Telugu Global
Andhra Pradesh

అభ్య‌ర్థుల‌ను మార్చిన‌చోట‌.. టీడీపీలో అస‌మ్మ‌తి మంట‌లు

మడకశిర నుంచి సునీల్‌కుమార్‌కు ఇంత‌కు ముందు టికెట్ కేటాయించారు. తాజాగా ఆయ‌న్ను కాద‌ని ఎంఎస్ రాజుకు ఆ టికెట్ ఇచ్చారు. దీంతో సునీల్ వ‌ర్గం మండిపడుతోంది.

అభ్య‌ర్థుల‌ను మార్చిన‌చోట‌.. టీడీపీలో అస‌మ్మ‌తి మంట‌లు
X

టీడీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్య‌ర్థులంద‌రికీ నిన్న త‌న ఇంట్లో బీఫాంలు ఇచ్చిన చంద్ర‌బాబు చివ‌ర్లో ఓ ఐదు నియోజ‌క‌వ‌ర్గాల అభ్య‌ర్థుల‌ను మార్చేశారు. దీంతో ఇప్ప‌టి వ‌ర‌కు సీటు క‌న్ఫ‌ర్మ్ అనుకున్న నేత‌ల‌కు మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఉండి, పాడేరు, మాడుగుల, వెంకటగిరి, మడకశిర అసెంబ్లీ స్థానాల్లో అభ్య‌ర్థుల మార్పులు జరిగాయి. ఇక్క‌డ దాదాపు నెల్లాళ్లుగా తామే అభ్య‌ర్థుల‌మ‌నుకుని డ‌బ్బులు ఖ‌ర్చు పెట్టుకుని ప్ర‌చారం చేసుకుంటున్న వారు చంద్ర‌బాబు తీసుకున్న ఈ నిర్ణ‌యంతో షాక్ తిన్నారు. ఇక వారి అనుచ‌రులైతే కొత్త అభ్య‌ర్థుల మీద అస‌మ్మ‌తి కుంప‌టి రాజేస్తున్నారు.

రామ‌రాజు నోరు విప్ప‌ట్లేదుగా!

ఉండి అభ్యర్థిగా ఎంపీ రఘురామకృష్ణరాజుకు అవకాశం దక్కింది. ఇక్క‌డ నుంచి ఇప్పటికే టికెట్ ద‌క్కించుకున్న ఎమ్మెల్యే రామ‌రాజును త‌ప్పించి, నరసాపురం పార్లమెంట్ టీడీపీ అధ్యక్షుడిగా నియమించారు. రామ‌రాజు, తాను రామ‌ల‌క్ష్మ‌ణుల్లాంటివార‌మ‌ని.. క‌లిసే నామినేష‌న‌కు వెళ‌తామ‌ని, క‌లిసి ప్ర‌చారం చేస్తామ‌ని ర‌ఘురామ చెప్పుకొచ్చారు. కానీ సీటు మార్పుపై రామ‌రాజు ఇప్ప‌టికీ ఎక్క‌డా నోరువిప్ప‌లేదు.

బండారుకు వ్య‌తిరేకంగా 18 గ్రామాల టీడీపీ శ్రేణులు

పెందుర్తి స్థానం జనసేనకు కేటాయించడంతో అక్కడ మాజీ మంత్రి బండారు సత్యనారాయణమూర్తికి అవకాశం లభించలేదు. దీంతో ఆయ‌న‌కు మాడుగుల టికెట్ ఇచ్చారు. ఇక్క‌డ ఇప్ప‌టికే టికెట్ కేటాయించ‌డంతో ప్ర‌చారం చేసుకుంటున్న పైలా ప్ర‌సాద్ గొంతు కోశారని, ఆయ‌న్నే అభ్య‌ర్థిగా కొన‌సాగించాలంటూ 18 గ్రామాల టీడీపీ క్యాడ‌ర్ ముక్త‌కంఠంతో నిన‌దిస్తోంది. బండారు నామినేష‌న్‌కు కూడా వెళ్ల‌కూడ‌ద‌ని తీర్మానించింది.

సునీల్.. రెబల్‌

మడకశిర నుంచి సునీల్‌కుమార్‌కు ఇంత‌కు ముందు టికెట్ కేటాయించారు. తాజాగా ఆయ‌న్ను కాద‌ని ఎంఎస్ రాజుకు ఆ టికెట్ ఇచ్చారు. దీంతో సునీల్ వ‌ర్గం మండిపడుతోంది. చంద్ర‌బాబు, లోకేష్‌ల ఫ్లెక్సీలు త‌గ‌ల‌బెట్టిన ఆయ‌న వ‌ర్గీయులు చంద్ర‌బాబు ద‌ళిత‌ద్రోహి అంటూ నిన‌దించారు. కాగా రెబ‌ల్‌గా పోటీలో ఉండాల‌ని సునీల్ నిర్ణ‌యించుకున్న‌ట్లు, స్వతంత్ర అభ్య‌ర్థిగా నామినేష‌న్ వేయనున్న‌ట్లు స‌మాచారం.

First Published:  22 April 2024 6:30 AM GMT
Next Story