ఆర్థిక, ఆధునిక రాజధానిగా విశాఖ.. బాబు కొత్త ట్విస్ట్
తప్పు చేసిన వారిని క్షమిస్తే అలవాటుగా మారుతుందని, తప్పు చేసిన వారికి చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఉందని అన్నారు చంద్రబాబు. విధ్వంస, కక్షపూరిత రాజకీయాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు.
ఏపీకి అమరావతే ఏకైక రాజధాని అని చెబుతూనే.. విశాఖను ఆర్థిక, ఆధునిక రాజధానిగా చేసుకుందామని పిలుపునిచ్చారు చంద్రబాబు. ఎన్డీఏ శాసన సభాపక్ష నేతగా తనని ఎన్నుకున్న సందర్భంగా జరిగిన సమావేశంలో చంద్రబాబు కీలక వ్యాఖ్యలు చేశారు. 14 ఏళ్లుగా సీఎంగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నానని, ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలుచుకుని ముందుకెళ్లానని చెప్పారు. ఏపీలో ప్రస్తుతం చాలా సమస్యలు ఉన్నాయని, రాష్ట్రం పూర్తిగా శిథిలమైందని, సంక్షోభంలో ఉందని, అన్ని వర్గాలు నష్టపోయాయని అన్నారు. పదేళ్ల తర్వాత కూడా రాజధాని ఏదంటే చెప్పుకోలేని పరిస్థితి ఉందన్నారు చంద్రబాబు. కక్షపూరిత రాజకీయాలు కాకుండా నిర్మాణాత్మకంగా ముందుకు వెళ్లాలని చెప్పారు.
సమిష్టిగా ప్రజల రుణం తీర్చుకునే సమయం ఆసన్నమైంది. 14 ఏళ్లు సీఎంగా, 15 ఏళ్లు ప్రతిపక్ష నేతగా ఉన్నా. ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలచుకుని ముందుకెళ్లాం. రాష్ట్రంలో చాలా సమస్యలున్నాయి. పేదల జీవితం మార్చేందుకు అందరూ కష్టపడదాం.#KutamiTsunami #NaraChandrababuNaidu #AndhraPradesh pic.twitter.com/7TdAxkP4yI
— Telugu Desam Party (@JaiTDP) June 11, 2024
రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి ప్రజలు చొరవ చూపారని, వారు ఇచ్చిన తీర్పుని నిలబెట్టుకోవాల్సిన బాధ్యత మనపై ఉందని నేతలకు సూచించారు చంద్రబాబు. మూడు పార్టీల నేతలు, కార్యకర్తలు సమష్టిగా పనిచేస్తేనే ఈ విజయం దక్కిందని, ఎన్నికల్లో 93 శాతం సీట్లు గెలవడం దేశ చరిత్రలో అరుదైన ఘట్టం అని అన్నారు. 57 శాతం ఓట్లతో ప్రజలు కూటమిని ఆశీర్వదించారన్నారు. ఇలాంటి తీర్పు వల్లే ఢిల్లీలో అందరూ కూటమి నేతల్ని గౌరవించారని, ప్రజల తీర్పుతో రాష్ట్ర ప్రతిష్ట పెరిగిందని అన్నారు చంద్రబాబు. పవన్ కల్యాణ్ సమయస్ఫూర్తిని ఎప్పటికీ మరచిపోలేనంటూ ఆయన్ను ఆకాశానికెత్తేశారు బాబు. తాను జైలులో ఉన్నప్పుడు ఆయన వచ్చి పరామర్శించారని, అప్పుడే పొత్తు ప్రస్తావన వచ్చిందని అన్నారు. రాష్ట్ర ప్రయోజనాలకోసమే, ఎలాంటి పొరపొచ్చాలు లేకుండా కలిసి పనిచేశామన్నారు బాబు.
క్షమించడం కుదరదు..
తప్పు చేసిన వారిని క్షమిస్తే అలవాటుగా మారుతుందని, తప్పు చేసిన వారికి చట్టపరంగా శిక్ష పడాల్సిన అవసరం ఉందని అన్నారు చంద్రబాబు. విధ్వంస, కక్షపూరిత రాజకీయాలను ప్రక్షాళన చేయాల్సిన అవసరం ఉందన్నారు. ఆనాడు అసెంబ్లీని గౌరవ సభ కాదు, కౌరవ సభ అని చెప్పి బయటకు వచ్చానని, ప్రజాక్షేత్రంలో గెలిచి గౌరవ సభగా చేసి తిరిగి సభలో అడుగుపెట్టబోతున్నట్టు తెలిపారు. పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేస్తామని, నదులను అనుసంధానించి ప్రతి ఎకరానికి నీళ్లందిస్తామని చెప్పారు చంద్రబాబు.