Telugu Global
Andhra Pradesh

ఒకటి కాదు ఐదు సంతకాలు.. టీడీపీ రివర్స్ అటాక్

ఐదు ఫైల్స్ పై చంద్రబాబు సంతకాలు చేసినా.. అందులో ఆర్థిక భారం వెనువెంటనే కనపడే పథకం పెన్షన్ల పెంపు ఒక్కటే. మిగతా వాటిని అమలు చేసినా ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందేమీ లేదు.

ఒకటి కాదు ఐదు సంతకాలు.. టీడీపీ రివర్స్ అటాక్
X

అధికారంలోకి వచ్చాక మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఫైల్ పై తొలి సంతకం చేస్తానని మాటిచ్చిన చంద్రబాబు.. ప్రమాణ స్వీకారం తర్వాత సైలెంట్ గా తిరుమల వెళ్లిపోయారంటూ వైసీపీ అభిమానులు అప్పుడే ట్రోలింగ్ మొదలు పెట్టారు. తొలి సంతకం పెడతానన్న బాబుకి పెన్ను దొరకలేదేమోనంటూ సోషల్ మీడియాలో సెటైర్లు పేలుతున్నాయి. ఈ దశలో టీడీపీ రివర్స్ అటాక్ మొదలు పెట్టింది. ఒక సంతకం కాదు, చంద్రబాబు ఐదు సంతకాలకు రెడీ అయ్యారంటూ అనుకూల మీడియా ద్వారా కథనాలు ప్రసారం చేస్తోంది.

ఆ ఐదు సంతకాలు ఏంటంటే..?

తిరుమల శ్రీవారి దర్శనం కోసం వెళ్లిన చంద్రబాబు రేపు(గురువారం) అమరావతికి చేరుకుంటారు. గురువారం సాయంత్రం 4.41 గంటలకు ఆయన సచివాలయంలోని మొదటి బ్లాక్ లో లాంఛనంగా బాధ్యతలు స్వీకరిస్తారని అంటున్నారు. బాధ్యతల స్వీకరణ అనంతరం ఆయన ఐదు ఫైల్స్ పై సంతకాలు పెడతారని తెలుస్తోంది. ఈ ఐదు ఫైల్స్ ని అధికారులు రెడీ చేస్తున్నారట. మెగా డీఎస్సీపై తొలి సంతకం, ల్యాండ్‌ టైటిలింగ్‌ యాాక్ట్ రద్దుపై రెండో సంతకం, సామాజిక పెన్షన్ రూ.4వేలకు పెంచుతూ మూడో సంతకం, స్కిల్‌ సైన్సెస్‌పై నాలుగో సంతకం, అన్న క్యాంటీన్ల ఏర్పాటుపై ఐదో సంతకం చేస్తారనే ప్రచారం జరుగుతోంది.

సూపర్-5

ఐదు ఫైల్స్ పై చంద్రబాబు సంతకాలు చేసినా.. అందులో ఆర్థిక భారం వెనువెంటనే కనపడే పథకం పెన్షన్ల పెంపు ఒక్కటే. మిగతా వాటిని అమలు చేసినా ఇప్పటికిప్పుడు వచ్చిన ఇబ్బందేమీ లేదు. అయితే అన్నిటికంటే ముఖ్యమైన హామీ.. ఆర్టీసీ బస్సుల్లో మహిళల ఉచిత ప్రయాణానికి సంబంధించిన ఫైల్ పై చంద్రబాబు ఎప్పుడు సంతకం పెడతారనేది తేలాల్సి ఉంది. ఆ సంతకం పెడితే, వెంటనే మహిళలకు ఉచిత ప్రయాణం అమలులోకి వస్తుంది. తెలంగాణలో ముందుగా ఈ హామీనే అమలు చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి చంద్రబాబు మనసులో ఏముందో వేచి చూడాలి.

First Published:  12 Jun 2024 4:47 PM GMT
Next Story