సీనియర్లకు చంద్రబాబు మొండిచేయి.. తప్పని తిరుగుబాట్లు..
ఎన్టీఆర్ జిల్లా మైలవరం సీటును వైసీపీ నుంచి వచ్చిన సిట్టింగ్ ఎమ్యెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు చంద్రబాబు ఖరారు చేయబోతున్నారు. దీంతో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు మైలనరంలో ఎదురు దెబ్బ తగలనుంది.
పలు నియోజకవర్గాల్లో తన పార్టీ సీనియర్లకు టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు మొండిచేయి చూపిస్తున్నారు. ఆయా నియోజకవర్గాల్లో పార్టీని బతికిస్తూ టికెట్లపై ఆశలు పెట్టుకున్న సీనియర్ నేతలు తమకు టికెట్లు రావడం లేదని తెలిసి అగ్గిమీద గుగ్గిలం అవుతున్నారు. జనసేనతో పొత్తు వల్లనే కాకుండా వైసీపీ నుంచి వచ్చినవాళ్లకు టికెట్లు ఇవ్వాలనే చంద్రబాబు నిర్ణయం వల్ల కూడా పలువురి ఆశలకు గండిపడుతోంది.
పవన్ కల్యాణ్ ఉత్తరాంధ్ర, గోదావరి జిల్లాల్లో పర్యటించి తమ పార్టీ పోటీ చేసే స్థానాలను ప్రకటించి, అభ్యర్థులను కూడా ఖరారు చేశారు. ఇది పలువురు టీడీపీ నాయకుల గొంతుల్లో పచ్చివెలక్కాయ పడినట్టు అయింది. పెందుర్తి, గాజువాక, విశాఖ దక్షిణం, భీమిలి, అనకాపల్లి, యలమంచిలి సీట్లకు పార్టీ అభ్యర్థులను ఖరారు చేసినట్లు పవన్ కల్యాణ్ చెప్పారు. దీంతో పెందుర్తి మాజీ ఎమ్యెల్యే బండారు సత్యనారాయణ మూర్తి, గాజువాక టీడీపీ ఇన్‌చార్జ్ పల్లా శ్రీనివాసరావుల సీట్లు గల్లంతయ్యాయి. దీంతో వారు భగ్గుమంటున్నారు.
ఎన్టీఆర్ జిల్లా మైలవరం సీటును వైసీపీ నుంచి వచ్చిన సిట్టింగ్ ఎమ్యెల్యే వసంత కృష్ణప్రసాద్‌కు చంద్రబాబు ఖరారు చేయబోతున్నారు. దీంతో మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు మైలనరంలో ఎదురు దెబ్బ తగలనుంది. టికెట్ విషయంలో వసంతకృష్ణ ప్రసాద్‌కు, దేవినేని ఉమాకు మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది. దానివల్ల వసంతకృష్ణ ప్రసాద్ అక్కడ విజయం సాధించడం కష్టమే అవుతుంది.
రాజమండ్రి రూరల్ నియోజకవర్గం నుంచి తమ పార్టీ నాయకుడు కందుల దుర్గేష్ పోటీ చేస్తారని పవన్ కల్యాణ్ ప్రకటించారు. దాంతో సిట్టింగ్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి జనసేన నేతలపై మండిపడుతున్నారు.
ఉమ్మడి అనంతపురం జిల్లాలో పరిటాల సునీత, జేసీ దివాకర్ రెడ్డి కుటుంబాలను కూడా చంద్రబాబు దెబ్బ కొడుతున్నారు. ఒక్కో కుటుంబంలో ఒక్కొక్కరికి మాత్రమే సీటు ఇస్తానని చంద్రబాబు చెప్పినట్లు తెలుస్తోంది. దీంతో సునీత కుమారుడు పరిటాల శ్రీరామ్ ధర్మవరం సీటును వదులుకోవాల్సిన పరిస్థితిలో పడ్డారు. జేసీ దివాకర్ రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి కుమారుల్లో ఒక్కరికి మాత్రమే ఎంపీ సీటు గానీ ఎమ్యెల్యే సీటు గానీ ఇస్తానని చంద్రబాబు స్పష్టం చేసినట్లు సమాచారం.
అలాగే, అనకాపల్లిలో చింతకాయల అయ్యన్నపాత్రుడు కుటుంబానికి కూడా ఒక్క సీటు మాత్రమే ఇస్తానని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. ఆళ్లగడ్డ సీటును మాజీ మంత్రి భూమా అఖిలప్రియకు ఇవ్వడానికి చంద్రబాబు నిరాకరించారని సమాచారం. చంద్రబాబు నిర్ణయాలతో సీనియర్ నాయకులంతా తిరుగుబాటు చేయడానికి సిద్ధపడుతున్నట్లు తెలుస్తోంది.