చంద్రబాబుకి అన్ని సమస్యలున్నాయా..? ఎల్లో మీడియా హెల్త్ రిపోర్ట్
దద్దుర్లు తగ్గలేదని, అవి నడుము కింది వరకు వ్యాపించాయని, వెన్ను కింది భాగంలో నొప్పి తదితర సమస్యలతో బాధపడుతున్నారని ప్రభుత్వ వైద్యుల నివేదికలో ఉన్నట్టు ఎల్లో మీడియా చెబుతోంది.
చంద్రబాబు ఆరోగ్య సమస్యలపై ఇప్పటి వరకూ టీడీపీ నేతల ఆరోపణలే ప్రముఖంగా వినిపిస్తున్నాయి. అటు ప్రభుత్వ వైద్యులు ఇచ్చే నివేదికలు, డైలీ హెల్త్ రిపోర్ట్ లు మాత్రం ఆయన ఆరోగ్యానికి ఢోకా లేదని చెబుతున్నాయి. ఈ దశలో కొత్తగా ఎల్లో మీడియా ఓ రిపోర్ట్ బయటపెడ్డింది. అదే నిజమైతే.. ఆయన తీవ్ర అనారోగ్యంతో ఉన్నట్టే లెక్క. అయితే ఎల్లో మీడియా కూడా ప్రభుత్వ వైద్యుల నివేదిక అంటూ కొన్ని విషయాలు బయటపెట్టింది.
చంద్రబాబుకి ఏమైంది..?
వేడి వాతావరణం, ఉక్కపోత వల్ల చంద్రబాబుకి చర్మంపై దద్దుర్లు వచ్చిన సంగతి తెలిసిందే. ఆ తర్వాతే ఆయనకు కోర్టు సూచన ద్వారా జైలులో ఏపీ సౌకర్యం కల్పించారు. అయితే ఆ దద్దుర్లు తగ్గలేదని, అవి నడుము కింది వరకు వ్యాపించాయని, వెన్ను కింది భాగంలో నొప్పి తదితర సమస్యలతో బాధపడుతున్నారని ప్రభుత్వ వైద్యుల నివేదికలో ఉన్నట్టు ఎల్లో మీడియా చెబుతోంది. ఆయనకు కంప్లీట్ బ్లడ్ పిక్చర్, రీనల్ ఫంక్షన్ టెస్ట్ లు, లివర్ ఫంక్షన్ టెస్ట్ ల వంటివి చేయాలని.. వైద్యులు సూచించినట్టు ఆ కథనం సారాంశం. దీనికి సంబంధించి చంద్రబాబుకి కూడా వైద్యులు పలు సూచనలు చేశారంటున్నారు.
కంటి సమస్యలేంటి..?
చంద్రబాబుకి యాంగిల్ క్లోజర్ గ్లకోమా అనే సమస్య ఉందని అంటున్నారు టీడీపీ నేతలు. శుక్లాలకోసం ఎడమకంటికి ఇప్పటికే చికిత్స జరిగింది. ఇప్పుడు కుడి కంటికి కూడా శుక్లం ఆపరేషన్ చేయాలని అంటున్నారు. అది కూడా ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్ స్టిట్యూట్ లోనే చేయాలంటున్నారు. ఇప్పటి వరకూ దోమలు కుట్టడం, స్నానానికి వేడినీళ్లు లేకపోవడం, దద్దుర్లు.. వంటి చిన్న చిన్న సమస్యలనే చెబుతూ వచ్చారు.
ఇప్పుడు మరిన్ని సమస్యలుచుట్టుముట్టాయంటున్నారు. ఎలాగైనా చంద్రబాబుని బయటకు తేవాలనే ఆతృత టీడీపీ నేతల్లోనూ, ఎల్లోమీడియాలోనూ స్పష్టంగా కనపడుతోంది. ఇన్ని సమస్యల్లో కూడా చంద్రబాబు ప్రజలకు సుదీర్ఘ లేఖ రాయడం ఆశ్చర్యంగా ఉందంటున్నారు వైసీపీ నేతలు.