మనోహర్ కోసం ఆలపాటి రాజాను ఆగమాగం చేస్తున్నారా..?
పొత్తులో ఈ సీటు మనోహర్‌కు ఇచ్చే పక్షంలో తనకు గుంటూరు పశ్చిమ అసెంబ్లీ సీటు కావాలని రాజా కోరుతున్నారు. అయితే టీడీపీ అధినేత ఆలోచన మరోలా ఉందంటున్నారు.
సీట్ల లెక్క తేలకపోయినా టీడీపీ, జనసేన పొత్తు అయితే ఖాయమే. అయితే చివరిదాకా సీట్లు తేల్చకుండా సాగదీయడం అలవాటైపోయిన చంద్రబాబు ఈసారీ అదే వ్యూహంతో వెళుతున్నారు. ఇది టీడీపీ ఆశావహుల కంటే జనసేన నేతలకే పెద్ద సంకటంగా మారిపోయింది. జనసేనలో నంబర్-2గా ఉన్న నాదెండ్ల మనోహర్ తెనాలి సీటు కోసం గట్టిగా పట్టుబడుతున్నారు. భవిష్యత్తులో తమకు ఉపయోగపడే మనిషి జనసేనలో ఉంటే మంచిదని బాబు భావిస్తున్నారని, అందుకే ఆయనకు తెనాలి టికెట్ పొత్తులో ఇవ్వాలని అనుకుంటున్నారని విశ్లేషణలున్నాయి. తెనాలి మనోహర్‌కు ఇస్తే అక్కడ టీడీపీలో ఎప్పటి నుంచో పాతుకుపోయి ఉన్న మాజీ మంత్రి ఆలపాటి రాజా పరిస్థితేంటి? పొత్తు ధర్మం అనే మాటకు ఆయన కట్టుబడబోతున్నారా? రాజీ పడి వేరే స్థానానికి వలస వెళ్ళబోతున్నారా..? అనేది సస్పెన్స్‌గా ఉంది.
గుంటూరు వెస్ట్ అడుగుతున్న రాజా!
పొత్తులో ఈ సీటు మనోహర్‌కు ఇచ్చే పక్షంలో తనకు గుంటూరు పశ్చిమ అసెంబ్లీ సీటు కావాలని రాజా కోరుతున్నారు. అయితే టీడీపీ అధినేత ఆలోచన మరోలా ఉందంటున్నారు. సిట్టింగ్ ఎంపీ గల్లా జయదేవ్‌ను కాదని గుంటూరు పార్లమెంట్ అభ్యర్థిగా ఆలపాటి రాజాను బరిలోకి దించాలని బాబు ఆలోచనట. అయితే దీన్ని రాజా వ్యతిరేకిస్తున్నారు. ఇస్తే గుంటూరు వెస్ట్ సీటు ఇవ్వాలంటున్నారు.
కొత్తగా తెరపైకి పెదకూరపాడు
అయితే ఆలపాటి ఎట్టి పరిస్థితుల్లోనూ అసెంబ్లీకే పోటీపడాలని పట్టుదలతో ఉన్నందున టీడీపీ అధినేత ప్రత్యామ్నయంగా పెదకూరపాడు సీటును తెరపైకి తెస్తున్నట్లు సమాచారం. ఇక్కడ మాజీ ఎమ్మెల్యే కొమ్మాలపాటి శ్రీధర్‌ను మార్చాలని బాబు భావిస్తున్నందున అవసరమైతే రాజాకు ఈ సీటు ఇస్తామని చెబుతున్నట్లు తెలిసింది. అయితే దీన్ని కొమ్మాలపాటితోపాటు ఆయన వియ్యంకుడైన జిల్లా పార్టీ అధ్యక్షుడు జీవీ ఆంజనేయులు సమ్మతిస్తారా అనేది తేలాల్సి ఉంది. ఇలా ఆలపాటి తెనాలి సీటుపై రాజీపడటం మొదలుపెడితే దాని ప్రభావంతో వచ్చే మార్పు చేర్పులు ఇంకెన్ని ఉంటాయని పొలిటికల్
సర్కిల్స్‌లో అప్పుడే కామెంట్లు మొదలయ్యాయి.