Telugu Global
Andhra Pradesh

ఈ లక్షణమే చంద్రబాబులో పెద్ద మైనస్

మనసులోని మాటను పైకి గట్టిగా చెప్పలేని పిరికితనమే చంద్రబాబును బాగా ఇబ్బందిపెడుతోంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి ఎంపిక విషయంలోనే.

ఈ లక్షణమే చంద్రబాబులో పెద్ద మైనస్
X

రాజకీయం అన్నాక ప్రతిసారి మనకే అడ్వాంటేజ్ అవుతుందన్న గ్యారెంటీలేదు. ఒక్కోసారి ప్రయోగాలు చేయాల్సి ఉంటుంది. మైనస్ అవుతుందనే అంచనాలు ఉన్నా ధైర్యంగా నిర్ణయం తీసుకోవాలి. ఈ లక్షణాలు చంద్రబాబునాయుడులో ఒక్కటంటే ఒక్కటికూడా లేదు. ప్రతిదానికీ అనుమానమే. ప్రతి అడుగు తనకే సానుకూలమవ్వాలనే ఆలోచన. మనసులోని మాటను పైకి గట్టిగా చెప్పలేని పిరికితనమే చంద్రబాబును బాగా ఇబ్బందిపెడుతోంది. ఇప్పుడు ఇదంతా ఎందుకంటే గుడివాడ అసెంబ్లీ నియోజకవర్గం అభ్యర్థి ఎంపిక విషయంలోనే.

గుడివాడలో రాబోయే ఎన్నికల్లో ఎవరు పోటీ చేయాలనే విషయం చూయింగ్ గమ్ లాగ సాగుతోంది. చంద్రబాబుకు ఏమో ఎన్ఆర్ఐ వెనిగళ్ళ రామును పోటీ చేయించాలని బలంగా ఉంది. అయితే అందుకు పార్టీ నేతలు ఎవరూ అంగీకరించటంలేదు. మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు తానే పోటీ చేయాలని గట్టిగా పట్టుబట్టారు. ఇదే విషయాన్ని పార్టీ సమావేశంలో బహిరంగంగా చాలాసార్లు ప్రకటించారు. ఇక్కడ విషయం ఏమిటంటే రావికి టికెట్ ఇవ్వటం చంద్రబాబుకు ఇష్టంలేదు.

ఆ విషయాన్ని బహిరంగంగా గట్టిగా తెగేసి చెప్పవచ్చు. రావిని కాదని వెనిగళ్ళకే టికెట్ ప్రకటించచ్చు. అయితే అలా ప్రకటిస్తే తాను చంద్రబాబు ఎందుకవుతారు? అందుకనే త్రిసభ్య కమిటీని నియమించారు. గుడివాడలో అభ్యర్థిని నిర్ణయించేందుకు కేశినేని చిన్ని, కొల్లు రవీంద్ర, ఎమ్మెల్సీ రాజులను నియమించారు. వీళ్ళు మండల స్థాయిలోని నేతలతో మాట్లాడి అభ్యర్థిని ఫైనల్ చేస్తారట. ఒకవైపు ఈ తంతు జరుగుతుండగానే పార్టీలో వెనిగళ్ళ రామునే అభ్యర్థి అని ప్రచారం జరిగిపోతోంది. ఎందుకంటే చంద్రబాబు మనసులో వెనిగళ్ళే ఉన్నారని అందరికీ తెలుసు.

మరి అందరికీ తెలిసిన విషయంలో కూడా చంద్రబాబు ఎందుకు ముసుగులో గుద్దులాట ఆడుతున్నారో అర్థంకావటంలేదు. రావి కన్నా వెనిగళ్ళే గట్టి అభ్యర్థి అని చంద్రబాబుకు నమ్మకం ఉన్నప్పుడు అదే విషయం ప్రకటించవచ్చు కదా. ముగ్గురు నేతలతో కమిటీయని, అభిప్రాయ సేకరణని, అధికారంలోకి రాగానే రావికి ఏమి పోస్టు ఇవ్వబోతున్నారనే సొల్లు వ్యవహారం అంతా ఎందుకో అర్థంకావటంలేదు. ఒక్క గుడివాడలో అభ్యర్థిని ఫైనల్ చేసే విషయంలోనే చంద్రబాబు ఇంత భయపడుతున్నారు. మరిలాంటి చాలా నియోజకవర్గాల్లో అభ్యర్థులను ఫైనల్ చేయాల్సి ఉంటుంది. పొత్తుల్లో వదులుకోవాల్సిన సీట్లు కూడా ఉంటాయి. మరి అప్పుడు ఆ నేతల విషయంలో ఏం చేస్తారో చూడాలి.


First Published:  3 Sept 2023 10:05 AM IST
Next Story