చంద్రబాబు మారలేదు.. సర్వేల గోల వదల్లేదు..
అభ్యర్థుల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తానని, ఎవరైనా సరిగ్గా పని చేయనట్లు తేలితే వారిని మార్చేసి, కొత్తవారిని తెస్తానని ప్రకటించారు.
నేను మీ అందరి జాతకాలూ చెప్పగలను.. సర్వే రిపోర్టులు నా దగ్గరున్నాయి.. ఎవరేంటో నాకు తెలుసు.. అధికారంలో ఉన్నప్పుడు పార్టీ ఎమ్మెల్యేలందర్నీ చంద్రబాబు ఇలాగే భయపెట్టేవారు. ఓట్లేసిన జనం కంటే.. ఎమ్మెల్యేలు ఆ సర్వే రిపోర్టులకే వణికిపోయేవారు. ఇప్పుడు చంద్రబాబుకు అధికారం లేదు.. మళ్లీ వస్తుందో లేదో నమ్మకమూ లేదు.. కానీ, తన సర్వే గోల మాత్రం వదల్లేదని నిన్న ఆయన చేసిన కామెంట్లు విని టీడీపీ లీడర్లు గొణుక్కుంటున్నారు.
సర్వే చేయిస్తా.. తేడా వస్తే తీసేస్తా
టికెట్లు దక్కిన అభ్యర్థులు నిర్లక్ష్యంగా ఉంటే కుదరదని చంద్రబాబు చెప్పారు. అభ్యర్థుల పనితీరుపై ఎప్పటికప్పుడు సర్వేలు చేయిస్తానని, ఎవరైనా సరిగ్గా పని చేయనట్లు తేలితే వారిని మార్చేసి, కొత్తవారిని తెస్తానని ప్రకటించారు. నేనే అభ్యర్థిని అని అహం ప్రదర్శించకండి.. అసంతృప్తులు ఉంటే ఒకటికి పదిసార్లు కలిసి, మాట్లాడండి. ప్రజలతో ఓట్లు వేయించుకోవాల్సింది మీరే అంటూ హెచ్చరించారు.
స్కూల్ పిల్లలమా? మాకేంటీ క్లాస్?
టికెట్ ఇచ్చాక పని చేయకుండా ఎందుకు ఉంటాం, గెలవాలని మాకు ఉండదా? డబ్బులు ఖర్చు పెట్టినవాళ్లం ఓడిపోవాలనుకుంటామా? టికెట్లు ఇచ్చి రోజూ సర్వేలు చేయిస్తాను అనడమేంటి? స్కూల్లో పిల్లలు అల్లరి చేయకుండా క్లాస్ లీడర్ని పెట్టినట్లు ఈ సర్వేల గోలేంటి? జనంలోకి వెళ్లి తిరగాలా? ఈ సర్వేలు ఎవరు చేస్తున్నారో, ఏం రిపోర్టులు ఇస్తారో అని భయపడి చావాలా అని టీడీపీ అభ్యర్థులు గొణుక్కుంటున్నారు. ఎందుకంటే సర్వే రిపోర్టుల పేరుతో టీడీపీలో చంద్రబాబు చేసే హడావుడి, వాటి పేరు చెప్పి ఎంతోమంది రాజకీయ జీవితాలను సమాధి చేసిన చరిత్ర తమ అధినేతదని ఆ పార్టీలో చాలామందికి తెలుసు. అందుకే భయపడక తప్పనని పరిస్థితి.