పంచాయితీలు, సెటిల్‌మెంట్లలో బాబు బిజీ
ఇప్పటివరకూ 60 వరకూ నియోజకవర్గాల సమీక్ష పూర్తయిందని తెలుస్తోంది. ఈ నియోజకవర్గాలన్నీ కూడా టీడీపీ గ్రూపులు, ఇన్‌చార్జిపై అలకలు, సీటు పోటీలు తీవ్రమైనవే.
గత కొద్దిరోజులుగా చంద్రబాబు బహిరంగ సభలలో పాల్గొనడంలేదు. పార్టీ కార్యక్రమాలు కూడా జోన్లవారీగా అప్పగించేశారు. టీడీపీ అధినేత మాత్రం హాజరు కావట్లేదు. తనయుడు యువగళం పాదయాత్ర ఆరంభం రోజు నుంచీ మానటరింగ్ తప్పించి బాబు వెళ్లలేదు. క్షణం తీరిక లేకుండా నిత్యం రాజకీయ కార్యకలాపాల్లో ఉండే బాబు ఏం చేస్తున్నారో తెలుసా..! సెటిల్మెంట్లు, పంచాయితీలు.
చంద్రబాబేంటి..? ఈ సెటిల్మెంట్ల పంచాయితీ ఏంటని పొరపాటు పడటం సహజం. పార్టీలో అంతర్గత కలహాలు, నేతల మధ్య విభేదాలు, సీట్ల సిగపట్లు పంచాయితీలు ఒక్కొక్కటి సరిదిద్దుకుంటూ వస్తున్నారు. ఒక్కో నియోజకవర్గం నుంచి టీడీపీ ఇన్‌చార్జితోపాటు మండలస్థాయి నాయకులు సైతం టీడీపీ కేంద్ర కార్యాలయానికి పిలిపించుకుంటున్నారు. ముందుగా మండలస్థాయి నేతలు ఫీడ్ బ్యాక్ ఆయా విభాగాలు తీసుకుంటున్నాయి. అందరూ కలిసి చివరిలో బాబుని కలుస్తున్నారు. ఈ సమావేశంలో వివిధ నివేదికల ఆధారంగా పనితీరు, అభ్యర్థి ఆర్థిక-రాజకీయ సత్తా, కొత్తవారి కోసం సూచనలు స్వీకరిస్తున్నారు. చాలా రోజులుగా నియోజకవర్గ స్థాయిలో అసంతృప్తులు, ఆశావహులకి ఈ సమావేశాలలో తమ అభిప్రాయాలు చెప్పే వేదికగా ఉపయోగించుకుంటున్నారు. కానీ, బాబు నుంచి అటు అసంతృప్తులకి కానీ, ఇటు ఆశావహులకి కానీ ఎటువంటి హామీ లభించడంలేదని తెలుస్తోంది.
ఇప్పటివరకూ 60 వరకూ నియోజకవర్గాల సమీక్ష పూర్తయిందని తెలుస్తోంది. ఈ నియోజకవర్గాలన్నీ కూడా టీడీపీ గ్రూపులు, ఇన్‌చార్జిపై అలకలు, సీటు పోటీలు తీవ్రమైనవే. తాజాగా సంతలనూతలపాడు, పాయకరావుపేట, పాలకొండ, పార్వతీపురం, శ్రీకాకుళం నియోజకవర్గాల సమీక్ష హాట్ హాట్‌గా సాగింది. ప్రతీ చోటా గ్రూపుల గొడవ తీవ్రంగా ఉందని టీడీపీ అధిష్టానం గుర్తించింది. శ్రీకాకుళంలో ఇన్‌చార్జి గుండ లక్ష్మీదేవి ఏకంగా టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడే తన నియోజకవర్గంలో అసమ్మతికి అండగా నిలిచారంటూ ఆరోపణలు చేసినట్టు సమాచారం. పాలకొండ అభ్యర్థి నిమ్మక జయకృష్ణని మార్చాలని ద్వితీయ శ్రేణి నేతలు గట్టిగానే పట్టుబట్టారని తెలుస్తోంది. ముందస్తు ఎన్నికలకి వెళ్తారనే ఊహాగానాలు నేపథ్యంలో చంద్రబాబు నియోజకవర్గాల వారీగా టీడీపీలో గ్రూపుల పంచాయితీలు సెటిల్ చేసే పనిలో పడ్డారు.