అదానీపై చర్యలకు చంద్రబాబు భయపడుతున్నారు : షర్మిల
అదానీపై చర్యలకు ముఖ్యమంత్రి చంద్రబాబుకు కచ్చితమైన సమాచారం కావాలట అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు.
గౌతమ్ అదానీపై చర్యలకు సీఎం చంద్రబాబుకు కచ్చితమైన సమాచారం కావాలట అని ఏపీ కాంగ్రెస్ చీఫ్ వైఎస్ షర్మిల విమర్శించారు. టీటీపీ ప్రతిపక్షంలో ఉండగా ఏ సమాచారంతో కరెంట్ ఒప్పందాలపై కోర్టుకు వెళ్లారని ఆదానితో చేసుకున్న ఒప్పందాల్లో అవినీతి దాగి ఉందని ఎందుకు అన్నారని చంద్రబాబును షర్మిల ప్రశ్నించారు. అదా నీ పవర్ ఎక్కువ రేటు పెట్టి కొనడంతో రాష్ట్ర ప్రజలపై లక్ష కోట్ల రూపాయల భారం పడిందని ఆనాడు ఎందుకు చెప్పారని ప్రశ్నించారు. తాడేపల్లి ప్యాలెస్ వేదికగా రాష్ట్రాన్ని ఆదానికి దోచుపెడుతున్నారని ఎందుకు ఆరోపణలు చేశారని నిలదీశారు షర్మిల.
అమెరికన్ కోర్టుల్లో అదానీపై కేసులు కూడా పెట్టారని... ఇంత తతంగం నడుస్తుంటే, అన్ని ఆధారాలు కళ్ళ ముందు కనిపిస్తుంటే, అదానీ మోసానికి రాష్ట్రమే అడ్డాగా మారితే, మాజీ ముఖ్యమంత్రి నేరుగా అవినీతిలో భాగంగా ఉంటే, కచ్చిత సమాచారం కావాలని చంద్రబాబు అడగటం రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నట్లేనని అన్నారు. అధికారం దగ్గర పెట్టుకుని నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యతను మరిచారని దుయ్యబట్టారు. కనీసం ఒప్పందాల్లో ఏం జరిగిందో తేల్చడానికి ఏసీబీని సైతం రంగంలోకి దించకపోవడం... అదానీని కాపాడుతున్నారు అనే దానికి నిదర్శనమని షర్మిల తెలిపారు.