Telugu Global
Andhra Pradesh

వీళ్ళ గొడవలో చంద్రబాబు ఇరుక్కున్నారా..?

తండ్రిలా రామ్మోహన్ కూడా పార్లమెంటుకు మాత్రమే పరిమితమవ్వాలని బాబాయ్ అచ్చెన్న గట్టిగా చెబుతున్నారట. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. అచ్చెన్న, రామ్మోహన్ కుటుంబాలకు చాలాకాలంగా పడటంలేదు.

వీళ్ళ గొడవలో చంద్రబాబు ఇరుక్కున్నారా..?
X

కింజరాపు కుటుంబంలో పెరిగిపోతున్న వివాదాలతో చంద్రబాబునాయుడుకు పెద్ద సమస్యే వచ్చింది. విడవమంటే పాముకు కోపం.. కరవమంటే కప్పకు కోపం అన్నట్లుగా తయారైపోయింది వ్యవహారం. ఇంతకీ విషయం ఏమిటంటే.. వచ్చేఎన్నికల్లో శ్రీకాకుళం ఎంపీ కింజరాపు రామ్మోహన్ నాయుడు ఎంఎల్ఏగా పోటీచేయాలని పట్టుదలగా ఉన్నారు. అయితే రామ్మోహన్‌ ఎంపీగా మాత్రమే పోటీచేయాలని, ఎంఎల్ఏగా వద్దని బాబాయ్ కింజరాపు అచ్చెన్నాయుడు గట్టిగా చెబుతున్నారు.

తండ్రిలా రామ్మోహన్ కూడా పార్లమెంటుకు మాత్రమే పరిమితమవ్వాలని బాబాయ్ అచ్చెన్న గట్టిగా చెబుతున్నారట. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే.. అచ్చెన్న, రామ్మోహన్ కుటుంబాలకు చాలాకాలంగా పడటంలేదు. రామ్మోహ‌న్ ఎమ్మెల్యేగా పోటీచేసి గెలిస్తే తనకు ఇబ్బందులు తప్పవని అచ్చెన్న భయమట. అందుకనే రామ్మోహన్ ప్రయత్నాలను బాబాయ్ అడ్డుకుంటున్నారు. ఆమధ్య చంద్రబాబును కలిసిన ఎంపీ తన ఆలోచనను చెప్పారట. అయితే అందుకు చంద్రబాబు అంగీకరించలేదని సమాచారం.

వచ్చేఎన్నికల్లో కూడా ఎంపీగానే పోటీచేయాలని ఆ తర్వాత ఎన్నికల విషయం అప్పుడు చూసుకుందామని చంద్రబాబు గట్టిగానే చెప్పారట. అయితే అందుకు ఎంపీ ఒప్పుకోలేదని సమాచారం. చంద్రబాబు, బాబాయ్ ఎంత చెప్పినా వినకుండా రామ్మోహన్ మాత్రం ఎంఎల్ఏగా పోటీచేయాలని డిసైడ్ అయిపోయినట్లు పార్టీవర్గాల సమాచారం. నర్సంపేట నుండి ఎంఎల్ఏగా పోటీచేయబోతున్నట్లు ఎంపీ చెబుతున్నారట. రామ్మోహన్ నిర్ణయానికి కారణం ఏమిటంటే ఎంఎల్ఏగా పోటీచేసి మంత్రవ్వాలనట. ఎంపీగా పోటీచేస్తే ఉపయోగం ఉండదని, జాతీయ రాజకీయాల్లో టీడీపీ తిప్పే చక్రాలు ఇక ఏమీ ఉండదని ఎంపీ డిసైడ్ అయిపోయారట.

వచ్చేఎన్నికలే టీడీపీకి చివరి ఎన్నికలని కూడా ప్రచారం జరుగుతోంది. 2024లో గెలవకపోతే ఇక రాష్ట్రంలో కూడా టీడీపీ ఉండదని పార్టీలోనే ప్రచారం జరుగుతోంది. కాబట్టి ఎంఎల్ఏగా గెలిచి పార్టీ అధికారంలోకి వస్తే మంత్రవ్వాలన్నది ఎంపీ కోరికట. అబ్బాయ్ ఎంఎల్ఏగా గెలిచి పార్టీ అధికారంలోకి వస్తే మంత్రివర్గంలో తనకు ఎక్కడ పోటీవస్తారో అన్నది బాబాయ్ భయం. అందుకనే రామ్మోహన్ను ఎంఎల్ఏగా కాకుండా ఎంపీగానే పోటీచేయించాలని అచ్చెన్న పట్టుబడుతున్నారు. అయితే ఎంపీ మాత్రం నర్సంపేటలో ప్రచారం చేసుకుంటున్నారు. ఈ సమస్యను ఎలా పరిష్కరించాలో చంద్రబాబుకు అర్ధంకావటంలేదు.

First Published:  16 Jan 2023 11:47 AM IST
Next Story