Telugu Global
Andhra Pradesh

చంద్రబాబులో ఆందోళన.. కుప్పం చుట్టూ ప్రదక్షిణలు

ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా చంద్రబాబు చేయలేని పనులన్నిటినీ, సీఎం జగన్ చేసి చూపించడంతో కుప్పం ప్రజలు వైసీపీకి దగ్గరయ్యారు. దీంతో చంద్రబాబులో మరింత భయం పెరిగింది.

చంద్రబాబులో ఆందోళన.. కుప్పం చుట్టూ ప్రదక్షిణలు
X

గతంలో నామినేషన్ వేసేందుకు కూడా చంద్రబాబు కుప్పం వెళ్లేవారు కాదు. ప్రచారం కూడా స్థానిక నాయకులే నిర్వహించేవారు. కానీ 2019 ఎన్నికల్లో కుప్పం మెజార్టీలో భారీగా కోతపడటంతో బాబుకి జ్ఞానోదయం అయింది. 2024నాటికి వైనాట్ కుప్పం అంటూ సీఎం జగన్ అద్టదిగ్బంధం చేయడంతో బాబులో ఆందోళన మరింత పెరిగింది. అందుకే ఈసారి పదే పదే కుప్పం చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారాయన. తాజాగా మరోసారి కుప్పం పర్యటనకు వెళ్తున్నారు. రెండు రోజులపాటు అక్కడే ఆయన మకాం వేయబోతున్నారు.

ఈదఫా చంద్రబాబుతోపాటు నారా భువనేశ్వరి కూడా కుప్పంలో జోరుగా పర్యటిస్తున్నారు. కుప్పం నియోజకవర్గ పరిధిలో ఇల్లు నిర్మిస్తూ.. తాము కూడా స్థానికులమేనని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. చంద్రబాబు రాష్ట్ర పర్యటనల్లో ఉంటే, కుప్పం ప్రచార బాధ్యతను భువనేశ్వరి భుజానికెత్తుకునే అవకాశముంది.

ఇక కుప్పంలో చంద్రబాబు ప్రత్యర్థిగా ఉన్న ఎమ్మెల్సీ కె.ఎస్. భరత్ చాన్నాళ్లుగా అక్కడ యుద్ధానికి సన్నద్ధం అవుతున్నారు. అన్ని వర్గాలను కలుపుకొని వెళ్తున్నారు. సీఎం జగన్ కూడా కుప్పంపై ఫోకస్ పెట్టారు. తన సొంత నియోజకవర్గంతోపాటు కుప్పంకి కూడా సంక్షేమ పథకాల అమలులో పెద్దపీట వేశారు. కుప్పం సాగునీటి సమస్యను పరిష్కరించారు. ముఖ్యమంత్రిగా, ప్రతిపక్షనేతగా చంద్రబాబు చేయలేని పనులన్నిటినీ, సీఎం జగన్ చేసి చూపించడంతో కుప్పం ప్రజలు వైసీపీకి దగ్గరయ్యారు. దీంతో చంద్రబాబులో మరింత భయం పెరిగింది. పదే పదే కుప్పం పర్యటనకు వస్తున్నారు. కుప్పం సెంటర్‌లో ఈరోజు ఎన్టీఆర్‌ విగ్రహావిష్కరణ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. సాయంత్రం బహిరంగ సభ ఉంటుంది. మంగళవారం హంద్రినీవా ప్రాజెక్ట్ పరిశీలనకు వెళ్తారు చంద్రబాబు. ఆ తర్వాతి రోజు నుంచి ఆయన ప్రజాగళం మొదలవుతుంది.

కుప్పంలో చంద్రబాబుని ఓడించేందుకు సీఎం జగన్ ఎలాంటి పంతం పట్టారో.. మంత్రి పెద్దిరెడ్డి కూడా అంతే దూకుడుగా ఉన్నారు. పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఎమ్మెల్సీ భరత్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. చంద్రబాబు సంప్రదాయ ఓటు బ్యాంకుకి గండి కొట్టేందుకు ఈసారి గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయి. అధికారం కోసం కలలు కంటున్న బాబు.. కుప్పంలో పరాజయం పాలయితే అది మరింత సంచలనం అవుతుంది. అదే జరిగితే బాబు రాజకీయ జీవితం అక్కడితో ముగిసిపోయినట్టే.

First Published:  25 March 2024 10:46 AM IST
Next Story