టిడిపిలో గుడివాడ గుబులు..డైలమాలో చంద్రబాబు!
గుడివాడలో కొడాలి నానిని ఓడించేందుకు గతంలో కాంగ్రెస్, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలు ఎంతో కష్టపడినా ప్రయోజనం లేకపోయింది. ఇటీవల కాలంలో నానిని ఓడించాలనే పట్టుదల తెలుగుదేశం పార్టీలో బాగా నాటుకుపోయింది. కానీ కొడాలిని ధీటుగా ఎదుర్కొని విజయం సాధించగల అభ్యర్ధుల విషయంలో టిడిపి అధినేత ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు.
ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటినుంచీ ఆంధ్రప్రదేశ్ లో ఎప్పుడు ఎన్నికలు జరిగినా ఆసక్తి రేపే నియోజకవర్గాల్లో గుడివాడ ఒకటి. తాజా రాజకీయ పరిణామాల్లో మరింత ఆసక్తి, ఉత్కంఠ పెరిగింది. అందుకు కారణం అక్కడ వైసీపి తరపున కొడాలి నాని అభ్యర్ధిగా ఉండడమే. ఆయన్ను ఓడించేందుకు గతంలో కాంగ్రెస్, ఆ తర్వాత తెలుగుదేశం పార్టీలు ఎంతో కష్టపడినా ప్రయోజనం లేకపోయింది. ఇటీవల కాలంలో నానిని ఓడించాలనే పట్టుదల తెలుగుదేశం పార్టీలో బాగా నాటుకుపోయింది. కానీ కొడాలిని ధీటుగా ఎదుర్కొని విజయం సాధించగల అభ్యర్ధుల విషయంలో టిడిపి అధినేత ఒక నిర్ణయానికి రాలేకపోతున్నారు.
ఇప్పటివరకూ అక్కడ ఇన్ చార్జిగా పని చేస్తున్న రావి వెంకటేశ్వరరావు కార్యకర్తలతో సన్నిహితంగా ఉంటూ పార్టీని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్ళేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఇక్కడి నుంచి ఆయన తనకే టికెట్ లభిస్తుందనే ఆశతో కూడా ఉన్నారు. ఇదే విషయాన్ని ప్రజల్లో చెబుతూ వారి మద్దతు కోరుతున్నారు. అయితే రావి ఎంత మేరకు కొడాలిని ఎదుర్కొని విజయం సాధించగలరనే సందేహాలు అధిష్టానాన్ని వేధిస్తున్నాయి. ఈ పరిస్థితి ఇలా ఉంటే కొత్తగా మరో టెన్షన్ ఎదురవుతోంది.
టిడిపికి ఆర్ధికంగా వెన్నుదన్నుగా ఉంటూ పార్టీ విజయానికి ఎన్నారైలు కృషి చేస్తుంటారు. కొడాలి నానిని ఓడించేందుకు వారు టిడిపి అభ్యర్ధి విజయానికి సహకరిస్తూ ఉండేవారు. అయితే ఈ సారి ఈ ప్రాంత మూలాలు ఉన్న ఎన్నారై వెనిగండ్ల రాము తానే ప్రత్యక్షంగా ఎన్నికల్లో పాల్గొనాలని భావిస్తున్నారని తెలుస్తోంది. ఇప్పటికే ఆయన తన అభిప్రాయాన్ని అధినేత చంద్రబాబుకు తెలియజేశారు.
సామాజిక సమీకరణలతో పాటు ఆర్ధిక అంగబలాలు ఉండడం తనకు బాగా కలిసి వస్తుందని వివరించారుట. అంతేగాక ఆయన భార్య ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన వారవడంతో ఆ వర్గ సమీకరణలు కూడా తనకు అదనపు బలం కాగలవని అధినేతను ఒప్పించి టికెట్టు తెచ్చుకోవాలని రాము ప్రయత్నిస్తున్నారు. దీంతో ఇప్పటివరకూ టికెట్ ఆశిస్తున్న రావి వెంకటేశ్వరరావు మటుకు తనకే టికెట్టు వస్తుందని పదే పదే చెప్పుకోవాల్సి వస్తోంది.
కొడాలి నానిని ఎదిరించి గెలవడం అంత ఈజీ కాదనే విషయం ఇప్పటికే అర్ధమయిన చంద్రబాబు ఈ సారి సర్వ శక్తులూ ఒడ్డయినా అతనిని ఓడించేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు. అందుకు అభ్యర్ధి ఎంపిక పై ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇప్పటివరకూ రాముకు కానీ రావి కి కానీ ఎటువంటి హామీ ఇవ్వకుండా పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నారు. ఎన్నికలు సమీపించేనాటికి అప్పటి పరిస్థితులను బట్టి టికెట్టు కేటాయించే అవకాశం ఉందంటున్నారు. ఒకవేళ రావికి టికెట్ కేటాయిస్తే సామాజిక సమీకరణలు, అర్ధబలాలు తగ్గిపోతాయా..అనే సందేహం కూడా వేధిస్తున్నది. అలాగని రాముకు టికెట్ ఇస్తే రావి వర్గం సహకరిస్తుందా అనే అనుమానాలు కూడా వెంటాడుతున్నాయిట. మొత్తం మీద గుడివాడలో నానికి ధీటైన అభ్యర్ధిని ఎంపిక చేయడం చంద్రబాబుకు కత్తిమీద సాములా మారిందంటున్నారు.