కాలం ఎదురు తంతోందా?
తాజా సమాచారం ఏమిటంటే కేసు 3వ తేదీన కూడా క్వాష్ పిటీషన్ విచారణకు వచ్చేట్లు లేదట. ఎందుకంటే 5వ తేదీ వరకు ముఖ్యమైన కేసులు ఇప్పటికే లిస్టయిపోయున్నాయట. 6వ తేదీన కేసు విచారణకు వచ్చే అవకాశం ఉందంటున్నారు.
ఓ సినిమా పాటలో చెప్పినట్లు ‘సాగినంత కాలం తనంత వారు లేడందురు.. సాగకపోతే చతికిలపడుదురు’ అన్నట్లుగా తయారైంది చంద్రబాబునాయుడి వ్యవహారం. తన రక్షణ కోసం చంద్రబాబు ఏ కోర్టు తలుపు తట్టినా ఉపయోగం కనబడటంలేదు. ప్రతిచోటా కాలం ఎదురు తంతోంది. ఇంతకాలం వ్యవస్థలను అడ్డుపెట్టుకుని ప్రత్యర్థులను ముప్పుతిప్పలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు అదే వ్యవస్థల దెబ్బను తట్టుకోలేక విలవిల్లాడిపోతున్నారు. స్కిల్ స్కామ్‌లో అరెస్టయి రాజమండ్రి సెంట్రల్ జైలులో రిమాండులో ఉన్న విషయం తెలిసిందే. ఏసీబీ కోర్టులో పోరాడితే ఉపయోగం కనబడలేదు. హైకోర్టులో పిటీషన్ డిస్మిస్ అయ్యింది.
అందుకనే తన అరెస్టు, రిమాండుతో పాటు తనపై సీఐడీ పెట్టిన కేసుని క్వాష్ చేయాలని చంద్రబాబు లాయర్లు సుప్రీంకోర్టులో క్వాష్ పిటీషన్ వేశారు. దీనిపై కొంత విచారణ జరిగినా ఉపయోగం కనబడలేదు. ఈలోగా కోర్టుకు సెలవులు రావటంతో విచారణను వచ్చే నెల 3వ తేదీకి వాయిదా వేశారు. వెంటనే విచారణ జరిపి ఆదేశాలు ఇవ్వాలని చంద్రబాబు లాయర్ సిద్దార్థ లూథ్రా ఎంత గట్టిగా అడిగినా ఉపయోగం కనబడలేదు. దాంతో చేసేది లేక 3వ తేదీ వరకు వెయిట్ చేయాల్సిందే అనుకున్నారు.
అయితే తాజా సమాచారం ఏమిటంటే కేసు 3వ తేదీన కూడా విచారణకు వచ్చేట్లు లేదట. ఎందుకంటే 5వ తేదీ వరకు ముఖ్యమైన కేసులు ఇప్పటికే లిస్టయిపోయున్నాయట. 6వ తేదీన కేసు విచారణకు వచ్చే అవకాశం ఉందంటున్నారు. ఇప్పటికే ఇదే పిటీషన్‌ను హైకోర్టు డిస్మిస్ చేసేసింది. న్యాయ నిపుణుల ప్రకారం సుప్రీంకోర్టులో కూడా క్వాష్ పిటీషన్ డిస్మిస్ అయ్యేందుకే ఎక్కువ అవకాశం ఉందట.
ఏదేమైనా ఇరువైపుల లాయర్ల వాదోపవాదాలు జరిగిన తర్వాత కానీ చీఫ్ జస్టిస్ ఏ నిర్ణయం తీసుకోరు. ఎంత తొందరగా వీలైత అంత తొందరగా బయటపడదామని చంద్రబాబు ఆతృత పడుతుంటే కేసు విచారణ అంత ఆలస్యమవుతోంది. ఇలాంటి రోజు ఒకటొచ్చి తాను రాజమండ్రి సెంట్రల్ జైలులో ఊచలు లెక్కపెడతానని బహుశా చంద్రబాబు కలలో కూడా ఊహించుండరు. తనను అరెస్టు చేసే ధైర్యం జగన్మోహన్ రెడ్డికి ఉండదన్న గట్టి నమ్మకంతోనే నీకు చేతనైంది చేస్కో.. ఏం పీక్కుంటావో పీక్కో..నా వెంట్రుక కూడా పీకలేవని పదేపదే రెచ్చగొట్టారు. దాని పర్యవసానమే ఇప్పుడీ జైలువాసం. ఏం చేస్తాం, కాలం ఎదురు తంతున్నపుడు ఎంతటి వాళ్ళయినా తలొంచక తప్పదు.
♦