Telugu Global
Andhra Pradesh

జనాలంటే వీళ్ళకి అంత చులకనా?

ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేరకం కాదని చంద్రబాబు, లోకేష్ పదేపదే చెప్పుకుంటుంటే జనాలు ఆశ్చర్యపోతున్నారు. పైగా హామీలను నెరవేర్చటంలో తనను జగన్మోహన్ రెడ్డితో పోల్చద్దని లోకేష్ ప్రొద్దుటూరులో వ్యాపారస్తులను రిక్వెస్ట్‌ చేయటమే పెద్ద జోక్.

జనాలంటే వీళ్ళకి అంత చులకనా?
X

చంద్రబాబునాయుడుకి జనాదరణ మీద చాలా నమ్మకమే ఉన్నట్లుంది. పార్టీ నేతలతో జరిగిన సమీక్షలో మాట్లాడుతూ.. తానిచ్చిన హామీలను తమ్ముళ్ళకు వినిపించారు. ఏడాదికి మూడు సిలండర్లను ఇస్తామన్నారు. తల్లికి వందనం పథకంలో ఇంట్లో ఎంతమంది పిల్లలుంటే అంతమందికి ఏడాదికి రూ.15 వేలు ఇస్తారట. ఇద్దరుంటే రూ.30 వేలు, ముగ్గురుంటే రూ.45 వేలు, నలుగురు పిల్లలుంటే రూ.60 వేలిస్తామన్నారు. అధికారంలోకి రాగానే 20 లక్షల మందకి ఉద్యోగాలు కల్పిస్తారట.

పరిశ్రమలు తెస్తారట, పెట్టుబడులూ తెస్తారట. ఉద్యోగాలు వచ్చేంతవరకు నిరుద్యోగులకు నెలకు రూ. 3 వేల భృతి ఇస్తామన్నారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తారట, ఏడాదికి రూ. 20 వేలిస్తామన్నారు. బీసీల రక్షణ కోసం ప్రత్యేకంగా రక్షణ చట్టం తెస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారు. నిజానికి మొన్నటి మహానాడులో ఇచ్చిన హామీల్లో చాలావరకు ఏదో పేరుతో 2019 ఎన్నికల్లో ఇచ్చినవే. అయితే అప్పట్లో ఇచ్చిన వందలాది హామీల్లో ఏ ఒక్కటి కూడా సంపూర్ణంగా నెరవేర్చలేదు.

గ‌త ఎన్నికల్లో చంద్రబాబు ఇచ్చిన హామీలు, అమలు చేయకుండా చేసిన మోసం.. అన్నీ జనాలకు బాగానే గుర్తున్నాయి. ఐదేళ్ళ కిందటే హామీలిచ్చి ఎగ్గొట్టిన‌ చంద్రబాబు నైజం గురించి ప్రత్యేకంగా చెప్ప‌న‌వ‌స‌రం లేదు. ఇన్ని హామీలు ఇస్తున్నా తనను జనాలు నమ్ముతారా అన్న అనుమానం కొంచెం కూడా చంద్రబాబులో ఉన్నట్లు లేదు.

గతంలో ఇచ్చిన హామీలన్నింటినీ నెరవేర్చేసినట్లే రాబోయే ఎన్నికల్లో మళ్ళీ కొత్త హామీలను ఇస్తున్నట్లుగా బిల్డప్ ఇస్తుండటమే ఆశ్చర్యంగా ఉంది. ఇచ్చిన హామీలను ఎగ్గొట్టేరకం కాదని చంద్రబాబు, లోకేష్ పదేపదే చెప్పుకుంటుంటే జనాలు ఆశ్చర్యపోతున్నారు. పైగా హామీలను నెరవేర్చటంలో తనను జగన్మోహన్ రెడ్డితో పోల్చద్దని లోకేష్ ప్రొద్దుటూరులో వ్యాపారస్తులను రిక్వెస్ట్‌ చేయటమే పెద్ద జోక్. తమ పార్టీ ఇస్తున్న ప్రతి హామీని సంపూర్ణంగా నెరవేర్చే బాధ్యత తాను తీసుకున్నట్లు ప్రకటించారు. తండ్రీకొడుకుల మాటలతోనే అర్థ‌మైపోతోంది జనాల మెమొరీ అంటే వీళ్ళకు ఎంత చులకనో.

First Published:  8 July 2023 12:43 PM IST
Next Story