ఇల్లు మీది.. స్టిక్కర్ ఆయనది.. ఏంటీ అరాచకం..?
టీడీపీ కార్యకర్తల్ని ఎవరైనా బెదిరిస్తే తోకలు కట్ చేస్తా అని అన్నారు చంద్రబాబు. రౌడీయిజాన్ని తుంగలో తొక్కేస్తామన్నారు. ఎక్కడ రౌడీలున్నా వారి గుండెల్లో టీడీపీ నిద్రపోతుందన్నారు.

"ఇల్లు మీది, స్టిక్కర్ సైకోదా.." అంటూ సీఎం జగన్ పై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు చంద్రబాబు. మీ ఇంటిపై ఆయన పెత్తనమేంటి అని ప్రజల్ని ప్రశ్నించారు. ఏ పార్టీ అయినా, వ్యక్తి అయినా.. వేరేవారి ఇంటిపై స్టిక్కర్లు, పోస్టర్లు అంటించాలంటే ముందు వారి అనుమతి తీసుకోవాలని, ఈ విషయం శేషన్ ఎప్పుడో చెప్పారని గుర్తు చేశారు. ప్రజల ఇంటికి సీఎం జగన్ స్టిక్కర్లు అంటించడం అనైతికం, చట్ట వ్యతిరేకం అన్నారు. వాలంటీర్లకు ఇస్తున్నది ప్రజాధనమా లేక జగన్ తాత, ముత్తాతల సొమ్మా? అని ప్రశ్నించారు.
క్యాన్సర్ గడ్డ..
ఇటీవల నెల్లూరు మీటింగ్ లో సీఎం జగన్ ను క్యాన్సర్ గడ్డ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేసిన చంద్రబాబు.. కృష్ణాజిల్లా పర్యటనలో కూడా అదే మాట రిపీట్ చేశారు. ఏపీలో సైకో పాలనకు ప్రజలు చరమగీతం పాడకపోతే రాష్ట్రానికి తీవ్ర నష్టం జరుగుతుందన్నారు. విజయవాడ తూర్పు, పెనమలూరు, పామర్రు నియోజకవర్గాల మీదుగా రోడ్ షో నిర్వహించిన చంద్రబాబు, జగన్ పాలనపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. జగన్ సమాజానికి క్యాన్సర్ లాంటివారని, జగన్ మీ బిడ్డ కాదు.. క్యాన్సర్ గడ్డ.. అని అన్నారు. క్యాన్సర్ గడ్డను తొలగించుకోకపోతే శరీరమంతా వ్యాపిస్తుందని హెచ్చరించారు.
ఇచ్చేది పది.. గుంజేది వంద..
మంచి పనిచేస్తే జనం ఓట్లు వేస్తారని, చెడ్డపని చేస్తే చిత్తుచిత్తుగా ఓడిస్తారన్నారు. నాలుగేళ్లలో జగన్ ఏం మంచి పనిచేశారని ఆయనకు ప్రజలు ఓట్లు వేస్తారని ప్రశ్నించారు. నిత్యావసర ధరలు పెరిగాయని, కరెంటు ఛార్జీలు పెంచారని, సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఇచ్చేది పది, గుంజేది వంద అని మండిపడ్డారు. జగనే రాష్ట్రానికి దరిద్రం అని.. బయటి రాష్ట్రాల ప్రజలు ఏపీ పరిస్థితి చూసి జాలి పడుతున్నారన్నారు. జగన్ ను ఓడిస్తేనే రాష్ట్రానికి భవిష్యత్తు అని చెప్పారు.
తోకలు కత్తిరిస్తా..
ప్రజాస్వామ్యాన్ని, ప్రజాజీవితాన్ని తమాషా అనుకోవద్దని, టీడీపీ కార్యకర్తల్ని ఎవరైనా బెదిరిస్తే తోకలు కట్ చేస్తా అని అన్నారు చంద్రబాబు. రౌడీయిజాన్ని తుంగలో తొక్కేస్తామన్నారు. ఎక్కడ రౌడీలున్నా వారి గుండెల్లో టీడీపీ నిద్రపోతుందన్నారు. రౌతు కొద్దీ గుర్రంలా పోలీసుల వైఖరి ఉందని మండిపడ్డారు.