సొంత ఫీలింగ్ లేని నేత ఈయనొక్కరేనా?
సొంతం అనే ఫీలింగ్ లేకపోవటం వల్లే పుట్టి పెరిగింది రాయలసీమే అయినా తాను సీమవాసిని అని చెప్పుకోవటానికి చంద్రబాబు పెద్దగా ఇష్టపడరు. కారణం ఏమిటంటే ఇది మనది, మన సొంతమనే ఫీలింగ్ లేకపోవటమే.
ఎవరికైనా ఇది మన సొంతం అనే ఫీలింగ్ ఉంటుంది. అలా లేకపోతే పనిలో శ్రద్ధ ఉండదు, పనిపై అక్కర కూడా రాదు. ఇక రాజకీయాల్లో అయితే ఇలాంటి ఫీలింగ్ చాలా ఇంపార్టెంట్. ఈ ఫీలింగ్ తోనే కొందరు సీఎంలు, మంత్రులు లేదా ఎంఎల్ఏలు అన్నీ తమ జిల్లాకే, ముందు తమ నియోజకవర్గానికే అని చెప్పుకుంటారు. అలాంటి ఫీలింగ్ లేకపోతే డెవలప్మెంట్ సాధ్యంకాదు. అయితే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పనిచేసినా కూడా ఇది నా ప్రాంతం, ఇది నా జిల్లా, నా నియోజకవర్గం అనే ఫీలింగ్ లేని ఏకైక నాయకుడు చంద్రబాబునాయుడు మాత్రమే.
పుట్టి పెరిగి రాజకీయంగా మొదటి అడుగు వేసిన నియోజకవర్గం చంద్రగిరిని వదిలేశారు. అలాగే గడచిన 34 ఏళ్ళుగా ఎంఎల్ఏగా గెలిపించి ఆదరిస్తున్న కుప్పాన్నీ చేయాల్సినంతగా డెవలప్ చేయలేదు. ఇక చిత్తూరు జిల్లా వాసిగా, రాయలసీమ నేతగా ఈ ప్రాంతానికి చేసిందీ ఏమీలేదనే చెప్పాలి. అందుకనే సరిగ్గా ఈ పాయింట్ మీదే వైసీపీ నేతలు పదే పదే రాయలసీమ వాసిగా ఈ ప్రాంతానికి ఏమిచేశావు చెప్పమని సవాళ్ళు విసురుతుంటారు.
ముఖ్యమంత్రులుగా పనిచేసిన జలగం వెంగళరావు, కోట్ల విజయభాస్కరరెడ్డి, వైఎస్సార్ లాంటి వాళ్ళు తమ జిల్లాలకు బాగానే చేసుకున్నారు. సమైక్య రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా పనిచేసిన కిరణ్ కూడా తన నియోజకవర్గంలో సైనిక్ స్కూలు ఏర్పాటు చేసుకున్నారు. కిరణ్ సీఎంగా ఉన్నంతకాలం ప్రత్యేక తెలంగాణా గొడవలు ఎంత స్ధాయిలో జరిగాయో అందరికి తెలిసిందే. ఇన్ని గొడవల మధ్యలో కూడా పీలేరుకు సైనిక్ స్కూలును మంజూరు చేయించుకున్నారు. సొంతం అనే ఫీలింగ్ కారణంగానే తమ హయాంలోనే ఈ అభివృద్ధి జరిగిందని చెప్పుకోవటానికి.
మరి తన వల్లే చంద్రగిరిలో ఈ డెవలప్మెంట్ జరిగింది, కుప్పంలో ఈ డెవలప్మెంట్ తన వల్లే జరిగిందని చెప్పుకునేందుకు చెప్పుకోదగ్గది ఒక్కటి కూడా లేదు. చివరకు కుప్పాన్ని మున్సిపాలిటిగాను, రెవిన్యు డివిజన్ గా కూడా జగన్మోహన్ రెడ్డే చేశారు. సొంతం అనే ఫీలింగ్ లేకపోవటం వల్లే పుట్టి పెరిగింది రాయలసీమే అయినా తాను సీమవాసిని అని చెప్పుకోవటానికి చంద్రబాబు పెద్దగా ఇష్టపడరు. కారణం ఏమిటంటే ఇది మనది, మన సొంతమనే ఫీలింగ్ లేకపోవటమే . వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు కుప్పంలో ఇదే పెద్ద సమస్యగా మారబోతోంది.