Telugu Global
Andhra Pradesh

చంద్రబాబు బీసీలను వద్దనుకున్నారా..?

బీసీలను చంద్రబాబు దూరంపెట్టేశారనేందుకు ఉభయగోదావరి జిల్లాలే నిదర్శనం. ఉభయగోదావరి జిల్లాల్లో బీసీలంటే ముఖ్యంగా శెట్టిబలిజలనే చెప్పాలి. వైసీపీ తరపున నలుగురు బీసీలను ఎమ్మెల్యేలుగాను, ఇద్దరు బీసీలను ఎంపీలుగా పోటీచేయిస్తున్నారు.

చంద్రబాబు బీసీలను వద్దనుకున్నారా..?
X

జరుగుతున్న పరిణామాలను చూస్తుంటే అందరిలోనూ ఇదే అనుమానాలు పెరిగిపోతున్నాయి. రాబోయే ఎన్నికలకు సంబంధించి చంద్రబాబు నాయుడు రెండు విడతల్లో 128 మంది అభ్యర్థులను ప్రకటించారు. ఇందులో బీసీలకు కేటాయించిన సీట్లు 24 మాత్రమే అని జగన్మోహన్ రెడ్డి మీడియా చెప్పింది. గడచిన ఎన్నికల్లో 43 సీట్లు కేటాయించిన చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో మాత్రం సగానికి సగం సీట్లను ఎందుకు తగ్గించేసినట్లు..? గ‌త ఎన్నికలకన్నా బీసీలకు మరిన్ని టికెట్లు ఇస్తారని అనుకుంటుంటే 24కే పరిమితం చేశారు. మిగిలిన 16 సీట్లలో ఎన్నిస్తారో తెలీదు. ఎందుకు తగ్గించేశారంటే బీసీ సామాజికవర్గాలపై నమ్మకం కోల్పోయినట్లున్నారు. పైకి మాత్రం టీడీపీ అంటేనే బీసీల పార్టీ అని, బీసీలను ఓన్ చేసుకునేది టీడీపీ మాత్రమే అని పదేపదే ప్రకటిస్తుంటారు.

బీసీలకు టీడీపీ చేసినంత మేలు ఇంకో పార్టీ చేయలేదని ఊకదంపుడు ఉపన్యాసాలిస్తుంటారు. కానీ, ఆచరణలో మాత్రం అందుకు భిన్నంగా వ్యవహరిస్తుంటారు. అధికారంలో ఉన్నప్పుడు బీసీ సామాజికవర్గాల మీద నోటికొచ్చినట్లు మాట్లాడటం, అవమానించిన ఫలితమే చాలా సామాజికవర్గాలు టీడీపీకి దూరమై వైసీపీకి దగ్గరయ్యాయి. ప్రతిపక్షంలో ఉన్నప్పుడే జగన్ బీసీలను ఆదరించినతీరు కారణంగా బీసీల్లో మెజారిటీ వర్గాలు ఎన్నికల్లో జై కొట్టాయి. దాని ఫలితమే వైసీపీకి అఖండ విజయం.

బీసీలను చంద్రబాబు దూరంపెట్టేశారనేందుకు ఉభయగోదావరి జిల్లాలే నిదర్శనం. ఉభయగోదావరి జిల్లాల్లో బీసీలంటే ముఖ్యంగా శెట్టిబలిజలనే చెప్పాలి. వైసీపీ తరపున నలుగురు బీసీలను ఎమ్మెల్యేలుగాను, ఇద్దరు బీసీలను ఎంపీలుగా పోటీచేయిస్తున్నారు. అలాగే ఇద్దరు బీసీలకు ఒక ఎంఎల్సీ, ఒక రాజ్యసభ ఇచ్చారు. ఇదే సమయంలో టీడీపీ రెండు జిల్లాల్లో కలిపి చెరో ఎమ్మెల్యే సీటు ఇచ్చింది. ఉభయగోదావరి జిల్లాల్లో రెండుపార్టీలు బీసీలకు ఇచ్చిన సీట్లను చూసిన తర్వాత తేడా స్పష్టంగా అర్థ‌మవుతోంది.

ఏ ఎన్నికల్లో అయినా బీసీల ఓట్లే నిర్ణయాత్మకమవుతాయని అందరికీ తెలిసిందే. అందుకనే రెండుపార్టీలు బీసీల ఓట్ల కోసం వ్యూహాలు, ప్రతివ్యూహాలు పన్నుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో ఇంతకాలం బీసీలంతా తమ వాళ్ళే అని చెప్పుకుంటున్న చంద్రబాబు, లోకేష్ టికెట్లు 24 మందికి మాత్రమే ఇవ్వటం ఆశ్చర్యంగా ఉంది. జరిగిన టికెట్ల పంపిణీని చూస్తుంటే బీసీలు టీడీపీకి మరింత దూరంగా జరిగే సూచనలు కనబడుతున్నాయి. ఇదే గనుక జరిగితే ఇక ఎప్పటికీ టీడీపీ అధికారంలోకి వచ్చే అవకాశం లేదనే అనుకోవాలి.

First Published:  15 March 2024 11:17 AM IST
Next Story