చంద్రబాబుకు ఊహించని షాకేనా ?
జగన్ కు వ్యతిరేకంగా పార్టీ నేతలు, శ్రేణులతో పాటు మామూలు జనాలను బాగా రెచ్చగొట్టేందుకు చంద్రబాబు, అనుకూల మీడియా ప్రయత్నాలు బాగానే చేసినా అది సాధ్యంకాలేదు.
నిజంగా ఏపీలో ఇప్పుడు జరుగుతున్న పరిణామాలు చంద్రబాబు నాయుడుకు ఊహించని షాక్ అనే చెప్పాలి. హెల్త్ యూనివర్సిటీకి జగన్ ప్రభుత్వం ఎన్టీఆర్ పేరు తీసేసి డాక్టర్ వైఎస్సార్ పేరు పెట్టింది. వెంటనే చంద్రబాబుతో పాటు ప్రతిపక్షాలు, ఎల్లోమీడియా గోల మొదలుపెట్టాయి. తమ దెబ్బకు ఆకాశం చిల్లులు పడుతుందని, భూకంపం వచ్చేస్తుందని చంద్రబాబు అనుకున్నట్లున్నారు. కానీ అలాంటిదేమీ జరగకపోతే సీన్ రివర్సవుతోంది.
జగన్ కు వ్యతిరేకంగా పార్టీ నేతలు, శ్రేణులతో పాటు మామూలు జనాలను బాగా రెచ్చగొట్టేందుకు చంద్రబాబు, టీడీపీ అనుకూల మీడియా ప్రయత్నాలు బాగానే చేసినా అది సాధ్యంకాలేదు. పార్టీ నేతలు ఏదో మొక్కుబడిగా స్పందించారు కానీ మామూలు జనాలైతే అసలు పట్టించుకోనే లేదు. యూనివర్సిటీ పేరుమార్పునకు తమకు అసలు ఎలాంటి సంబంధం లేదన్నట్లుగానే జనాలు వ్యవహరిస్తున్నారు. కారణం ఏమిటంటే ఇప్పటి తరానికి ఎన్టీఆర్ పెద్దగా పరిచయం లేకపోవటమే.
ఇప్పటి తరానికి ఎన్టీఆర్ అంటే జూనియర్ ఎన్టీఆరే. గూగుల్ సెర్చ్‌లో ఎన్టీఆర్ అని టైపుచేస్తే ఎక్కువగా కనిపించేది జూనియర్ ఎన్టీఆర్ ఫొటోలు మాత్రమే. కాబట్టి టీడీపీ వ్యవస్ధాపకుడు ఎన్టీఆర్ కు అప్పుడు ఏమి జరిగింది..? ఇప్పుడు జరుగుతున్న అన్యాయం ఏమిటనే విషయాలపై పెద్దగా అవగాహన లేదు. చాలామందికి తెలిసిందేమంటే దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ ప్రవేశపెట్టిన పథకాలకు 2014-19 మధ్య కాలంలో చంద్రబాబు ప్రభుత్వం ఎన్టీఆర్ పేరుపెట్టడమే. అప్పుడు చంద్రబాబు చేసిన పనినే ఇప్పుడు జగన్ చేస్తున్నాడు కదా అని జనాలు పట్టించుకోవటంలేదు.
అలాగే 1995లో ఎన్టీఆర్ వారసులు, చంద్రబాబు+దగ్గుబాటి+బాబు అనుకూలమీడియా అంతా కలిపే ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచి, పార్టీని లాగేసుకుని.. ఆయన చనిపోవటానికి కారణమయ్యారన్నది వాస్తవం. అయితే అప్పట్లో కూడా జనాలు ఆ ఎపిసోడ్ ను పట్టించుకోలేదు. అదేదో పార్టీ లేదా కుటుంబ వ్యవహారంగా అనుకున్నారు. సంతానం+కుటుంబసభ్యులు కలిసి ఎన్టీఆర్ కు తీరని అన్యాయం, అవమానం చేసినప్పుడు ఇక మిగిలిన వాళ్ళకు ఎన్టీఆర్ అంటే అభిమానం ఎందుకుండాలనే చర్చ నడుస్తోంది. ఈ కారణంతోనే ఎన్టీఆర్ పేరుమార్చిన వివాదమంతా కేవలం మీడియా, సోషల్ మీడియాకు మాత్రమే పరిమితమైపోయింది. దీన్ని చంద్రబాబు ఏమాత్రం ఊహించనట్లులేదు. తనను తాను ఎక్కువగా అంచనా వేసుకోవటంతోనే చంద్రబాబుకు పెద్ద షాక్ తగిలినట్లయ్యింది.