Telugu Global
Andhra Pradesh

బాబు చేసిన తప్పు జగన్ చేస్తున్నారా..? పీపుల్స్ సర్వేలో వాస్తవం ఎంత..?

అధికార పార్టీ నేతలు ఇంటికి వస్తే, వారి ముందు సమస్యలు ఏకరువు పెడితే, పొరపాటున ప్రభుత్వాన్ని తిడితే.. ఏమవుతుందో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా నేరుగా తప్పుల్ని ఎత్తి చూపించలేరు,

బాబు చేసిన తప్పు జగన్ చేస్తున్నారా..? పీపుల్స్ సర్వేలో వాస్తవం ఎంత..?
X

2014 ఎన్నికల్లో గెలిచి ప్రభుత్వం ఏర్పాటు చేసిన టీడీపీ.. 2019లో పూర్తిగా బోల్తా పడింది. 2019 ఎన్నికలకు ముందు చంద్రబాబు ధీమా, ఆయన అనుకూల మీడియా హడావిడి చూస్తే మరోసారి టీడీపీయే అధికారంలోకి వస్తుందని అనుకున్నారంతా. దానికితోడు చంద్రబాబు హ్యాపీనెస్ పేరుతో సర్వే చేయించుకున్నారు. ప్రభుత్వ అధికారులతో సర్వే చేయించారు. రాష్ట్రంలో అన్ని కుటుంబాలు సంతోషంగా ఉన్నాయంటూ ప్రచారం చేశారు. కానీ చివరకు తేడా కొట్టింది. టీడీపీ ప్రభుత్వంలో అన్ని కుటుంబాలు సంతోషంగా ఉంటే వారి సీట్లు 23కి ఎందుకు పరిమితం అవుతాయి..?

ఇప్పుడు వైసీపీ వంతు..

వైసీపీ పాలన ఎలా ఉంది అంటే.. కచ్చితంగా బావుందనే చెబుతారు ఆ పార్టీ నేతలు, కార్యకర్తలు, అనుకూల మీడియా. అస్సలు బాలేదంటూ టీడీపీ అనుకూల మీడియా వ్యతిరేక కథనాలిస్తుంది. వీటిలో ఏది నమ్మాలి..? ఎవరి డప్పు వారు కొట్టుకోవడం మంచిదే, కానీ అది వారినే ముంచే రేంజ్ లో ఉంటే మాత్రం ఇబ్బంది ఎదురవుతుంది. గతంలో హ్యాపీనెస్ సర్వే అంటూ చంద్రబాబు చేసిన తప్పు అదే. ఇప్పుడు మెగా పీపుల్స్ సర్వే అంటూ జగన్ చేస్తున్నది కూడా అదే.

మెగా పీపుల్స్ సర్వేలో ఏపీలోని 1.16 కోట్ల కుటుంబాలు వైసీపీ ప్రభుత్వానికి ధన్వవాదాలు తెలుపుతూ మిస్డ్ కాల్ ఇచ్చాయని అంటున్నారు. తమ ప్రభుత్వానికి అండగా నిలబడిన ప్రజలకు సీఎం జగన్ కృతజ్ఞతలు తెలిపారు. మరింత సేవ చేస్తానంటూ ప్రజలకు హామీ ఇచ్చారు.


జగనన్నే మా భవిష్యత్తు అంటూ వైసీపీ నేతలు ఇంటింటికీ వెళ్లి సర్వే చేపట్టారు. స్టిక్కర్లు అంటించారు, ప్రజల సెల్ ఫోన్లనుంచి ప్రభుత్వ నెంబర్ కి మిస్డ్ కాల్ ఇప్పించారు. అక్కడితో ఆ తంతు ముగిసింది, ఆ కుటుంబం ఓటు వైసీపీకేనని పార్టీ నిర్థారించుకుంది. ఈ నిర్థారణకు ప్రాతిపదిక ఏది అనేదే ఇప్పుడు తేలాల్సిన విషయం. అధికార పార్టీ నేతలు ఇంటికి వస్తే, వారి ముందు సమస్యలు ఏకరువు పెడితే, పొరపాటున ప్రభుత్వాన్ని తిడితే.. ఏమవుతుందో రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికీ తెలుసు. అలాంటి పరిస్థితుల్లో ఎవరైనా నేరుగా తప్పుల్ని ఎత్తి చూపించలేరు, అది తప్పు అని చెప్పలేరు. అందుకే అందరూ మూకుమ్మడిగా ప్రభుత్వం ఇచ్చిన నెంబర్ కి ఫోన్ చేసి ఫస్ట్ మార్క్ వేసేశారు. కానీ అందులో నిజమెంతో పార్టీ తెలుసుకోవాలి. వాస్తవాల్ని గ్రహించాలి. లేకపోతే అప్పుడు చంద్రబాబుకి ఎంత హ్యాపీనెస్ వచ్చిందో, ఇప్పుడు జగన్ కి కూడా అలాంటి హ్యాపీనెస్ దక్కే ప్రమాదముంది.

First Published:  30 April 2023 2:55 PM IST
Next Story