Telugu Global
Andhra Pradesh

అధికారులపై చిర్రుబుర్రు.. తొలిభేటీలోనే బాబు ఆగ్రహావేశాలు

ఫస్ట్ మీటింగ్ లోనే చంద్రబాబు అధికారులకు వార్నింగ్ ఇచ్చారు. అధికారులు ఆత్మ విమర్శ చేసుకోవాలని చెప్పారు.

అధికారులపై చిర్రుబుర్రు.. తొలిభేటీలోనే బాబు ఆగ్రహావేశాలు
X

తనకంటే పెద్దవారయితే అన్నా అని ఆప్యాయంగా పిలిచేవారు, చిన్నవారిని పేరు పెట్టి భుజం తట్టేవారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారుల సమీక్షల్లో మునుపటి సీఎం జగన్ ప్రవర్తించే తీరిది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ప్రభుత్వం మారాక తొలి సమీక్షలోనే ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు చుక్కలు చూపించారు సీఎం చంద్రబాబు. గత ఐదేళ్లలో పాలనను భ్రష్టుపట్టించారంటూ మండిపడ్డారు. కొంతమంది అధికారులు గౌరవప్రదమైన సర్వీసులో ఉంటూ రాష్ట్రానికి తీరని అన్యాయం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. వ్యవస్థలను మళ్లీ గాడిలో పెట్టాల్సిన అవసరం ఉందన్నారు. మరోసారి వివరంగా అన్ని విషయాలు చెబుతానంటూ తొలిభేటీని కేవలం ఆగ్రహావేశాలకే పరిమితం చేసి ముగించారు సీఎం చంద్రబాబు.

సచివాలయంలో బాధ్యతలు స్వీకరించిన అనంతరం తనకు అభినందనలు తెలిపేందుకు వచ్చిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు సీఎం చంద్రబాబు. గత ప్రభుత్వంపై ప్రజల్లో అంత కసి, నిస్పృహ వచ్చాయంటే గత ఐదేళ్లలో జరిగిన విధ్వంసకర, ప్రజావ్యతిరేక విధానాలే కారణమని అన్నారాయన. ఆ విషయంలో కొందరు ఐఏఎస్, ఐపీఎస్‌లకూ కీలకపాత్ర ఉందన్నారు. ప్రభుత్వ విభాగాలన్నీ గాడి తప్పాయనన్నారు. గత ఐదేళ్లలో కొందరు ఉన్నతాధికారులు అన్యాయంగా ప్రవర్తించారని, వారి తీరు తనను చాలా బాధించిందని అన్నారు చంద్రబాబు.

వారికి నో ఎంట్రీ..

కూటమి విజయం తర్వాత కొంతమంది అధికారులు తనను కలిసేందుకు వచ్చినా వారికి పర్మిషన్ ఇవ్వలేదు చంద్రబాబు. ఇప్పుడు బాధ్యతల స్వీకరణ తర్వాత కూడా కొంతమంది పట్ల ఆయన ఇలానే వివక్ష చూపించారు. శ్రీలక్ష్మి, పీఎస్‌ఆర్‌ ఆంజనేయులు సచివాలయంలో నేరుగా చంద్రబాబుని కలిసేందుకు పూలబొకే తీసుకుని వెళ్తుండగా వారిని సీఎం సెక్యూరిటీ అధికారులు వారించారు. అనుమతి లేదని, మీటింగ్ హాల్ లోనే కూర్చోబెట్టారు. ఆ తర్వాత అందరు అధికారులతో చంద్రబాబు మీటింగ్ హాల్ లోనే సమావేశమయ్యారు. అధికారులు ఆత్మ విమర్శ చేసుకోవాలని చెప్పారు. మొత్తమ్మీద ఫస్ట్ మీటింగ్ లోనే చంద్రబాబు అధికారులకు వార్నింగ్ ఇచ్చారు.

First Published:  14 Jun 2024 7:39 AM IST
Next Story