Telugu Global
Andhra Pradesh

ఈ విషయం చెప్పడానికి ఇంతకాలం పట్టింది చంద్ర‌బాబుకి

పార్టీ ఆఫీసులోకి ఎంటర్ కాగానే వాళ్ళ మద్దతుదారుల మధ్య మాటా మాటా పెరిగింది. చిన్ని ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లో ఎంపీ ఫొటోలేదన్న విషయాన్ని సాకుగా తీసుకుని ఎంపీ మద్దతుదారులు రెచ్చిపోయారు.

ఈ విషయం చెప్పడానికి ఇంతకాలం పట్టింది చంద్ర‌బాబుకి
X

విజయవాడ ఎంపీ కేశినేని నానికి చంద్రబాబు షాకిచ్చారా..? జరుగుతున్న పరిణామాలను గమనిస్తుంటే అందరిలోనూ ఇవే అనుమానాలు పెరిగిపోతున్నాయి. తిరువూరు బహిరంగసభ ఏర్పాట్లలో ఎంపీని జోక్యం చేసుకోవద్దని చంద్రబాబు ఆదేశించారు. చంద్రబాబు ఆదేశాలు ఎంపీకి టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు కింజరాపు అచ్చెన్నాయుడు ఆఫీసు ద్వారా జారీ అయ్యాయి. దీంతో పార్టీకి ఎంపీని దూరంపెట్టేసినట్లు అర్థ‌మవుతోంది. విజయవాడ పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని తిరువూరు బహిరంగసభకు ఎంపీని దూరం పెట్టడమంటే ఏమిటర్థం..?

బహిరంగసభ ఏర్పాట్ల నుండే కాదు రాబోయే ఎన్నికల్లో ఎంపీ తమ్ముడు చిన్నీనే పోటీచేయాలని చంద్రబాబు చెప్పేసినట్లు పార్టీలో ప్రచారం జరుగుతోంది. ఇందులో భాగంగానే ముందు బహిరంగసభ ఏర్పాట్లకు ఎంపీని దూరం పెట్టారన్న టాక్ పెరిగిపోతోంది. ఇంతకీ విషయం ఏమిటంటే.. రెండు రోజుల క్రితం తిరువూరు పార్టీ ఆఫీసులో అన్నదమ్ముల మద్దతుదారుల మధ్య పెద్ద గొడవైన విషయం తెలిసిందే. బహిరంగసభ ఏర్పాట్లను పరిశీలించేందుకు ఇద్దరూ తమ మద్దతుదారులతో వేర్వేరుగా తిరువూరు వెళ్ళారు.

అక్కడ పార్టీ ఆఫీసులోకి ఎంటర్ కాగానే వాళ్ళ మద్దతుదారుల మధ్య మాటా మాటా పెరిగింది. చిన్ని ఏర్పాటుచేసిన ఫ్లెక్సీల్లో ఎంపీ ఫొటోలేదన్న విషయాన్ని సాకుగా తీసుకుని ఎంపీ మద్దతుదారులు రెచ్చిపోయారు. దాంతో రెండువర్గాల మధ్య పెద్ద గొడవజరిగి కుర్చీలతోనే కొట్టేసుకున్నారు. ఆ ఘటన రాష్ట్రంలో సంచలనమైంది. జరిగిన గొడవ తెలియగానే చంద్రబాబు కూడా సీరియస్ అయ్యారు. సీనియర్లతో ఘటనపై చర్చించిన తర్వాత తాజాగా ఎంపీని బహిరంగసభ ఏర్పాట్లకు దూరంగా ఉండమని చెప్పారట.

బహిరంగసభ ఏర్పాట్లకు తనను దూరంగా ఉండమని పార్టీ నుండి ఆదేశాలు అందిన విషయాన్ని ఎంపీ కూడా ధృవీకరించారు. చాలాకాలంగా ఎంపీ వ్యవహారశైలిపై చంద్రబాబు తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. అయితే యాక్షన్ తీసుకునేంత ధైర్యం చేయటంలేదు. ఎంపీకి టికెట్ నిరాకరించలేరు ఇదే సమయంలో ఎంపీని ఎంటర్ టైన్ చేయలేకపోతున్నారు. దీన్ని అవకాశంగా తీసుకుని ఎంపీ కూడా రెచ్చిపోతున్నారు. దాని ఫలితమే తిరువూరులో జరిగిన గొడవ. ఇక ఉపేక్షిస్తే లాభంలేదని అర్థ‌మై తమ్ముడు కేశినేని చిన్నీనే రాబోయే ఎన్నికల్లో ఎంపీగా పోటీచేయమని చెప్పేశారట. అందుకనే ఇప్పుడు పార్టీ కార్యక్రమానికి దూరంగా ఉండమని ఎంపీకి చెప్పారు.

First Published:  5 Jan 2024 5:09 AM GMT
Next Story