పార్టీ కార్యకలాపాల్లో చంద్రబాబు.. ఎంపీలతో సమావేశం
పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు.
చంద్రబాబు పూర్తి స్థాయిలో తెలుగుదేశం పార్టీ కార్యకలాపాల్లో పాల్గొంటున్నారు. శుక్రవారం ఉండవల్లిలోని తన నివాసంలో ఆయన అధ్యక్షతన పార్లమెంటరీ పార్టీ సమావేశం జరిగింది. ఈనెల 4నుంచి పార్లమెంట్ శీతాకాల సమావేశాలు జరగబోతున్న నేపథ్యంలో ఈ భేటీ జరిగింది. పార్లమెంట్ లో టీడీపీ ఎంపీలు ప్రస్తావించాల్సిన అంశాలపై చర్చించారు. ప్రత్యేక హోదా సాధన, విభజన హామీల అమలు, విశాఖ కేంద్రంగా కొత్త రైల్వేజోన్ ఏర్పాటులో జగన్ వైఫల్యాలను పార్లమెంటు వేదికగా ఎండగట్టాలని ఎంపీలకు సూచించారు చంద్రబాబు.
ఏపీలో ఇండియన్ పీనల్ కోడ్ (ఐపీసీ) స్థానంలో జగన్ పీనల్ కోడ్ అమలవుతోందని మండిపడ్డారు చంద్రబాబు. ఎన్నికల్లో లబ్ధి పొందడానికి ప్రతిపక్షాలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని, ఓటర్ల జాబితా రూపకల్పనలో అక్రమాలకు పాల్పడుతున్నారని విమర్శించారు. కరవు విలయతాండవం చేస్తున్నా... రైతుల్ని ఆదుకోవడం, నష్టనివారణ చర్యలు తీసుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు.
తమిళనాడులో ఇసుక అక్రమాలపై ఈడీ దర్యాప్తు చేస్తోందని, ఏపీలో దానికి రెండింతల ఇసుక దోపిడీ జరుగుతోందని అన్నారు చంద్రబాబు. దీన్ని కేంద్రం దృష్టికి తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందించాలని ఈ సమావేశంలో తేల్చారు. రాష్ట్రప్రభుత్వం తన వాటా నిధుల్ని విడుదల చేయకపోవడంతో చాలా కేంద్ర పథకాలు ఏపీలో అమలు కావట్లేదని దీనిపై కేంద్రానికి ఫిర్యాదు చేయాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. నాగార్జునసాగర్ ప్రాజెక్టు వద్ద అనవసరంగా ఉద్రిక్త పరిస్థితులు సృష్టించారని ఆరోపించారు. కొందరు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు చట్టవిరుద్ధంగా ప్రవర్తిస్తున్నారని టీడీపీ నేతలు చంద్రబాబుకి ఫిర్యాదు చేశారు.
♦