ఎగ్జిట్ పోల్స్ రోజే అధికారులకు చంద్రబాబు సూచనలు
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతోనే చంద్రబాబు రెచ్చిపోతున్నారని, తొందరపడి అతిగా ఊహించేసుకుంటున్నారని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.
ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు వేరు, అసలు ఫలితాలు వేరు. కానీ ఏపీలో మాత్రం ఎగ్జిట్ పోల్స్ ఎక్కడలేని ఆసక్తిని కలిగిస్తున్నాయి. అన్ని సర్వేలు ఒకేలా ఉండవు కాబట్టి, ఎవరికి కావాల్సిన సారాంశాన్ని వారు తీసుకుంటున్నారు. ఎవరి అనుకూల సర్వేలను వారు ప్రచారం చేసుకుంటున్నారు. ఇక చంద్రబాబు అయితే ఏకంగా అధికారులకు సలహాలు, సూచనలు ఇవ్వడం మొదలు పెట్టారు.
ఏపీలో ఎన్నికల తర్వాత అధికారం తమదేనంటూ ధీమాగా ఉన్న చంద్రబాబు, అధికారులకు సూచనలు, సలహాలు ఇస్తున్నారు. విజయవాడలో ఇటీవల డయేరియా మరణాల సంఖ్య పెరగడంపై ఆయన స్పందించారు. వారం రోజుల వ్యవధిలో 9 మంది చనిపోయారని ఆవేదన వ్యక్తం చేశారు బాబు. ప్రభుత్వ యంత్రాంగం వెంటనే సమస్యపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. తాగునీరు కలుషితం కావవడం, ఆ నీటినే అధికారులు పంపిణీ చేయడంతో ప్రజల ప్రాణాలు పోయే పరిస్థితి వచ్చిందన్నారు. అధికారులు ఈ మరణాలకు తప్పుడు కారణాలు చెబుతున్నారని అన్నారు చంద్రబాబు. డయేరియాతో కాకుండా ఇతర అనారోగ్య కారణాలతో వీరంతా చనిపోయారని అధికారులు చెప్పడం సరికాదన్నారు. కలుషిత నీటి గురించి వస్తున్న ఫిర్యాదులపై అధికారులు స్పందించాలని కోరారు.
చంద్రబాబు సూచనలను ఎవరూ కాదనలేరు కానీ, ఫలితాలకు ముందే తనను తాను సీఎంలా ఊహించేసుకుని ఆయన అధికారులకు వార్నింగ్ ఇవ్వడం మాత్రం సంచలనంగా మారింది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలతోనే చంద్రబాబు రెచ్చిపోతున్నారని, తొందరపడి అతిగా ఊహించేసుకుంటున్నారని కామెంట్ చేస్తున్నారు నెటిజన్లు.