పార్టీ మీటింగ్‌లోనూ అదే గోల.. మా బాబు మారడంటున్న టీడీపీ లీడర్లు
ఏ నియోజకవర్గంలో బలాబాలలు ఏంటో, అక్కడ ప్రత్యర్థిని ఎలా ఓడించాలో, మనం ఎలా ముందుకెళ్లాలో చెబితే బాగుంటుంది కానీ ఈ సెల్ఫ్ డబ్బాలు, వైసీపీని తిట్టడానికి పార్టీ మీటింగ్‌ల్లో కూడా ఎందుకు టైమ్ వేస్ట్ చేస్తున్నారనేది వారి ఆవేదన.
చంద్రబాబు స్టైలే అంత. పార్టీ మీటింగయినా, ప్రజల మధ్యలో బహిరంగ సభ అయినా.. అదే సెల్ఫ్ డబ్బా. నేను అది చేశాను.. ఇది చేశాను అంటూ ఒకటే చెబుతుంటాడు.. ఈ మాటలు అంటున్నది ప్రతిపక్షాలు కాదు. రాజకీయ విశ్లేషకులు అంతకన్నా కాదు. వాళ్ల పార్టీ లీడర్లే. శనివారం కాకినాడలో నిర్వహించిన ఉమ్మడి గోదావరి జిల్లాల నియోజకవర్గ ఇన్‌ఛార్జులు, నాయకుల సమీక్షలోనూ అదే బాణీ.
నేనే అభివృద్ధి చేశాను
ఏకంగా 34 నియోజవకర్గాల బాధ్యులతో మీటింగ్.. అదీ రాష్ట్ర రాజకీయాల్లో గాలిని మార్చగలిగిన ఉమ్మడి గోదావరి జిల్లాల సమీక్ష. అక్కడికి వచ్చిన ఇన్‌ఛార్జులు, పార్టీ టికెట్ ఆశావహులు అధినేత చంద్రబాబు ఏం చెప్తారో అని చాలా ఆసక్తిగా వినడానికి సిద్ధమయ్యారు. కానీ చంద్రబాబు ప్రసంగం ప్రారంభమవడం ఆత్మస్తుతి.. పరనింద కాన్సెప్ట్‌లో సాగిపోయింది. జగన్ ఓడిపోవడం, జైలుకు పోవడమూ ఖాయమన్న చంద్రబాబు వైసీపీ ప్రభుత్వాన్ని, జగన్‌ను తిట్టిపోశారు. తాను ఏం అభివృద్ధి చేశానో చెప్పుకొచ్చారు.
ప్రజలకు చెబితే చాలు కదా.. మనకెందుకు?
ఇదంతా బహిరంగ సభల్లో, రోడ్ షోల్లో ప్రజలకు చెబితే చాలు కదా అని టీడీపీ నేతలు అనుకుంటున్నారు. ఇవన్నీ పార్టీలో అందరికీ తెలిసినవే కదా. ఆరేడు నెలల్లో ఎన్నికలు పెట్టుకుని ఎలక్షన్ స్ట్రాటజీ గురించి మాట్లాడకుండా ఇవన్నీ మనకెందుకు చెబుతారో ఈయన అని చెవులు కొరుక్కుంటున్నారు. ఏ నియోజకవర్గంలో బలాబాలలు ఏంటో, అక్కడ ప్రత్యర్థిని ఎలా ఓడించాలో, మనం ఎలా ముందుకెళ్లాలో చెబితే బాగుంటుంది కానీ ఈ సెల్ఫ్ డబ్బాలు, వైసీపీని తిట్టడానికి పార్టీ మీటింగ్‌ల్లో కూడా ఎందుకు టైమ్ వేస్ట్ చేస్తున్నారనేది వారి ఆవేదన.
పోనీ కొత్త కార్యక్రమం గురించి అయినా చెప్పొచ్చు కదా!
బాబు ష్యూరిటీ- భవిష్యత్తుకు గ్యారంటీ పేరుతో చంద్రబాబు ఓ కొత్త కార్యక్రమాన్ని ప్రారంభించారు. టీడీపీ అధికారంలోకి వస్తే ఏ సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తారో చంద్రబాబు సంతకంతోపాటు ఆ బూత్ కన్వీనర్ సంతకం కూడా పెట్టి ఓటర్లకు బాండ్ పేపర్లు ఇస్తారట. ఈ ప్రోగ్రాం విశ్వసనీయత ఎంతనేది పక్కనపెడితే ఏదో కొత్త కార్యక్రమం మొదలుపెట్టినప్పుడు పార్టీ నాయకులకు దాని గురించి వివరించాలి కదా.. అది వదిలేసి పాత సోదంతా ఎందుకు చెబుతాడో మా బాబు గారు అంటూ పార్టీ నేతలు గొణుక్కుంటున్నారు.
♦