కూటమి గ్యారేజ్- ఇచ్చట 'తలలు మార్చబడును'
నరసాపురం నుంచీ ఇన్నాళ్లు అంటకాగిన రఘురామరాజు కి బీజేపీ నుంచి ఇప్పిద్దామనుకున్నా, కుదర్లేదు. ఇక తప్పని పరిస్థితుల్లో ఉండి ఎమ్మెల్యే రామరాజుకి ఇచ్చిన టిక్కెట్టు వెనక్కి లాక్కొని మరీ రఘురామకృష్ణం రాజుకి ఇవ్వాల్సొచ్చింది.
వడ్డించే వాడు మనవాడైతే.. వెనక బంతిలో కూర్చున్నా ఏమీ ఇబ్బంది లేదు. బాబ్బాబు అని అడుక్కోక అక్కర్లేదు. రాజకీయాల్లో ఇదీ మరీ స్పష్టంగా తెలిసిపోతుంటుంది. వడ్డించే వాడు చంద్రబాబే అయితే తెలుగు దేశం వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా ఎమ్మెల్యే టికెట్లూ, ఎంపీ టికెట్లూ నడుచుకుంటూ వచ్చేస్తాయి. ఇది తెలుగుదేశం టికెట్ల గురించి కాదు. బాబు గారితో పొత్తు పెట్టుకున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పార్టీ జనసేన, మళ్ళీ కేంద్రంలో అధికారంలోకి ఆల్మోస్ట్ వచ్చేస్తాం అనుకుంటున్న బీజేపీ, ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళని దత్తత తీసుకుని మరీ నెత్తిన పెట్టుకునే పరిస్థితికి చేరుకున్నాయి.
నిజానికి ఎన్డీఏకి రెండోసారి రామ్ రామ్ పలికి ఎన్టీఆర్ జన్మంతా అసహ్యించుకున్న కాంగ్రెస్‌తో చెట్టాపట్టాలేసుకున్న చంద్రబాబుకి 2018లో సమ్మగానే ఉండింది. కానీ, 2019లో ఉన్నదీ, ఉంచుకున్నదీ (అదే అండీ.. ఒంటి మీది బట్టలు మాత్రం కాదు) ఊడిపోయాక తత్త్వం బోధపడింది. తెలంగాణలో కాంగ్రెస్ పప్పు 2018లో ఉడకలేదు. ఇంక 2019లో పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పొత్తులు లేకుండా తన చరిత్రలో మొదటిసారి తెలుగుదేశం ధైర్యం చేసి ఒంటరిగా బరిలోకి దిగితే.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు కర్రు కాల్చి ఉన్నన్నాళ్లు మర్చిపోలేనంత పెద్ద వాత పెట్టేశారు. దెబ్బకి దెయ్యం దిగొచ్చింది. ఆ 23 మంది ఎమ్మెల్యేలని కొనేసినంత సులభం అనుకున్న చంద్రబాబు కి జగన్ దెబ్బ తీవ్రత తెలిసింది.
అంతే.. హుటాహుటిన తన నమ్మిన బంట్లు రాజ్యసభ సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్, గరికపాటి మోహనరావు, టీజీ వెంకటేష్ లని బీజేపీలోకి పంపేసి - తన ఏజంట్లుగా వాళ్ళని ఆ పార్టీలోనే ఉంచేశాడు. వాళ్ళు పేరుకి బీజెపీ ఎంపీలుగా కొనసాగినా.. చంద్రబాబుకి సంబంధించిన పనులు చక్కబెట్టడమే వాళ్ళ ప్రధానమైన టాస్క్. ఇదేదో బాగుందనుకున్న బాబు గారు.. ఈ ఎక్స్‌పోర్ట్ క్వాలిటీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఉండటం ఎంత ఉపయోగమో బాగానే తెలుసు కాబట్టి.. 2024 ఎన్నికలకి అదే మంత్రాన్ని బయటికి తీశారు.
మన లాంగెస్ట్ సర్వింగ్ ముఖ్యమంత్రీ.. లాంగెస్ట్ సర్వింగ్ ప్రతిపక్ష నాయకుడు మహారాజశ్రీ చంద్రబాబు గారు.. ఈ సారికి తన తెలివికి మరింత పదును పెట్టి.. పవన్ కళ్యాణ్ తో ఒక ప్యాకేజీ మాట్లాడుకున్నారు.
(మేమేం డబ్బుల ప్యాకేజీ గురించి అనడం లేదు.)
ముందు ఒక 24 అసెంబ్లీ సీట్లూ, ఒక 3 పార్లమెంటు సీట్లూ ఇవ్వడానికి ఒప్పుకుని, తీరా బీజేపీ కావాలంటోందని మూడు అసెంబ్లీ సీట్లు, ఒక ఎంపీ సీటు లాగేసుకున్నారు. లాక్కొని.. పవర్ స్టార్ గారు పెద్ద త్యాగరాజని మెచ్చి మేకతోలు కప్పేశారు. మన నటుడికి అర్థమయినా.. అర్థం కానట్టు నటించేసి రాజకీయ ఆస్కార్ అవార్డుకి అప్లికేషన్ పెట్టేసుకున్నాడు.
ఇక పవన్ పార్టీలోకి బాబు గారు 'పంపింగ్' మొదలు పెట్టారు (పంపింగ్ అంటే తన పార్టీ మనుషులని పంపటం). సుజనా చౌదరికి బీజేపీ విజయవాడ సెంట్రల్ టికెట్, సీఎం రమేష్ కి అనకాపల్లి ఎంపీ టికెట్ ఇప్పించారు బీజేపీ చేత. పంచకర్ల రమేష్ బాబుని జనసేనలోకి లాక్కొమ్మని సలహా ఇచ్చి ఆ వైసీపీ లీడర్ కి పెందుర్తి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించారు. నరసాపురం నుంచీ ఇన్నాళ్లు అంటకాగిన రఘురామరాజు కి బీజేపీ నుంచి ఇప్పిద్దామనుకున్నా, కుదర్లేదు. ఇక తప్పని పరిస్థితుల్లో ఉండి ఎమ్మెల్యే రామరాజుకి ఇచ్చిన టిక్కెట్టు వెనక్కి లాక్కొని మరీ రఘురామకృష్ణం రాజుకి ఇవ్వాల్సొచ్చింది.
మండలి బుద్ధప్రసాద్ కి మూడ్రోజుల ముందే పార్టీలో చేరినా అవనిగడ్డ టిక్కెట్టిచ్చి తనను తానూ గౌరవించుకోవాల్సిన పరిస్థితి పాపం పవన్ కళ్యాణ్ ది. అక్కడ తానే ఎమ్మెల్యే కాండిడేట్ అనుకున్న వికృతి శ్రీనివాస్ కి రాజకీయ వికృతి అంటే ఏంటో తెలిసొచ్చింది. ఇక సొంతానికి ఎన్నో చోట్ల అభ్యర్థుల్లేని పవన్ కళ్యాణ్.. వైఎస్సార్ కాంగ్రెస్ లో తిరస్కరణకి గురైన వాళ్ళని అక్కున చేర్చుకుని టికెట్లివ్వాల్సొచ్చింది. బందరు పార్లమెంటు సీటు కి వల్లభనేని బాలశౌరి, వైజాగ్ సౌత్ నుంచీ వంశీకృష్ణ యాదవ్ (వైసీపీ ఎమ్మెల్సీ), చిత్తూరు నుంచీ వైసీపీ ఎమ్మెల్యే అరణి శ్రీనివాస్, భీమవరం నుంచీ తన మీదే పోటీ చేసిన తెలుగుదేశం అభ్యర్థి పులపర్తి అంజిబాబుకి జనసేన తరఫున భీమవరం నుంచీ.. ఇలా చెప్పుకుంటూ పోతే అందరూ బాబు క్యాండిడేట్లే.
పాలకొండలో నిమ్మక జయకృష్ణ కూడా ఎక్స్ పోర్ట్ క్వాలిటీ ఎమ్మెల్యే కాండిడేట్. లేటెస్ట్ గా.. అనపర్తిలో నల్లమిల్లి రామకృష్ణారెడ్డి తెలుగుదేశం టికెట్టు దక్కలేదని ఆగ్రహం మీద ఉంటె.. ఆయనని బుజ్జగించడానికి, పొత్తులో భాగంగా బీజేపీకి ఆ సీట్ ఇచ్చేసినందు వల్ల, ఆ బీజేపీ అభ్యర్థినే మార్చి.. ఈ రామకృష్ణారెడ్డిని బీజేపీలోకి ఎగుమతి చేసి.. టికెట్ ఇప్పించడానికి రంగం సిద్ధం చేశారు చంద్రబాబు.
క్విడ్ ప్రోకో లో భాగంగా బహుశా.. దెందులూరులో తెలుగుదేశం అభ్యర్థి చింతమనేని ప్రభాకర్‌కి చిప్ప చేతికిచ్చి.. ఆ సీటు వదినమ్మ పురందేశ్వరి రికమెండేషన్‌తో తపనా చౌదరి అనే వ్యక్తికి బీజేపీ టిక్కెట్ ఇప్పించేట్టున్నారు మన చంద్రబాబు గారు.
తెలుగుదేశమైతేనేమి, జనసేన అయితేనేమి, బీజేపీ అయితేనేమి.. ఆఖరికి వైసీపీ వద్దనుకుంటేనేమి.. అంతా "మన వాళ్ళే".. అందుకే వాళ్లందరికీ కూడా చంద్రబాబే "మా బాబు".. మా బాబే..