Telugu Global
Andhra Pradesh

జగన్ ఎక్కడ..? మంత్రులెక్కడ..? చంద్రబాబు ప్రశ్నలు

రైతులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని నిలదీశారు చంద్రబాబు. కౌలు రైతుల పరిస్థితేంటని ప్రశ్నించారు. ధాన్యం కొనలేని అసమర్థ ప్రభుత్వమిది అని మండిపడ్డారు.

జగన్ ఎక్కడ..? మంత్రులెక్కడ..? చంద్రబాబు ప్రశ్నలు
X

"ఏపీలో రైతులు అకాల వర్షాలకు నష్టపోతే అసలు సీఎం జగన్ ఎక్కడున్నారు, ఆయనకు రైతులను పరామర్శించే తీరిక దొరకలేదా..?" అని ప్రశ్నించారు చంద్రబాబు. సీఎం ఎక్కడ..? మంత్రులెక్కడ..? అంటూ నిలదీశారు. కోనసీమ జిల్లా రామచంద్రపురంలో అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటలను పరిశీలించారాయన. రైతులతో మాట్లాడారు. వైసీపీ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఈ పంటని ఏం చేస్తారు..?

రాష్ట్రంలో రబీలో 40 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని, గోదావరి జిల్లాల్లో 40 నుంచి 50 శాతం పంట ఇప్పటికీ పొలాలు, కళ్లాల్లో ఉండిపోయిందని అన్నారు చంద్రబాబు. అకాల వర్షాలకు దెబ్బతిన్న పంటను ఏం చేస్తారో సీఎం చెప్పాలని డిమాండ్ చేశారు. గతంలో పంటలకు ప్రభుత్వం ఇన్సూరెన్స్ చేసేదని, రాష్ట్ర ప్రభుత్వం, రైతు, కేంద్రం కలిపి ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టేవారన్నారు. కానీ జగన్ వచ్చాక క్రాప్ ఇన్సూరెన్స్ తీసేశారని మండిపడ్డారు. ఇన్సూరెన్స్ కట్టకుండా కట్టాను అంటూ అసెంబ్లీలో ఆనాడు అబద్ధం చెప్పారని, తాను పోడియం వద్ద కూర్చుని నిరసన తెలియజేస్తే రాత్రికి రాత్రి జగన్ డబ్బు కట్టారని గుర్తు చేశారు చంద్రబాబు.


ఇన్సూరెన్స్ కట్టి ఉంటే రైతులకు కాస్త భరోసా లభించేదన్నారు చంద్రబాబు. రైతులను ఆదుకునే బాధ్యత ప్రభుత్వానికి లేదా? అని నిలదీశారు. కౌలు రైతుల పరిస్థితేంటని ప్రశ్నించారు. ధాన్యం కొనలేని అసమర్థ ప్రభుత్వమిది అని మండిపడ్డారు. సకాలంలో గోనె సంచులు పంపించడం కూడా ప్రభుత్వానికి చేతకాలేదన్నారు. రైతుల వద్దకు వచ్చే తీరిక కూడా జగన్ కు లేకపోవడం దురదృష్టం అన్నారు చంద్రబాబు. బాధిత రైతులకు పరిహారం ఎప్పుడిస్తారో స్పష్టం చేయాలని, కౌలు రైతులకు ఎలా న్యాయం చేస్తారో చెప్పాలని డిమాండ్ చేశారు. రైతులకు న్యాయం చేయలేకపోతే జగన్‌ కు సీఎం పదవిలో కొనసాగే అర్హత లేదన్నారు చంద్రబాబు.

First Published:  5 May 2023 9:47 PM IST
Next Story