Telugu Global
Andhra Pradesh

రూ.550 కోట్ల స్కామ్‌లో చంద్రబాబు ప్రధాన నిందితుడు.. అధికారికంగా ప్రకటించిన సీఐడీ

న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకొని, చట్ట ప్రకారమే చంద్రబాబును అరెస్టు చేశామని.. ఎక్కడ కూడా నిబంధనలు ఉల్లంఘించలేదని డీజీ సంజయ్ చెప్పారు.

రూ.550 కోట్ల స్కామ్‌లో చంద్రబాబు ప్రధాన నిందితుడు..  అధికారికంగా ప్రకటించిన సీఐడీ
X

ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ పేరుతో రూ.550 కోట్ల మేర స్కామ్ జరిగిందని, దీనిలో ప్రధాన నిందితుడు మాజీ సీఎం చంద్రబాబు నాయుడే అని సీఐడీ స్పష్టం చేసింది. శనివారం ఉదయం నంద్యాలలో చంద్రబాబు నాయుడిని అరెస్టు చేసినట్లు సీఐడీ అడిషనల్ డీజీ సంజయ్ తెలిపారు. న్యాయపరంగా అన్ని చర్యలు తీసుకొని, చట్ట ప్రకారమే చంద్రబాబును అరెస్టు చేశామని.. ఎక్కడ కూడా నిబంధనలు ఉల్లంఘించలేదని ఆయన చెప్పారు.

అర్థరాత్రి చంద్రబాబు బస చేసిన బస్సు వద్దకు వెళ్లి పోలీసులు హంగామా చేశారనేది పూర్తిగా అబద్దమని చెప్పారు. చంద్రబాబు నంద్యాల నుంచి రాత్రి 1.30కి వెళ్లిపోతారనే సమాచారం రావడంతోనే సీఐడీ అధికారులు అక్కడికి చేరుకున్నారని, అందుకు అవసరమై భద్రతను లా అండ్ ఆర్డర్ పోలీసులు కల్పించారని సంజయ్ చెప్పారు. ఉదయం 6.00 గంటల తర్వాతే చంద్రబాబు నాయుడికి అన్నీ వివరించి అరెస్టు చేశామని సంజయ్ పేర్కొన్నారు. తొలుత మేము హెలికాప్టర్ ఏర్పాటు చేస్తామని చెప్పాము. కానీ చంద్రబాబు అభ్యర్థన మేరకే ఆయన సొంత వాహనంలో మంగళగిరికి తరలిస్తున్నామని సంజయ్ స్పష్టం చేశారు.

స్కిల్ డెవలప్‌మెంట్ కోసం జరిగిన ఒప్పందంలో భాగంగా ప్రభుత్వం తరపున రూ.371 కోట్ల షేర్‌ను విడుదల చేయాలంటూ జీవోలు జారీ చేశారు. సీమెన్స్‌కు బదులు డిజైన్‌టెక్ అనే సంస్థకు 100 శాతం అమౌంట్ ట్రాన్స్‌ఫర్ చేశారు. డిజైన్ టెక్ నుంచి పీవీఎస్పీ, ఏసీఐ (ఎలైట్ కంప్యూటర్స్) అనే షెల్ కంపెనీకి బదిలీ అయ్యింది. ఈ షెల్ కంపెనీలపై దర్యాప్తు చేయగా.. ఇలాంటి పలు షెల్ కంపెనీలకు నగదు బదిలీ జరిగినట్లు తేలిందని సంజయ్ చెప్పారు.

2014 జూలై 14న ఉన్నత విద్యా శాఖ, సీమెన్స్ కంపెనీకి మధ్య ఒక ఒప్పందం జరిగింది. ఈ ఎంవోయూను కుదర్చడానికి మధ్యవర్తిగా వ్యవహరించింది డిజైన్ టెక్ అనే సంస్థ. ఈ ఎంవోయూను ఆచరణలోకి తీసుకొని రావడానికి అదే ఏడాది సెప్టెంబర్‌లో ఏపీ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. అయితే ఈ కార్పొరేషన్‌ను స్కామ్ చేయడానికే ఏర్పాటు చేశారనే దానికి కూడా ఆధారాలు లభించాయని సీఐడీ డీజీ సంజయ్ తెలిపారు. ఎంవోయూ కుదిరిన నాటికి అసలు ఈ కార్పొరేషన్ మనుగడలోనే లేదు. ఈ ఒప్పందం కేవల సీమెన్స్, ఉన్నత విద్యా శాఖ మధ్య మాత్రమే కుదిరింది. అయితే కేబినెట్ అప్రూవల్ లేకుండానే ఈ కార్పొరేషన‌ను ఏర్పాటు చేశారు.

స్కిల్ డెవపల్‌మెంట్ కార్పొరేషన్‌కు ఎండీ అండ్ సీఈవోగా గంటా సుబ్బారావును నియమించారు. ఒక రెండు నెలలు గడిచిన తర్వాత ఇదే సుబ్బారావును ఉన్నత విద్యా శాఖకు ఎక్స్-అఫీషియో సెక్రటరీ అనే పదవిని కట్టబెట్టారు. దీంతో పాటు ఇన్నోవేషన్ అండ్ స్కిల్ డిపార్ట్‌మెంట్ సెక్రటరీగా, ముఖ్యమంత్రి చంద్రబాబుకు ఎక్స్ అఫీషియో సెక్రటరీగా నియమించారు. ఇలా ఒకే వ్యక్తికి నాలుగు పదవులు కట్టబెట్టారని సీఐడీ వెల్లడించింది. ఈ పదవులు దురుద్దేశంతోనే ఇచ్చినట్లు విచారణలో తేలిందని చెప్పారు.

సీమెన్స్‌తో ఒప్పందం కుదిర్చిన డిజైన్‌టెక్ సీనియర్ అధికారి పేరు జీవీఎస్ భాస్కర్. ఆయన భార్య అపర్ణా (యూపీ క్యాడర్ ఐఏఎస్ అధికారి)ని స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ డిప్యూటీ సీఈవోగా 2015 అక్టోబర్ 7న నియమించారు. ఈ ఎంవోయూలకు సంబంధించిన ప్రెజెంటేషన్స్ రూపకల్పనలో అపర్ణ కూడా పాల్గొన్నారని విచారణలో తేలిందని సంజయ్ చెప్పారు.

సీమెన్స్ 90 శాతం పెట్టుబడికి 10 శాతం ప్రభుత్వం నగదు బదిలీ చేసింది. 2015 మార్చి 11న అసెంబ్లీలో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ప్రకటన చేశారు. దాదాపు రూ 2,500 కోట్ల పెట్టుబడి సీమెన్స్ నుంచి రాబోతోందని.. అందుకు గాను ప్రభుత్వం నుంచి రూ.370 కోట్లు విడుదల చేయాల్సి ఉంటుందని అసెంబ్లీలో ప్రకటించారు. సీమెన్స్ నుంచి ఎందుకు పెట్టుబడి రావడం లేదనే విషయంపై తూతూ మంత్రంగా ఒక మానిటరింగ్ కమిటీ వేశారు. కానీ ఆ కమిటీ చేసిందేమీ లేదని సీఐడీ వివరించింది. పైగా ఫైనాన్స్ డిపార్ట్‌మెంట్ నుంచి అధికారులు నిధులు విడుదల చేయవద్దని నోటింగ్స్ రాసినా.. రూ.371 కోట్లను జీవోల ద్వారా రిలీజ్ చేశారని సంజయ్ పేర్కొన్నారు.

ఒప్పందం ప్రకారం రూ.3,300 కోట్లను పెట్టుబడి పెట్టాల్సి ఉండగా.. దాన్ని చూపించడానికి కూడా కుట్ర జరిగిందని చెప్పారు. ఏపీలో ఆరు చోట్ల రూ.546 కోట్ల విలువ చేసే సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌ను ప్రారంభించాలని నిర్ణయించారు. ఇందులో ఒక్కో చోట ప్రభుత్వ వాటాగా రూ.58 కోట్లను ప్రకటించారు. ప్రభుత్వ వాటాతో నిర్మించిన ఎక్స్‌లెన్స్‌లో వాడేందుక ఒక సాఫ్ట్‌వేర్‌‌ను సీమెన్స్ నుంచి డిజైన్‌టెక్ కొనుగోలు చేస్తున్నట్లు చెప్పారు. కేవలం రూ.58 కోట్ల వ్యయమయ్యే సాఫ్ట్‌వేర్‌ను ఎన్నో రెట్లు పెంచి.. ఇదే రూ.3,300 కోట్లుగా చూపించారని సంజయ్ వివరించారు. ఇదే ప్రధానమైన కుట్రగా పేర్కొన్నారు.

వాస్తవానికి ఈ సెంటర్ల ఏర్పాటుకు రూ.130 కోట్లే వ్యయం చేశారు. మిగిలిన సొమ్మంతా కొంత మంది చేతుల్లోకి వెళ్లిపోయిందని సంజయ్ పేర్కొన్నారు. ఇందులో ఇన్వాల్వ్ అయిన వారినందరినీ విచారించాలని అనుకున్నాము. అయితే ప్రధాన సాక్ష్యులు, ఇతర నిందితులు వేరే దేశాలకు పారిపోయారని తెలిసింది. కొంత మంది నింధితులు పారిపోవడంలో చంద్రబాబు మాజీ సెక్రటరీ పెండ్యాల శ్రీనివాస్ సాయం చేశారు. ఆయన కూడా హైదరాబాద్ నుంచి యూఎస్ఏ వెళ్లిపోయారని తెలిసినట్లు సీఐడీ చెప్పింది. అందరినీ తిరిగి ఏపీకి తీసుకొని రావడానికి సీఐడీ ప్రయత్నిస్తోందని అన్నారు.

ఈ కేసులో చంద్రబాబును ప్రధాన నిందితుడిగా పేర్కొనడానికి కూడా కారణాలు ఉన్నాయని చెప్పారు. ఈ స్కాంకు రూపకల్పన చేసింది. చివరకు లబ్ది పొందించి ఆయనే అని సీఐడీ డీజీ సంజయ్ స్పష్టం చేశారు. ఈ కేసులో చంద్రబాబు నాయుడిని కస్టోడియల్ విచారణ చేయడం తప్పనిసరి అని.. అందుకే అరెస్టు చేశామని తెలిపారు. ఈ కేసులో కిలారు రాజేశ్ అనే వ్యక్తి నారా లోకేశ్‌కు సన్నిహితుడు. వీరిద్దరికీ ఈ స్కామ్‌తో ఉన్న సంబంధాలను లోతుగా విచారిస్తామన్నారు.

ఈ స్కామ్ ద్వారా షెల్ కంపెనీలకు వెళ్లిన డబ్బు ప్రైవేట్ ఖాతాలకు బదిలీ అయ్యింది. ఆ ప్రైవేట్ వ్యక్తులు తిరిగి పార్టీ నాయకులైన చంద్రబాబు, లోకేశ్ ఖాతాలకు బదిలీ చేసినట్లు తేలిందని సంజయ్ చెప్పారు. చంద్రబాబు నాయుడిని విచారిస్తే కానీ పూర్తి విషయాలు బయటకు రావని ఆయన పేర్కొన్నారు.

First Published:  9 Sept 2023 11:57 AM IST
Next Story