కొత్త దారేదీ లేదా..? జగన్ బాటలోకే చంద్రబాబు
ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాల సంఖ్యను కొంత తగ్గించి.. రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెడుతుందేమోనని అంతా భావించారు. అయితే టీడీపీ మేనిఫెస్టో చాలామందికి షాక్ ఇచ్చింది.
మహానాడు వేదికగా టీడీపీ మేనిఫెస్టోను చంద్రబాబు ప్రకటించారు. అయితే ఆయన మేనిఫెస్టో చూసి అంతా ఆశ్చర్యపోతున్నారు. ఇందులో చాలా పథకాలు ప్రస్తుతం ఏపీలో అమలవుతున్నవే ఉండగా.. మరికొన్ని తమిళనాడు, కర్ణాటకలో అమలవుతున్న పథకాలను కాపీ కొట్టారనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ లెక్కలేనన్ని సంక్షేమ పథకాలు అమలుచేస్తుండటంతోనే రాష్ట్ర అభివృద్ధి కుంటుపడింది.. రోడ్లు, మౌలిక వసతులు కల్పించలేని పరిస్థితి అని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ ఎప్పటినుంచో ఆరోపిస్తోంది. అయితే టీడీపీ చేసిన ఈ ఆరోపణల్లో నిజం ఉంది. వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు రూ. లక్షల కోట్లు ఖర్చు పెడుతుండటంతో రాష్ట్రంలో రోడ్లు కూడా వేయలేని పరిస్థితి.
ఇక గ్రామాల్లో పంచాయతీ ఖాతాలకు నిధులు విడుదల కాక అభివృద్ధి మొత్తం ఆగిపోయింది. గత ప్రభుత్వాలు వేసిన సీసీ రోడ్లే తప్ప ఇప్పుడు పెద్దగా వేసింది లేదు. తాగునీరు కూడా సక్రమంగా అందించలేకపోతున్నారు. ఇక నిధులన్నీ సంక్షేమ పథకాలకు మళ్లుతుండడంతో ప్రభుత్వ ఉద్యోగులకు ఒకటో తారీఖున జీతాలు కూడా వేయలేని పరిస్థితి ప్రభుత్వానిది. ప్రభుత్వం ఏదో ఒక విధంగా అందిన కాడికి అప్పులు తెచ్చుకొని ఎలాగోలా మేనేజ్ చేసుకుంటూ వస్తోంది. దీనిపై కూడా టీడీపీ విమర్శలు చేస్తోంది. రాష్ట్రం అప్పుల ఊబిలోకి కూరుకుపోతోందని మండిపడుతోంది.
ఒకవేళ వచ్చే ఎన్నికల్లో టీడీపీ గెలిచి అధికారంలోకి వస్తే సంక్షేమ పథకాల సంఖ్యను కొంత తగ్గించి.. రోడ్లు, ఇతర మౌలిక వసతుల కల్పనపై దృష్టి పెడుతుందేమోనని అంతా భావించారు. అయితే టీడీపీ మేనిఫెస్టో చాలామందికి షాక్ ఇచ్చింది. వైసీపీ ప్రభుత్వం కంటే మిన్నగా సంక్షేమ పథకాలు అమలు చేస్తామని టీడీపీ చెబుతోందని.. ఈ పథకాల అమలుకు నిధులు ఎక్కడ నుంచి తెస్తారని జనం ప్రశ్నిస్తున్నారు. ఇక మౌలిక వసతులు కల్పించడానికి డబ్బు ఎక్కడ ఉంటుందని నిలదీస్తున్నారు.
ఇప్పుడు జగన్ ప్రభుత్వం అమ్మ ఒడి పథకం కింద ఒక ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉన్నా ఒక్కరికి మాత్రమే సాయం అందిస్తోంది. కానీ టీడీపీ మాత్రం ఇంట్లో ఎంతమంది విద్యార్థులు ఉంటే అంతమందికి సాయం అందజేస్తామని ప్రకటించింది. అలాగే 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 బ్యాంక్ ఖాతాలో వేస్తామని చెప్పింది. ఇప్పుడు జగన్ ప్రభుత్వం వృద్ధులకు నెలకు రూ. 2,750 పింఛను అందజేయడానికే ఇబ్బందులు పడుతుంటే.. వీరికి పింఛను కొనసాగిస్తూనే..(అప్పటికల్లా రూ. 3 వేలు) టీడీపీ ప్రభుత్వం నిరుద్యోగ భృతి కింద యువకులకు నెలకు రూ.3 వేలు అందజేయాల్సి ఉంటుంది.
ఇక ఇవి కాక దీపం పథకం కింద మహిళలకు ఏడాదికి మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లు అందజేస్తామని టీడీపీ ప్రకటించింది. ఇందుకుగాను ప్రతి లబ్ధిదారులైన మహిళకు ఏడాదికి సుమారు రూ. 3500 ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. అలాగే మహిళలకు ప్రభుత్వ బస్సుల్లో ఉచిత ప్రయాణం కల్పిస్తామని చెప్పింది. ఈ పథకాలు అన్నీ గమనిస్తే ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాలకు కేటాయిస్తున్న మొత్తం కంటే భారీగా నిధులు కేటాయించాల్సి ఉంటుంది.
రాష్ట్ర అభివృద్ధి విషయంలో జగన్ ప్రభుత్వంపై జనంలో వ్యతిరేకత ఉన్నప్పటికీ వివిధ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారు వైసీపీకి ఓటు వేసే అవకాశం ఉందని గ్రహించిన చంద్రబాబు ఈ విషయంలో జగన్ ను దీటుగా ఎదుర్కొవడం కోసమే భారీగా సంక్షేమ పథకాలు ప్రకటించారని తెలుస్తోంది. టీడీపీ ప్రకటించిన మేనిఫెస్టోను గమనిస్తే జగన్ ను చంద్రబాబు ఫాలో అయ్యారని చెప్పక తప్పదని జనం నుంచి కామెంట్స్ వినిపిస్తున్నాయి.