Telugu Global
Andhra Pradesh

కడప జిల్లాపై ప్రత్యేక దృష్టిపెట్టారా?

పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని టీడీపీ గెలిచిన‌ప్ప‌టినుండి కడపపైన చంద్ర‌బాబు ప్రత్యేక దృష్టిపెట్టారు. వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఉన్న వివాదాలను అడ్వాంటేజ్‌గా తీసుకుని రాబోయే ఎన్నికల్లో మెజారిటీ స్థానాలను గెలవాలని అనుకుంటున్నారు.

కడప జిల్లాపై ప్రత్యేక దృష్టిపెట్టారా?
X

కడప జిల్లాపై ప్రత్యేక దృష్టిపెట్టారా?

రాబోయే ఎన్నికల్లో మంచి ఫలితాలు సాధించాలని చంద్రబాబు నాయుడు కడప జిల్లాపై ఎక్కువ దృష్టి పెట్టినట్లున్నారు. మంగళవారం కడపలో సమావేశం పెట్టుకున్నారు. పార్టీపరంగా నియోజకవర్గాలను జోన్లుగా విడదీశారు. కడప, కర్నూలు, అనంతపురం జిల్లాలను జోన్-5 గా ఏర్పాటు చేశారు. ఈరోజు సమావేశంలో పై జిల్లాలకు చెందిన నియోజకవర్గస్థాయి నేతలతో పాటు మండలాధ్యక్షులు కూడా హాజరవబోతున్నారు. కడప దర్గాను సందర్శించి ఇఫ్తార్ విందులో పాల్గొంటారు. తర్వాత నేతలతో సమావేశమవుతారు.

రాత్రికి బద్వేలులో బసచేసి బుధవారం ప్రకాశం జిల్లా పర్యటనకు వెళతారు. ఇక్కడ విషయం ఏమిటంటే జిల్లాలో ఇప్పుడు 10 నియోజకవర్గాలకు 10 వైసీపీ ఖాతాలోనే ఉన్నాయి. టీడీపీ ఏర్పాటైన దగ్గర నుండి మెజారిటీ సీట్లను ఎప్పుడూ గెలుచుకోలేదు. చివరి రెండు ఎన్నికల్లో అయితే పార్టీ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది. అందుకనే కడప జిల్లాపై చంద్రబాబు ప్రత్యేక దృష్టిపెట్టారు. కనీసం సగం నియోజకవర్గాల్లో అయినా గెలవాలని పట్టుదలగా ఉన్నారు. అయితే అందుకు పరిస్థితులు సహకరించటంలేదు.

ఈ నేపథ్యంలోనే ఈ మధ్యనే జరిగిన పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాన్ని టీడీపీ గెలుచుకుంది. ఈ స్థానం ప‌రిధిలో కడప, అనతపురం, కర్నూలు జిల్లాలున్నాయి. గెలిచిన అభ్యర్థి పులివెందుల నియోజకవర్గం సింహాద్రిపురం మండలం నేత భూమిరెడ్డి రాజగోపాలరెడ్డి. దాంతో చంద్రబాబులో ఒక్కసారిగా కొత్త ఉత్సాహం మొదలైపోయింది. కడప జిల్లా అందులోనూ పులివెందుల నేత ఎమ్మెల్సీ స్థానంలో గెలిచారంటే ఇక పులివెందులలో జగన్మోహన్ రెడ్డిని ఓడించటం పెద్ద కష్టంకాదని చంద్రబాబు అనుకుంటున్నారు.

అందుకనే ఎమ్మెల్సీ ఫలితాలు వచ్చినప్పటినుండి కడప పైన ప్రత్యేక దృష్టిపెట్టారు. వైసీపీ ఎమ్మెల్యేల మధ్య ఉన్న వివాదాలను అడ్వాంటేజ్‌గా తీసుకుని మెజారిటీ స్థానాలను గెలవాలన్నది చంద్రబాబు ఆలోచన. ఇప్పటికే పులివెందుల అభ్యర్థిగా బీటెక్ రవిని ప్రకటించారు. మిగిలిన తొమ్మిది నియోజకవర్గాలతో పాటు కడప ఎంపీ అభ్యర్థిని కూడా ప్రకటించాలని నేతలు కోరుతున్నారు. చంద్రబాబు కూడా అందుకు సానుకూలంగానే ఉన్నారు. ప్రభుత్వంపై వ్యతిరేకత, వైసీపీలో గొడవల కారణంగా రాబోయే ఎన్నికల్లో టీడీపీకి మంచి ఫలితాలే వస్తాయని చంద్రబాబు అనుకుంటున్నారు. అందుకనే కడపపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌పెట్టారు.

First Published:  18 April 2023 7:21 AM GMT
Next Story