ఇక్కడ చంద్రబాబే ఆశలు వదిలేసుకున్నారా?
నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి నియోజకవర్గంలో టీడీపీ పరిస్ధితి ఎలాగైపోయిందంటే 2004 ఎన్నికల నుండి పార్టీ ఇక్కడ అసలు గెలవనే లేదు.
కొన్ని నియోజకవర్గాల్లో తెలుగుదేశం పార్టీ పరిస్ధితి చాలా విచిత్రంగా తయారైంది. ఎంత వెతికినా చంద్రబాబు నాయుడుకు గట్టి నేతలే దొకటంలేదట. ఇలాంటి నియోజకవర్గాల్లో నెల్లూరు జిల్లాలోని సర్వేపల్లి కూడా ఒకటి. ఈ నియోజకవర్గంలో టీడీపీ పరిస్ధితి ఎలాగైపోయిందంటే 2004 ఎన్నికల నుండి పార్టీ ఇక్కడ అసలు గెలవనే లేదు. వరుసగా నాలుగు ఎన్నికల్లో ఓడిపోయిన ఘనత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికే దక్కుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు.
1994, 99 ఎన్నికల్లో వరుసగా సోమిరెడ్డి టీడీపీ తరపున గెలిచారు. అంతే ఆ తర్వాత మళ్ళీ గెలిచిందే లేదు. రెండు సార్లు కాంగ్రెస్ అభ్యర్ధి ఆదాల ప్రభాకరరెడ్డిపైన ఆ తర్వాత మరో రెండు సార్లు వైసీపీ నేత కాకాణి గోవర్ధనరెడ్డిపైన సోమిరెడ్డి ఓడిపోయారు. నాలుగు వరుస ఎన్నికల్లో టీడీపీ ఓడిపోయిన తర్వాత ఇక బలమైన నేతలు, క్యాడర్ ఎక్కడ దొరుకుతారు. ఈ నియోజకవర్గంలో గెలుపు ఆశలను చంద్రబాబు నాయుడే వదిలేసుకున్నట్లున్నారు.
అసెంబ్లీకి పోటీచేసి సోమిరెడ్డి ఓడిపోతున్నా జిల్లాలో పెద్దరికం మాత్రం ఆయనకే కట్టబెడుతున్నారు. ప్రత్యక్ష ఎన్నికల్లో ఓడిపయినా సరే పార్టీ అధికారంలోకి వస్తే జిల్లాలో పెత్తనమంతా సోమిరెడ్డికే చంద్రబాబు అప్పగించారు. 2019 ఎన్నికల్లో ఓడిపోయిన వెంటనే ఎమ్మెల్సీగా అవకాశమిచ్చి మంత్రిని చేశారు. గెలిచినా, ఓడినా నియోజకవర్గంలో పెత్తనమంతా సోమిరెడ్డి చేతిలోనే ఉంటుందని అర్ధమైపోవటంతో టికెట్ కోసం వేరే నేతలెవరూ కనీసం ప్రయత్నం కూడా చేయటంలేదు. సర్వేపల్లి నియోజకవర్గమంటే సోమిరెడ్డి లేదా ఆయన కొడుకు మాత్రమే అన్నట్లుగా తయారైంది.
దానివల్ల ఏమైందంటే పార్టీలో గట్టి నేతే లేకుండాపోయారు. దీనివల్లే సోమిరెడ్డి వరుసగా పోటీచేస్తున్నా నేతల నుండి సపోర్టు రావటంలేదు. ఇపుడు సోమిరెడ్డికి కాకుండా వేరే నేతకు టికెట్ ఇద్దామని ప్రయత్నిస్తుంటే గట్టి నేతలే దొరకటంలేదు. జన బలంలేని సోమిరెడ్డి పరిస్ధితి చివరకు ఎలాగైపోయిందంటే ప్రతిరోజు మీడియా సమావేశాలు పెట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆరోపణలు, విమర్శలతో కాలక్షేపం చేస్తున్నారంతే. ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేయాలని చంద్రబాబు పిలుపిస్తుంటే నియోజకవర్గంలో కనీసం స్పందన కూడా కనబడటం లేదట. ఈ నియోజకవర్గంలో గెలుపు కాదుకదా కనీసం గట్టిపోటికి అభ్యర్ధే దొరకని పరిస్ధితికి దిగజారిపోయింది.