు నోట మళ్లీ అదే మాట..

ఎన్టీఆర్‌ అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని, దేశ రాజకీయాల్లో మార్పు తేవాలని సంకల్పించి వచ్చారని గుర్తు చేశారు చంద్రబాబు.

చంద్రబాబు నోట మళ్లీ అదే మాట..
X

మాట మీద నిలబడని నాయకుడు చంద్రబాబు అంటూ వైరి వర్గాలు పదే పదే విమర్శలు చేస్తున్నా.. ఒక విషయంలో మాత్రం చంద్రబాబు మాట తప్పను, మడమ తిప్పను అంటున్నారు. ఎన్టీఆర్ కి భారత రత్న ఇవ్వాలనే డిమాండ్ ని ఆయన మరోసారి గట్టిగా వినిపించారు. విజయవాడలో ఎన్టీఆర్‌ శత జయంతి ఉత్సవాల అంకురార్పణ సభలో పాల్గొన్న చంద్రబాబు.. ఎన్టీఆర్‌ కి భారత రత్న ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆ పురస్కారం ఇచ్చే వరకు తెలుగు ప్రజలు అడుగుతూనే ఉంటారని, వారి తరపున తాను మాట్లాడుతూనే ఉంటానని అన్నారు.

ఏపీలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు, కేంద్రంలో టీడీపీ అనుకూల పార్టీ అధికారంలో ఉన్నప్పుడు, కేంద్ర మంత్రి వర్గంలో టీడీపీ భాగస్వామి అయినప్పుడు కూడా ఎన్టీఆర్ కి భారత రత్న ఇవ్వాలని ఇంత గట్టిగా డిమాండ్ చేసి ఉండరు చంద్రబాబు. ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ కు భారత రత్న ఇవ్వాల్సిందేనంటూ పట్టుబడుతున్నారు. భారతదేశం గర్వించదగ్గ వ్యక్తి ఎన్టీఆర్‌ అని అన్నారు. ఆయన ఒక వ్యక్తి కాదు, శక్తి అని చెప్పారు.

ఎన్టీఆర్‌ అధికారం కోసం రాజకీయాల్లోకి రాలేదని, దేశ రాజకీయాల్లో మార్పు తేవాలని సంకల్పించి వచ్చారని గుర్తు చేశారు చంద్రబాబు. తెలుగుజాతి అవమానాలకు గురవుతోందని ఆయన బాధపడ్డారని అన్నారు. తెలుగువారి ఆత్మగౌరవం కాపాడటం కోసం ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వచ్చారని చెప్పారు.

బాలయ్య, రజినీకి డబుల్ డోస్..

అటు బాలకృష్ణ, ఇటు రజినీకాంత్ ఇద్దర్నీ పొగడ్తల్లో ముంచెత్తారు చంద్రబాబు. ఎన్టీఆర్ వారసుడిగా బాలయ్య సినీ రంగంలో, రాజకీయాల్లో కూడా రాణిస్తున్నారని, హిందూపురం ఎమ్మెల్యేగా సేవలందిస్తున్నారని, బసవతారకం క్యాన్సర్‌ ఆసుపత్రిని సేవా భావంతో నడిపిస్తున్నారని చెప్పారు చంద్రబాబు. ఇక రజినీకాంత్ మంచి మానవత్వం ఉన్న వ్యక్తి అని కొనియాడారు చంద్రబాబు. రజినీకి జపాన్‌ లో కూడా అభిమానులున్నారని, సినిమా షూటింగ్ సైతం రద్దు చేసుకుని ఎన్టీఆర్ ఉత్సవాలకు ఆయన వచ్చారని చెప్పారు.

First Published:  28 April 2023 10:26 PM IST
Next Story