Telugu Global
Andhra Pradesh

చంద్రబాబులో ‘లక్ష’ భయాలు

కుప్పం పర్యటనలో చంద్ర‌బాబు చాలా వెరైటీగా వ్యవహరిస్తున్నారు. రాబోయే ఎన్నికల్ల తనకు లక్ష ఓట్ల మెజారిటి వచ్చేట్లుగా అందరు కష్టపడి పనిచేస్తామని, ప్రలోభాలకు లొంగమని నేతలు, క్యాడర్‌తో ప్రమాణాలు చేయిస్తున్నారు.

చంద్రబాబులో ‘లక్ష’ భయాలు
X

రాబోయే ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో గెలుపుపై చంద్రబాబునాయుడులో భయం పెరిగిపోతున్నట్లుంది. అందుకనే గతంలో ఎప్పుడూ లేనట్లుగా విచిత్రంగా వ్యవహరిస్తున్నారు. ఇంతకీ చంద్రబాబు చేస్తున్నది ఏమిటంటే ముఖ్యమైన నేతలు, క్యాడర్‌తో ప్రమాణాలు చేయిస్తున్నారు. ఈ నెల 14 నుంచి చంద్రబాబు కుప్పం నియోజకవర్గంలో పర్యటించిన విషయం తెలిసిందే. ఒక‌ప్పుడు ఎన్నికల్లో నామినేషన్ వేయాలంటే కూడా తాను వచ్చేవారు కాదు. తన తరపున లాయర్‌తో నామినేషన్ పత్రాలు పంపించేవారు.

అలాంటి టీడీపీ 2019 ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోయింది. తర్వాత జరిగిన స్థానిక సంస్థ‌ల ఎన్నికల్లో కుప్పంలో పార్టీ తుడిచిపెట్టుకుపోయింది. దాంతో వచ్చే ఎన్నికల్లో గెలుపు కష్టమని అర్థ‌మైపోయినట్లుంది. అందుకనే ప్రతి రెండు నెలలకు మూడు రోజులు క్రమం తప్పకుండా పర్యటిస్తున్నారు. తాజా పర్యటనలో మాత్రం చాలా వెరైటీగా వ్యవహరిస్తున్నారు. నేతలు, క్యాడర్‌తో ఎక్కడికక్కడ ప్రమాణాలు చేయించుకుంటున్నారు. రాబోయే ఎన్నికల్ల తనకు లక్ష ఓట్ల మెజారిటి వచ్చేట్లుగా అందరు కష్టపడి పనిచేస్తామని, ప్రలోభాలకు లొంగమని ప్రమాణాలు చేయిస్తున్నారు.

నేతలు, క్యాడర్‌తో ప్రమాణాలు చేయించుకోవటంతోనే చంద్రబాబులో గెలుపు భయం స్పష్టంగా బయటపడింది. అయినా ఇప్పుడు ప్రమాణం చేసినంత మాత్రాన నేతలు కట్టుబడుంటారని గ్యారెంటీ ఏమిటి? చంద్రబాబు ఎంతో మందికి ఎన్నో హామీలనిచ్చారు. వాటన్నింటికీ కట్టుబడుతున్నారా? మ్యానిఫెస్టో రూపంలో హామీలివ్వటమంటే చంద్రబాబు కూడా జనాలకు ప్రమాణాలు చేసినట్లే కదా. మరి వాటిని చంద్రబాబు నిలుపుకున్నారా? లేదే. చంద్రబాబు ప్రమాణం చేసి తప్పిన‌ప్పుడు నేతలు మాత్రం కట్టుబడుంటారని గ్యారెంటీ ఏముంది?

అసలు వచ్చే ఎన్నికల్లో గెలుస్తారో లేదో నమ్మకం లేదనేట్లుగా పరిస్థితులుంటే లక్ష మెజారిటితో గెలుస్తానని చంద్రబాబు చెప్పటమే భలేగా ఉంది. అయినా చంద్రబాబు గెలుపున‌కు నేతలను కాదు నమ్మకుకోవాల్సింది జనాలనని మరచిపోయినట్లున్నారు. జనాలతో ఓట్లేయించేందుకు మాత్రమే నేతలు, క్యాడర్ పనికొస్తారు. ఓట్లేయాల్సిన జనాలే వేయటానికి ఇష్టపడకపోతే నేతలు, క్యాడర్ ఏమిచేస్తారు? చేసిన ప్రమాణాలు ఎందుకు పనికొస్తాయి? మూడు రోజుల ఎపిసోడ్ చూసిన తర్వాత గెలుపుపై చంద్రబాబులో భయం ఏ స్థాయిలో పెరిగిపోతోందో స్పష్టంగా అర్థ‌మవుతోంది. ముందు ముందు ఇంకెన్ని విన్యాసాలు చూడాలో.

First Published:  17 Jun 2023 4:34 AM GMT
Next Story