చంద్రబాబు చెప్పే నీతి ఇలాగే ఉంటుందా..?
తమ నిర్ణయాన్ని మాత్రం ఎవరు ప్రశ్నించకూడదట. కానీ, జగన్ నిర్ణయానికి మాత్రం ఎదురుతిరగమని చంద్రబాబు చెప్పటంతోనే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నీతిసూత్రాలు ఎలాగుంటాయో అందరికీ మరోసారి తెలిసింది.
ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ చంద్రబాబు నాయుడు చెప్పే నీతి సూక్తులు ఎప్పుడూ ఇలాగే ఉంటాయి. పోలిపల్లిలో జరిగిన యువగళం పాదయాత్ర ముగింపు సభలో చంద్రబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. పొత్తులు, టికెట్ల కేటాయింపుపై హైకమాండ్ ఏమి నిర్ణయం తీసుకున్నా అందరూ ఆమోదించాల్సిందే అని స్పష్టంచేశారు. తన ఆదేశాలను తెలుగుదేశంపార్టీ నేతలకు మాత్రమే కాకుండా జనసేన నేతలకు కూడా వర్తిస్తుందన్నట్లుగా చెప్పుకొచ్చారు. పొత్తులో సీట్ల సంఖ్య, నియోజకవర్గాల కేటాయింపు అన్నీ విషయాలపైన చర్చించే నిర్ణయం తీసుకుంటామన్నారు.
సీన్ కట్ చేస్తే.. వైసీపీ విషయంలో జరగుతున్న డెవలప్మెంట్ల గురించి మాట్లాడుతూ టికెట్లు రాని వాళ్ళని తిరగబడమన్నట్లుగా చెబుతున్నారు. టీడీపీ+జనసేన గెలుపునకు చంద్రబాబు, పవన్ ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నారో వైసీపీ గెలుపునకు జగన్మోహన్ రెడ్డి కూడా అలాంటి నిర్ణయాలే తీసుకుంటారు కదా. తమ నిర్ణయాన్ని పార్టీల్లో ఎవరూ ఎదురు ప్రశ్నించకూడదని ఆశిస్తున్న చంద్రబాబు, పవన్.. వైసీపీలో మాత్రం జగన్ నిర్ణయానికి ఎదురుతిరగమని రెచ్చగొడుతున్నారు.
మంత్రులు, ఎమ్మెల్యేలకు టికెట్లు నిరాకరించటం, లేకపోతే నియోజకవర్గాలను మార్చటం జగన్ చేస్తున్న తప్పు అన్నట్లుగా చంద్రబాబు మాట్లాడారు. మంత్రులు, ఎమ్మెల్యేలకు నియోజకవర్గాలను జగన్ మార్చకూడదన్నట్లుగా చంద్రబాబు చెప్పటమే విచిత్రంగా ఉంది. తమ నిర్ణయాన్ని మాత్రం ఎవరు ప్రశ్నించకూడదట. కానీ, జగన్ నిర్ణయానికి మాత్రం ఎదురుతిరగమని చంద్రబాబు చెప్పటంతోనే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ నీతిసూత్రాలు ఎలాగుంటాయో అందరికీ మరోసారి తెలిసింది. వైసీపీని ఓడించటానికి చంద్రబాబు, పవన్ ఎలా వ్యూహాలు పన్నుతున్నారో అలాగే టీడీపీ, జనసేనను ఓడించటానికి జగన్ ప్లాన్లు వేయటంలో తప్పేముంది..?
ప్రత్యర్థులను ఓడించటంలో ఎవరి వ్యూహాలు వాళ్ళకుండటం చాలా సహజం. అభ్యర్థులను మార్చటం, కొందరికి నియోజకవర్గాలను మార్చటం జగన్‌కు ఎక్కడ అడ్వాంటేజ్ అయిపోతుందో అన్న ఆందోళనే చంద్రబాబు మాటల్లో ఎక్కువగా కనబడుతోంది. అందుకనే టికెట్ రానివాళ్ళని, నియోజకవర్గాలు మారటం ఇష్టంలేని వాళ్ళని రెచ్చగొట్టేట్లుగా చంద్రబాబు మాట్లాడుతున్నారు. టీడీపీ, జనసేనలో తమ నిర్ణయానికి మాత్రం అందరూ కట్టుబడుండాలని చెబుతున్న చంద్రబాబు.. వైసీపీలో మాత్రం జగన్ నిర్ణయాలపై తిరగబడాలని కోరుకోవటమే ఆశ్చర్యంగా ఉంది.