టీడీపీ కార్యకర్తలకు భారీ ఊరట.. రౌడీషీట్లు తొలగింపు
2019 ఎన్నికలకు ముందు తనపై ఎలాంటి కేసులు లేవని, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏకంగా 22 కేసులు నమోదయ్యాయని, అందులో 2 హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయని చెప్పారు బాబు.
వైసీపీ హయాంలో అన్యాయంగా తమ కార్యకర్తలపై రౌడీషీట్లు తెరిచారని, అక్రమంగా తమపై కేసులు పెట్టారని టీడీపీ నుంచి ఆరోపణలు వినిపించేవి. ఇప్పుడు కూటమి అధికారంలోకి వచ్చాక నేరుగా సీఎం చంద్రబాబు ఈ వ్యవహారంలో పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. టీడీపీ కార్యకర్తలపై పెట్టిన రౌడీషీట్లు తొలగించాలన్నారు. నిజమైన రౌడీషీటర్ల విషయంలో మాత్రం కఠినంగా వ్యవహరించాలని చెప్పారు. నిజమైన రౌడీషీటర్లు అని చంద్రబాబు ఎవరి గురించి అన్నారో పోలీసులు ఆ మాత్రం తెలుసుకోలేరా..? టీడీపీ వాళ్లని వదిలేయండి, వైసీపీ వాళ్లని టార్గెట్ చేయండి అని పరోక్షంగా సీఎం పోలీసులకు హింటిచ్చారని వైసీపీ నుంచి ఆరోపణలు వినపడుతున్నాయి.
కుప్పం నియోజకవర్గ పర్యటనలో భాగంగా అధికారులతో సమావేశమైన చంద్రబాబు గత ప్రభుత్వ హయాంలో అక్రమ కేసులతో తనను కూడా వేధించారన్నారు. 2019 ఎన్నికలకు ముందు తనపై ఎలాంటి కేసులు లేవని, వైసీపీ అధికారంలోకి వచ్చాక ఏకంగా 22 కేసులు నమోదయ్యాయని, అందులో 2 హత్యాయత్నం కేసులు కూడా ఉన్నాయని చెప్పారు బాబు. గత ప్రభుత్వ పెద్దలకు తలొగ్గే పోలీసులు అక్రమంగా కేసులు పెట్టారన్నారు. కూటమి పాలనలో ఎవరిపై కూడా అనవసరంగా కేసులు పెట్టొద్దని, రౌడీషీట్లు తెరవొద్దని ఆదేశాలిచ్చారు.
లక్ష మెజార్టీ దాటాలి..
టీడీపీ నేతలు, కార్యకర్తలతో కూడా చంద్రబాబు సమావేశమయ్యారు. కార్యకర్తలకు ఈసారి కచ్చితంగా న్యాయం చేస్తామన్నారు. తన వెంట తిరిగేవారికి కాకుండా, పార్టీకోసం కష్టపడి పనిచేసేవారికే పదవులు ఇస్తామన్నారు. వైసీపీ హయాంలో కేసుల బాధితులెవరైనా ఉంటే పార్టీ దృష్టికి తీసుకు రావాలని, వారికి న్యాయం చేస్తామన్నారు. 2029 ఎన్నికల్లో కుప్పంలో లక్ష మెజార్టీ దాటాలన్నారు చంద్రబాబు. భవిష్యత్తులో వైసీపీ నేతలు టీడీపీ కార్యకర్తల జోలికి రావాలంటే భయపడేలా చేస్తానని భరోసా ఇచ్చారు.