Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు మరో లేఖ.. ఇందులో ఏం రాశారంటే..?

జైలులో తాను చూసిన విషయాలను జడ్జికి వివరిస్తున్నానంటూ 3 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు చంద్రబాబు. కొందరు జైలులోకి గంజాయి ప్యాకెట్లు విసురుతున్నారని, తోటలో ఉన్న కొందరు ఖైదీలు వాటిని తీసుకుంటున్నారని చెప్పారు.

చంద్రబాబు మరో లేఖ.. ఇందులో ఏం రాశారంటే..?
X

జైలుకి వెళ్లిన తర్వాత చంద్రబాబు లేఖలు బాగా హైలైట్ అవుతున్నాయి. ఆమధ్య దసరా శుభాకాంక్షలు తెలుపుతూ ఆయన ప్రజలకు రాసిన లేఖ విషయంలో రాద్ధాంతం ఇంకా జరుగుతూనే ఉంది. అయితే ఇప్పుడు ఆయన మరో లేఖను జైలు అధికారుల ద్వారా బయటకు పంపించారు. ఈ లేఖలో ఆయన చాలా విషయాలు ప్రస్తావించారు. రాజమండ్రి సెంట్రల్ జైలులో ఏమేం జరుగుతున్నాయనే వివరాలను కూలంకషంగా అందులో ప్రస్తావించారు.

రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న చంద్రబాబు ఏసీబీ కోర్డు జడ్జికి ఓ లేఖను రాశారు. ఆ లేఖను జైలు అధికారుల ద్వారా జడ్జికి పంపించారు. ఆ లేఖలో ఉన్న విషయాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. జైలులో తనను చంపేందుకు కుట్రపన్నారని, తనకు ప్రాణహాని ఉందని తెలిపారు చంద్రబాబు. బయట ఉన్న తన కుటుంబ సభ్యులకు కూడా ప్రాణ హాని ఉందని లేఖలో ప్రస్తావించారు.

జైలులోకి గంజాయి..

జైలులో తాను చూసిన విషయాలను జడ్జికి వివరిస్తున్నానంటూ 3 పేజీల సుదీర్ఘ లేఖ రాశారు చంద్రబాబు. కొందరు జైలులోకి గంజాయి ప్యాకెట్లు విసురుతున్నారని, తోటలో ఉన్న కొందరు ఖైదీలు వాటిని తీసుకుంటున్నారని చెప్పారు చంద్రబాబు.

జైలులో ఉన్న ఖైదీల్లో 750 మంది తీవ్ర నేరాలకు పాల్పడినవారేనని, వారిలో కొందరి వల్ల తన భద్రతకు ముప్పు పొంచి ఉందన్నారు. అక్టోబర్ 6న జైలు ప్రధాన ద్వారం మీదుగా ఓ డ్రోన్‌ ఎగిరిందని, ములాఖత్‌ లో తనను కలుస్తున్న వారి వివరాలకోసం డ్రోన్‌ ఉపయోగిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. తన హత్యకు కుట్ర చేస్తున్నట్టు గతంలో తూర్పుగోదావరి జిల్లా ఎస్పీకి లేఖ వచ్చిందని, కానీ పోలీసులు ఎలాంటి విచారణ చేపట్టలేదని కూడా జడ్జికి తాను రాసిన లేఖలో ఆరోపించారు చంద్రబాబు. ప్రస్తుతం ఈ లేఖ వ్యవహారం సంచలనంగా మారింది.

First Published:  27 Oct 2023 7:24 AM GMT
Next Story