జనసేనకు ఆళ్లగడ్డ సీటు.. ఒక్క దెబ్బకు రెండు పిట్టలు కొట్టే యోచనలో బాబు
నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ భూమా నాగిరెడ్డి కుటుంబం అడ్డా. 1989 నుంచి ఇక్కడ 8సార్లు ఎన్నికలు జరిగితే భూమా కుటుంబమే ఏడుసార్లు గెలిచింది.
రాయలసీమ రాజకీయాల్లో కీలకమైన భూమా కుటుంబానికి కంచుకోట అయిన ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి ఆ కుటుంబాన్ని దూరం చేయబోతున్నారా..? గత ఎన్నికల్లో ఓడినప్పటి నుంచి ఇక్కడ భూమా అఖిలప్రియను పక్కనపెట్టేసిన చంద్రబాబు ఈ ఎన్నికల్లో ఆ సీటును జనసేనకు ఇవ్వబోతున్నారా..? తద్వారా జనసేనకు పొత్తులో సీటిచ్చామని చెప్పుకోవడంతో పాటు భూమా కుటుంబానికి సీటు లేకుండా చేయాలని, తద్వారా ఒకే దెబ్బకు రెండు పిట్టలు కొట్టాలని చంద్రబాబు ఆలోచిస్తున్నారని తెలుస్తోంది.
భూమా కుటుంబానికి అడ్డా
నంద్యాల జిల్లాలోని ఆళ్లగడ్డ భూమా నాగిరెడ్డి కుటుంబం అడ్డా. 1989 నుంచి ఇక్కడ 8సార్లు ఎన్నికలు జరిగితే భూమా కుటుంబమే ఏడుసార్లు గెలిచింది. అందులో నాగిరెడ్డి భార్య శోభానాగిరెడ్డే నాలుగుసార్లు గెలిచారు. ఆమె హఠాన్మరణంతో కుమార్తె అఖిలప్రియ ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. వైసీపీ నుంచి గెలిచిన అఖిలప్రియ తర్వాత పార్టీ ఫిరాయించి టీడీపీలోకి వెళ్లి మంత్రి కూడా అయ్యారు. అయితే గత ఎన్నికల్లో ఓడిపోయినప్పటి నుంచి చంద్రబాబు ఆమెను దూరం పెట్టేశారు.
అఖిలప్రియను దూరం పెట్టే యోచన
అఖిలప్రియను మంత్రిని చేసినప్పటి నుంచి ఆమె దూకుడు ఎక్కువైందని చంద్రబాబు భావిస్తుంటారు. దానికి తోడు ఆమెపై హైదరాబాద్‌లో భూకబ్జా ఆరోపణలు వెల్లువెత్తడం, అందులో హత్యాయత్నాల వరకు వెళ్లడం పార్టీకి తలనొప్పిగా మారాయని టీడీపీ అధిష్టానం భావిస్తోంది. అందుకే ఆమెను పక్కనపెట్టేందుకు కొత్త ఆలోచన చేస్తోంది. 2009లో ప్రజారాజ్యం గెలిచిన ఈ స్థానాన్ని పొత్తులో తమకివ్వాలని జనసేన అడుగుతోంది. ఆళ్లగడ్డలో అఖిలప్రియకు ఇచ్చినా గెలిచే అవకాశాలు పెద్దగా లేవని, ఇంకెవరికైనా ఇచ్చినా భూమా వర్గం పని చేయరని చంద్రబాబుకు తెలుసు. అందుకే అదేదో పొత్తులో జనసేనకు ఇచ్చేస్తే ఓ సీటు ఇచ్చినట్లూ ఉంటుంది.. అఖిలప్రియకు చెక్‌పెట్టినట్టూ అవుతుందని బాబు ఆలోచిస్తున్నట్లు రాజకీయ వర్గాల విశ్లేషణ.