Telugu Global
Andhra Pradesh

సీఎంని చంపితే ఏమవుతుందంటారా..? - చంద్రబాబు వ్యాఖ్యలపై సర్వత్రా విస్మయం

ఒకపక్క జగన్‌ తన పాలనలో మంచి జరిగిందనుకుంటేనే తనకు ఓటేయాలని కోరుతుంటే బాబు మాత్రం తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు.

సీఎంని చంపితే ఏమవుతుందంటారా..? - చంద్రబాబు వ్యాఖ్యలపై సర్వత్రా విస్మయం
X

`జగన్‌మోహన్‌రెడ్డి.. రేపు నిన్ను చంపితే ఏమవుతుంది..` అంటూ బహిరంగ సభలో ప్రతిపక్ష నేత చంద్రబాబు చేసిన బరితెగింపు వ్యాఖ్యలపై సర్వత్రా విస్మయం వ్యక్తం చేస్తున్నారు. నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బుచ్చిరెడ్డిపాళెంలో జరిగిన సభలో చంద్ర‌బాబు ఈ వ్యాఖ్యలు చేశారు. ఇంతటి బరితెగింపు వ్యాఖ్యలు చేస్తున్న చంద్రబాబు రాష్ట్ర రాజకీయాలను ఎటు తీసుకెళ్లాలనుకుంటున్నారంటూ సాధారణ ప్రజలు, మేధావులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇంతకు దిగజారతారా?

రాజకీయాల్లో ప్రత్యర్థిని ఎదుర్కొనే సామర్థ్యం, ధైర్యం లేకపోవడంతో ఇంతకు దిగజారతారా అంటూ జనం మండిపడుతున్నారు. జగన్‌ను రాజకీయంగా ఎదుర్కోలేకే ఆయన్ని భౌతికంగా నిర్మూలించేందుకు చంద్రబాబు ఏదైనా కుతంత్రం పన్నుతున్నారా అని అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. తాడికొండ సభలో ‘ఆ దున్నపోతును మనిషికి ఒక రాయి తీసుకొని, ఏది దొరికితే అది తీసుకుని కొట్టండి..’ అంటూ కేడర్‌ను దాడికి పురిగొలిపేలా వ్యాఖ్యలు చేసిన బాబు.. మరో సభలో ‘గాజు గ్లాసు తీసుకుని పొడవండి’ అంటూ సైగల ద్వారా చెప్పడం చూసి రాష్ట్ర ప్రజలు నివ్వెరపోయారు. ఇప్పుడు ఏకంగా జగన్‌ను నేరుగా ఉద్దేశిస్తూ నిన్ను చంపితే ఏమవుతుంది అని మాట్లాడటం చూస్తే.. చంద్రబాబు మనసులో దురుద్దేశం ఉన్నట్టు స్పష్టమవుతోందని చెబుతున్నారు. ఆయన ఆ మాట అన్నారంటే జగన్‌పై ఎంత కసి, కక్ష ఉన్నాయో తెలుస్తోందని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు.

ఇలాగైతే ఒక్కరు కూడా మనకు ఓటేయరని టీడీపీ నేతల్లో ఆందోళన

మరోపక్క టీడీపీ కేడర్‌లో కూడా బాబు వ్యాఖ్యలు ఆందోళన రేకెత్తిస్తున్నాయి. ఒకపక్క జగన్‌ తన పాలనలో మంచి జరిగిందనుకుంటేనే తనకు ఓటేయాలని కోరుతుంటే బాబు మాత్రం తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేయడాన్ని టీడీపీ నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఇలాగైతే జనం తమకు ఎట్టి పరిస్థితుల్లోనూ ఓటేయరని వారు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బాబు తన పాలన, తన విధానాల గురించి కాకుండా కేవలం ఎదురుదాడి చేయడం, దూషించడం వల్ల ఉపయోగం ఏమిటని టీడీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ఆయన ప్రసంగాలు ప్రజలకు నమ్మకాన్ని కలిగించేలా ఉండడం లేదన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతోంది.

తెలుగుదేశం పార్టీని రద్దు చేయాలి..

మరోపక్క చంద్రబాబు వ్యాఖ్యలపై వైసీపీ కోవూరు ఎమ్మెల్యే ప్రసన్నకుమార్‌రెడ్డి సీరియస్‌ అయ్యారు. చంద్రబాబు చేసిన తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలపై ఎన్నికల కమిషన్‌ సుమోటోగా తీసుకుని కేసు నమోదు చేయాలని, తెలుగుదేశం పార్టీని రద్దు చేయాలని డిమాండ్‌ చేశారు. సీఎం జగన్‌మోహన్‌రెడ్డి ప్రాణాలకు హాని ఉందని చంద్రబాబు వ్యాఖ్యలతో అర్థమవుతోందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఈ వ్యాఖ్యలు చేసిన సమయంలో పక్కనే ఉన్న టీడీపీ అభ్యర్థి వేమిరెడ్డి ప్రభాకరరెడ్డి, ఆయన సతీమణి ప్రశాంతిరెడ్డి వారించకుండా మౌనంగా ఉండిపోవడంపై మండిపడ్డారు. నైతిక విలువలుంటే ఇలాంటి హత్యా రాజకీయాలను ప్రోత్సహిస్తున్న బాబు పార్టీ నుంచి తప్పుకోవాలని, లేదంటే బహిరంగంగా క్షమాపణలు చెప్పాలని డిమాండ్‌ చేశారు.

First Published:  29 April 2024 12:32 PM IST
Next Story