తిరుపతిని ఏమిచేయాలి?
జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల్లో చంద్రబాబు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది తిరుపతికి మాత్రమే. భూమనను ఓడించాలనేది చంద్రబాబుకున్న బలమైన కోరిక. అందుకు ధీటైన అభ్యర్థి కోసం వెతుకుతున్నారు. ఆ ఒక్కడు దొరక్కపోవటంతోనే చాలా ఇబ్బందులు పడుతున్నారు.
ఇప్పుడు ఈ విషయమే చంద్రబాబునాయుడును బాగా వేధిస్తోంది. వచ్చే ఎన్నికల్లో తిరుపతిలో ఎలాగైనా టీడీపీయే గెలవాలని బలంగా ఉంది. అయితే అందుకు మార్గాలేమిటో మాత్రం అర్థంకావటంలేదు. వైసీపీ ఎమ్మెల్యే భూమన కరుణాకరరెడ్డిని ధీటుగా ఎదుర్కోగలిగిన నేతలను రంగంలోకి దింపాలని మూడేళ్ళుగా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ తదితరులపై చంద్రబాబుకు నమ్మకం పోయింది. ఈ నేపథ్యంలోనే గట్టి అభ్యర్థి ఎవరున్నారనే విషయంలో బూతద్దంపెట్టి వెతుకుతున్నారు.
ఇదే సమయంలో చంద్రగిరిలో పోటీ చేయించేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్న మబ్బు దేవనారాయణరెడ్డి (పెద్దబ్బ) తిరుపతి టికెట్ అడుగుతున్నారు. తమ ఫ్యామిలీకి తిరుపతిలో ఉన్న పట్టు కారణంగా పెద్దబ్బకేమో తిరుపతిలో పోటీ చేయాలని బలంగా ఉంది. చంద్రబాబుకేమో పెద్దబ్బను చంద్రగిరిలో పోటీచేయించాలనుంది. ఈ విషయంలో చంద్రబాబు ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. తిరుపతిలో ఇప్పుడున్న నేతలపై నమ్మకం లేదు. అలాగని ధీటైన నేతలేరు. చంద్రబాబు సమస్యేమిటంటే పెద్దబ్బను తిరుపతిలో పోటీ చేయిస్తే చంద్రగిరిలో గట్టి అభ్యర్థి దొరకరు.
పాదయాత్ర సందర్భంగా చంద్రగిరిలో పులివర్తి నాని పోటీ చేస్తారని లోకేష్ ప్రకటించినా చంద్రబాబు ఆమోదించేది అనుమానమేనట. పెద్దబ్బ గనుక చంద్రగిరిలో పోటీకి రెడీ అంటే నానికి టికెట్ ఎగిరిపోవటం ఖాయం. కానీ పెద్దబ్బ దృష్టంతా తిరుపతి మీదే ఉంది. పైగా భూమనను ధీటుగా ఎదుర్కోనేంత శక్తి తనకు తప్ప ఇంకెవరికీ లేదని చంద్రబాబుతోనే పెద్దబ్బ గట్టిగా చెప్పారు. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం సుగుణమ్మకు కానీ లేదా ఊకా విజయకుమార్‌కు కానీ టికెట్ ఇచ్చే ఆలోచన చంద్రబాబులో లేదు.
జిల్లాలోని అన్నీ నియోజకవర్గాల్లో చంద్రబాబు అత్యంత ప్రాధాన్యత ఇస్తుంది తిరుపతికి మాత్రమే. భూమనను ఓడించాలనేది చంద్రబాబుకున్న బలమైన కోరిక. అందుకు ధీటైన అభ్యర్థి కోసం వెతుకుతున్నారు. ఆ ఒక్కడు దొరక్కపోవటంతోనే చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికే టికెట్ కోసం కాపు నేతలు సుగుణమ్మ, ఊకా చాలాసార్లు చంద్రబాబును కలిసినా ఉపయోగంలేకపోయింది. పార్టీలోని రెడ్డి నేతల్లో చాలామంది తిరుపతిలో పెద్దబ్బకే టికెట్ ఇవ్వాలని చంద్రబాబుకు సిఫారసు చేశారని సమాచారం. దాంతో తిరుపతి నియోజకవర్గంపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో చంద్రబాబుకు అర్థం కావటంలేదు. చివరకు ఏం చేస్తారో చూడాలి.