Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు చెప్పే నీతులు వినాల్సిందేనా?

మీడియా అంటే ఎలాగుండాలో నీతులు చెబుతున్నారు. ఇదంతా ఎందుకంటే రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛ‌ లేకుండా పోయిందని చంద్రబాబునాయుడు తెగ బాధపడిపోయారు.

చంద్రబాబు చెప్పే నీతులు వినాల్సిందేనా?
X

కలికాలం అంటే దీన్నేఅంటారు. మీడియా వ్యవస్ధను నాశనం చేసిన వ్యక్తే ఇపుడు మీడియాకు బుద్ధులు చెబుతున్నారు. మీడియా అంటే ఎలాగుండాలో నీతులు చెబుతున్నారు. ఇదంతా ఎందుకంటే రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛ‌ లేకుండా పోయిందని చంద్రబాబునాయుడు తెగ బాధపడిపోయారు. మీడియా ప్రశ్నించటం మానేసిందని, నిర్భయంగా నిలదీయాలని బుద్ధులు చెప్పారు. వంద ఎలుకలను తిన్న పిల్లి కూడా శాంతి వచనాలు పలికిందనే సామెతలాగుంది.

అసలు సమైక్యరాష్ట్రంలో మీడియాను భ్రష్టుపట్టించిన వ్యక్తి ఎవరంటే అందరు చంద్రబాబు అనే అంటారు. ప్రజాబలంలేని చంద్రబాబు రాజకీయాల్లో ప్రముఖుడిగా చెలామణి అయ్యేందుకు మీడియాను అడ్డంపెట్టుకున్నారు. మీడియా మేనేజ్‌మెంట్‌తో సంబంధాలు పెట్టుకుని అప్పట్లో ప్రముఖ మీడియా యాజమాన్యాలను గుప్పిట్లో పెట్టుకున్నారు. ఎప్పుడైతే ఎన్టీయార్‌ కు మీడియా యాజమాన్యానికి చెడిందో వెంటనే సదరు యాజమాన్యానికి చంద్రబాబు సన్నిహితుడైపోయారు.

తనకున్న సాన్నిహిత్యాన్ని అడ్డంపెట్టుకుని 1995లో ఎన్టీయార్‌కు వెన్నుపోటు పొడిచారు. ఎన్టీయార్‌కు తాను చేసిన ద్రోహం జనాలకు తెలీకుండా మెజారిటి మీడియాను మేనేజ్‌ చేశారు. ఎన్టీయార్‌ను పదవి నుండి దింపటానికి పట్టుమని పది మంది ఎమ్మెల్యేల‌ బలం కూడా లేని చంద్రబాబు తనకు వంద మంది ఎమ్మెల్యేల‌ మద్దతుందని కలరింగ్ ఇచ్చుకోవటంలో మీడియాదే ప్రముఖపాత్ర. సీఎం అయినప్పటి నుండి ఎన్టీయార్‌ను ద్రోహిగాను తనను పార్టీ, రాష్ట్ర రక్షకుడిగా ప్రొజెక్టు చేసుకోవటానికి మీడియాలో చాలా మందిని లోబరుచుకున్నారు. తనకు వ్యతిరేకంగా వార్తలు రాకుండా చూసుకోవటంలో సక్సెస్ అయ్యారు.

తనకు వ్యతిరేకంగా వార్తలు, కథనాలు రాస్తున్న చాలా మంది జర్నలిస్టులను యాజమాన్యాలతో చెప్పి ఉద్యోగాల్లో నుండి తీయించేశారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. అప్పటి నుండి మంత్రులు, ఎమ్మెల్యేలంతా పాజిటివ్ ప్రచారం కోసం మీడియాను రకరకాలుగా లోబరుచుకున్నారు. ఎవరనెంత లోబరుచుకున్నా 2004 ఎన్నికల్లో జనాలు చంద్రబాబును ఓడించారు. 2009 ఎన్నికల సమయానికి తన ప్రెస్ మీట్లకు సాక్షి జర్నలిస్టులను రాకుండా నిషేధించిందే చంద్రబాబు. మీడియా స్వేచ్ఛ‌ గురించి మాట్లాడే చంద్రబాబు అప్పట్లో మరి సాక్షిని ఎలా నిషేధించారు. 2014లో సీఎం అయిన తర్వాత కూడా సాక్షిని అనుమ‌తించ‌లేదు. ఇలాంటి చంద్రబాబు ఇప్పుడు మీడియా స్వేచ్ఛ‌గా ప్రశ్నించాలని నీతులు చెబుతుండటమే విచిత్రంగా ఉంది.

First Published:  10 Jan 2023 12:55 PM IST
Next Story