మోడీ అంటే ఇంత భయపడుతున్నారా?
ఉత్తరాంధ్ర జోనల్ సమావేశంలో పాల్గొనేందుకు విశాఖ వెళ్లిన చంద్రబాబును స్టీల్ ప్లాంట్ యూనియన్ లీడర్లు కలిశారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని విజ్ఞప్తి చేశారు. యూనియన్ లీడర్లు చెప్పిందంతా విన్న తర్వాత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు.
నరేంద్ర మోడీ అంటే చంద్రబాబు నాయుడు భయపడుతున్నారు అనేందుకు తాజాగా ఒక ఉదాహరణ బయటపడింది. ఉత్తరాంధ్ర జోనల్ సమావేశంలో పాల్గొనేందుకు చంద్రబాబు వైజాగ్ వెళ్ళారు. విశాఖపట్నంలో దిగగానే స్టీల్ ప్లాంట్ యూనియన్ లీడర్లు కలిశారు. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ గురించి వివరించి కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడాలని విజ్ఞప్తి చేశారు. యూనియన్ లీడర్లు చెప్పిందంతా విన్న తర్వాత చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై ఆరోపణలు చేశారు. జగన్మోహన్ రెడ్డి చేతకానితనం వల్లే స్టీల్ ప్లాంట్ ప్రైవేటుపరం అయిపోతోందంటు మండిపోయారు.
అధికారంలో ఉండి కూడా జగన్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను ఆపలేకపోతున్నట్లు రెచ్చిపోయారు. యూనియన్ లీడర్లు అడిగింది ఒకటైతే చంద్రబాబు మాట్లాడింది మరోటి. నిజానికి స్టీల్ ప్లాంట్ కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన సంస్థ. తన సంస్థను కేంద్రం ప్రైవేటువాళ్ళకు అమ్మేసుకుంటుంటే మధ్యలో జగన్ ఏమిచేస్తారు? అప్పటికీ ప్లాంట్‌ను ప్రైవేటుపరం చేయొద్దని మోడీకి లేఖ రాశారు. ఒకవేళ అమ్మేయదలచుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికే అమ్మాలని కూడా అడిగారు. పార్లమెంటులో కూడా వైసీపీ ఎంపీలు ఇదే విషయాన్ని ప్రస్తావించారు.
జగన్ ఎన్నిసార్లు అడిగినా మోడీ వైపు నుండి సానుకూలత కనబడలేదు. పైగా తమ సంస్థ అమ్ముకోవటం తమ ఇష్టమని కేంద్ర మంత్రులు పార్లమెంటులోనే ప్రకటించారు. వాస్తవాలు ఇలా ఉంటే నరేంద్ర మోడీని తప్పుపట్టాల్సిన చంద్రబాబు మాత్రం పదే పదే జగన్‌ను తప్పుపడుతున్నారు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ నిర్ణయం జరిగింది చంద్రబాబు అధికారంలో ఉప్పపుడు 2018లోనే. అప్పట్లో తీసుకున్న నిర్ణయం జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత బయటపడింది.
ఈ విషయాన్ని చంద్రబాబు దాచిపెట్టి మొత్తం తప్పంతా జగన్‌దే అంటున్నారు. జగన్ కంటే కేసుల భయం ఉంది కాబట్టి మోడీని ఏమీ అనలేకపోతున్నారు. మరి చంద్రబాబుకు వచ్చిన భయమేంటి? మోడీని ఎందుకని ఏ విషయంలో కూడా నిలదీయలేకపోతున్నారు? యూనియన్ లీడర్లు మోడీ ప్రభుత్వం మీద పోరాటం చేయాలి రమ్మంటే చంద్రబాబు మాత్రం జగన్‌ను తప్పుపడుతున్నారు. అంటే మాటవరసకు కూడా మోడీని తప్పుపట్టాలంటే ఎంత భయపడిపోతున్నారో అర్థమవుతోంది.