అప్పుడు వరద రాజకీయం.. ఇప్పుడు విలీన రాజకీయం..
ఆ సమస్య చుట్టూ కొన్నాళ్లు రాజకీయం చేయొచ్చనేది బాబు ఆలోచన. కానీ అది కూడా సమసిపోయేలా ఉండటంతో ఆయన నేరుగా ఎంట్రీ ఇస్తున్నారు.
సీఎం జగన్ కంటే ముందే తాను వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి, సీఎం ఇంకా రాలేదు, తానే ముందొచ్చానని చెప్పుకోవాలనుకున్నారు చంద్రబాబు. ఆయన అనుకున్నట్టుగానే చేశారు. పడవ బోల్తా సన్నివేశం పెద్దగా రక్తి కట్టలేదని వైసీపీ నుంచి సెటైర్లు పేలినా, చంద్రబాబు తాను అనుకున్న పని పూర్తి చేసి, ఇప్పుడు విలీన మండలాలపై దృష్టిపెట్టారు. ప్రస్తుతం అక్కడ వేడి చల్లారేలా ఉంది. దీంతో తన ఎంట్రీతో అయినా కాస్త సెగ మొదలవుతుందేమోనని ఆశపడుతున్నారాయన.
గోదావరి వరదల సమయంలో ఏపీ నుంచి సాయం అందడంలో ఆలస్యమైందని, అధికారులు రావడం ఆలస్యమైందని ఆరోపిస్తూ అల్లూరి జిల్లా ఎటపాక మండల గ్రామస్తులు ఆందోళన చేపట్టారు. తమను తిరిగి తెలంగాణలో కలిపేయాలంటూ తీర్మానాలు చేశారు. వారికి తెలంగాణ నేతల మద్దతు కూడా ఉండటం గమనార్హం. ఈ దశలో సీఎం జగన్, ముంపు మండలాలకు కొత్త రెవెన్యూ డివిజన్ ని ప్రకటించడంతో ఎటపాక మండల వాసులు శాంతించారు. వరద తగ్గిపోవడంతో ఎవరి పనుల్లో వారు మునిగిపోయారు. కానీ ఇది చంద్రబాబుకి నచ్చలేదు. రాష్ట్రంలో అసలు సమస్యలే కరువయ్యాయి, చాలా కాలం తర్వాత విలీన గ్రామస్తులు వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు చేయడంతో.. ఆ సమస్య చుట్టూ కొన్నాళ్లు రాజకీయం చేయొచ్చనేది బాబు ఆలోచన. కానీ అది కూడా సమసిపోయేలా ఉండటంతో ఆయన నేరుగా ఎంట్రీ ఇస్తున్నారు.
పోలవరం విలీన మండలాల్లో రెండు రోజులపాటు చంద్రబాబు పర్యటించబోతున్నారు. వేలేరుపాడు కుక్కునూరు, ఎటపాక, కూనవరం, వీఆర్ పురం మండలాల్లో బాబు పర్యటన కొనసాగనుంది. రెండు రోజుల పర్యటన అనంతరం భద్రాచలంలో రాత్రికి బస చేసి తిరుగు ప్రయాణం అవుతారు. ఇప్పటికిప్పుడు విలీన గ్రామాల్లో ఆయన పర్యటన పెట్టుకోవడం ఆసక్తిగా మారింది. విలీన మండలాల్లో ప్రజల్ని రెచ్చగొట్టేందుకే చంద్రబాబు అక్కడికి వెళ్తున్నారని వైసీపీ విమర్శలు ఎక్కుపెడుతోంది. ఆయా మండలాలు తెలంగాణ నుంచి ఏపీలో విలీనం అయ్యాక, ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు ఎప్పుడూ అటువైపు వెళ్లలేదని, ఇప్పుడు కావాలనే రెచ్చగొట్టేందుకు పర్యటన పెట్టుకున్నారని అంటున్నారు. వైసీపీ విమర్శలు ఎలా ఉన్నా.. అక్కడ ఇప్పుడు వాతావరణం కాస్త శాంతిస్తుండటంతో చంద్రబాబు హడావిడి పడుతున్నారు. గోదావరి జిల్లాల్లో వరద రాజకీయం అయిపోవడంతో, విలీన రాజకీయానికి సిద్ధమయ్యారు.