బ్యాంకు అకౌంట్లలో పెన్షన్లు వేయొద్దు.. బాబు మరో మెలిక
సచివాలయాల వద్ద వృద్ధులు ఇబ్బంది పడ్డా, బ్యాంకుల ముందు పడిగాపులు పడ్డా.. ఆ పాపం మాత్రం చంద్రబాబుదే.
చంద్రబాబు పుణ్యమా అని వాలంటీర్లు ఇంటింటికీ వచ్చి ఇచ్చే పెన్షన్లు ఆగిపోయాయి. నెలరోజుల క్రితం వృద్ధులు, వికలాంగులు సచివాలయాల చుట్టూ తిరిగి ఇబ్బంది పడ్డారు. ఈనెల బ్యాంకు అకౌంట్లలో పెన్షన్లు జమ చేస్తామని, మిగతావారికి ఇంటింటికీ వెళ్లి ఇస్తామని సీఎస్ స్పష్టం చేశారు. ఆదేశాలు కూడా జారీ చేశారు. కానీ చంద్రబాబుకి అది కూడా ఇష్టం లేదట. పెన్షన్లను బ్యాంక్ అకౌంట్లలో జమచేయడం సరికాదంటున్నారు సెల్ఫ్ డబ్బా విజనరీ.
ఎందుకు వద్దంటే..?
బ్యాంక్ అకౌంట్లలో జమ చేస్తే వృద్ధులు, వికలాంగులు ఆ సొమ్ము విత్ డ్రా చేసుకోడానికి బ్యాంకుల చుట్టూ తిరగాల్సి వస్తుందని, అవస్థలు పడతారని, వడదెబ్బతో ఇబ్బంది పడతారని ఈ ఎండల్లో వారిని బ్యాంకుల చుట్టూ తిప్పడం సబబా అని ప్రశ్నిస్తున్నారు చంద్రబాబు. వైసీపీ కుట్రలు, కుతంత్రాల్లో అధికారులు కూడా భాగస్వామ్యం కావడం దురదృష్టకరమని అన్నారు.
ఎందుకీ డబుల్ గేమ్..
పెన్షన్లు ఇవ్వడానికి వాలంటీర్లను వద్దన్నది చంద్రబాబే, ఇంటింటికీ పెన్షన్లు ఇవ్వాలంటూ మెలిక పెడుతోందీ బాబే, పోనీ బ్యాంకుల్లో జమ చేస్తామంటే అది కూడా కుదరదంటున్నారు. అసలింతకీ చంద్రబాబుకి కావాల్సిందేంటి..? పెన్షన్లు సకాలంల అందడమా, లేక వృద్ధులు, వికలాంగులు ఇబ్బంది పడటమా..? ఆయన శాడిస్ట్ కాబట్టి అందర్నీ ఇబ్బంది పెట్టాలనుకుంటున్నారని విమర్శలు వినపడుతున్నాయి. నెపం అధికారులపైకి నెట్టి రాజకీయ లబ్ధి పొందేందుకు బాబు ప్రయత్నిస్తున్నారని తేలిపోయింది.
ఆ పాపం బాబుదే..
సచివాలయాల వద్ద వృద్ధులు ఇబ్బంది పడ్డా, బ్యాంకుల ముందు పడిగాపులు పడ్డా.. ఆ పాపం మాత్రం చంద్రబాబుదే. వాలంటీర్లను ఎన్నికల ప్రక్రియకు దూరంగా పెట్టడం వరకు ఓకే, కానీ నెలకోసారి ఇచ్చే పెన్షన్ల కార్యక్రమానికి కూడా వారిని దూరం పెట్టడం ఎంతవరకు సమంజసం. దానికోసం ఎన్నికల కమిషన్ కి ఫిర్యాదు చేయించి మరీ ఆ ప్రక్రియను అస్తవ్యస్తం చేశారు చంద్రబాబు. ఇప్పుడు నీతులు చెబుతున్నారు.